ఆడపిల్లలకోసం... బుల్లెట్టు యాత్ర!

సరిహద్దులోనే కాదు...  దేశంలోనూ సమస్యలున్నాయి. వాటిపై ఆడపిల్లలకు అవగాహన కలిగిస్తూ, వాళ్లను ముందుకు నడిపించే లక్ష్యంతో సీమా భవానీ శౌర్య యాత్రను చేపట్టారు  బీఎస్‌ఎఫ్‌ మహిళా జవాన్‌ బృందం.

Updated : 30 Mar 2022 03:54 IST

సరిహద్దులోనే కాదు...దేశంలోనూ సమస్యలున్నాయి. వాటిపై ఆడపిల్లలకు అవగాహన కలిగిస్తూ, వాళ్లను ముందుకు నడిపించే లక్ష్యంతో సీమా భవానీ శౌర్య యాత్రను చేపట్టారు  బీఎస్‌ఎఫ్‌ మహిళా జవాన్‌ బృందం. రాయల్‌ఎన్‌ఫీల్డ్‌లపై సాగిన వీరి దేశయాత్ర విశేషాలివి...

‘సీమా భవానీ’ పేరుతో 2016లో మన ప్రభుత్వం ఈ సాహస మహిళల బృందాన్ని తీర్చిదిద్దింది. 2018, 2022 దిల్లీ గణతంత్ర వేడుకల్లో ఈ బృందం బైకులపై ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసింది. ఆ స్ఫూర్తిని తోటి ఆడపిల్లల్లోనూ నింపాలనే, 36మంది బీఎస్‌ఎఫ్‌ మహిళా జవానుల బృందం ‘సీమా భవానీ శౌర్య మహిళా సాధికార యాత్ర’ను మొదలుపెట్టింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన దిల్లీ ఇండియా గేట్‌ నుంచి మొదలైన వీరి యాత్ర వాఘా, అమృత్‌సర్‌, జైపుర్‌, గాంధీనగర్‌, కవాడియా, షోలాపూర్‌, హైదరాబాద్‌, అనంతపురం, బెంగళూరు, మదురై, కన్యాకుమారి మార్గాలమీదుగా ఈ నెల 29న చెన్నైకి చేరుకుంది. మొత్తం 5,280కి.మీ దూరం ప్రయాణించారు. 25 నుంచి 40ఏళ్ల వయసున్న వీరిలో తల్లులు కూడా ఉన్నారు. ‘ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపి స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకునేలా చూడాలన్నదే మా యాత్ర లక్ష్యం. మాలో 80శాతం మందికి బీఎస్‌ఎఫ్‌లో చేరకముందు సైకిల్‌ తొక్కడం కూడా రాదు. ఇప్పుడు మేం బైకులపై చేసే విన్యాసాలు చూస్తే గుండెలు ఝల్లుమంటాయి.

ఇప్పటికీ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల్ని చదువుకోసం బయటికి పంపడంలేదు. చిన్నవయసులో పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ పరిస్థితి మారాలన్నదే మా ప్రయత్నం. మార్గమధ్యంలోని గ్రామాల్లో ఎన్నో కుటుంబాల్ని కలిశాం. వివిధ సంఘాలవారితో సమావేశమై ఆడపిల్లలపట్ల వివక్షను మానుకొని వాళ్లని చదువుకునేలా ప్రోత్సహించమని చెప్పాం’ అని వసుంధరకు వివరించారు ఈ యాత్రకు నాయకత్వం వహించిన హిమాన్షు సిరోహి. ‘మేం వస్తున్నామని తెలిసి గ్రామీణ మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి, సన్మానాలు చేశారు. వారి స్పందనకు సంతోషంగా ఉంది. వరుసగా 20 రోజులు... రోజుకి 200కి.మీ నుంచి 290కి.మీ మేర ప్రయాణించాం. అంత దూరం ప్రయాణించాలంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం కదా. అందుకే వ్యాయామాలు, తగినంత విరామం, బలవర్ధక ఆహారంపై దృష్టిపెట్టాం. చాలా రాష్ట్రాల్లో రోడ్లు సరిగా లేవు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మా వెంట సాంకేతిక బృందం, మెకానిక్‌లు ఉన్నారు కాబట్టి ఈ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాం’ అంటారు జవాన్‌, సోలో ట్రావెలర్‌ కూడా అయిన కంచన్‌ ఉగుర్‌సంది.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్