Updated : 03/06/2022 13:15 IST

కవితతో కంటతడి పెట్టించింది

అయిదేళ్ల చిన్నారి.. వేదికపై భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ఓ కవితను వినిపించింది. అది అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిరుప్రాయం నుంచే ఈ అంశంపై అందరిలో అవగాహన తేవడానికి కృషి చేస్తూ బాలపురస్కార్‌ వంటి ఎన్నో అవార్డులు అందుకున్న 23 ఏళ్ల సంజోలీ స్ఫూర్తి కథనమిది.

బాల్యంలోనే తన తల్లిపై జరిగిన గర్భస్రావ యత్నం ఆమెను ఎంత మానసిక క్షోభకు గురిచేసిందో దగ్గర నుంచి చూసింది మహారాష్ట్ర, కర్నాల్‌కు చెందిన సంజోలీ. ఈమెకు అయిదేళ్లప్పుడు రెండోసారి గర్భం దాల్చిన తల్లికి లింగనిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియడంతో అత్తగారింట్లో గర్భస్రావం చేయించడానికి ప్రయత్నించారు.  సంజోలీ తల్లిదండ్రులు పెద్దవారికి ఎదురునిలవడంతో సంజోలీకి చెల్లి అనన్య పుట్టింది. తన మనసులోని వేదనను తల్లి సంజోలీకి చెప్పుకొనేది. ఆడపిల్ల అయితే మాత్రం ఎందుకలా చేయాలంటూ అమాయకంగా అమ్మను ప్రశ్నించేది. సంజోలీలోని ప్రశ్నించే లక్షణాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆమెతోనే సమాజాన్ని ప్రశ్నించేలా చేయాలనుకున్నారు. 2004లో అయిదేళ్ల వయసులోనే సంజోలీ గర్భస్రావానికి వ్యతిరేకంగా యమునానగర్‌లో జరిగిన ‘లోహ్రి’ కార్యక్రమంలో పాల్గొంది. బేటీ కా నామ్‌ పేరుతో కూతురిని కన్న తల్లిదండ్రులకు నగదు బహుమతిని అందించిన ఆ వేదికపై తన తండ్రి రాసిన ఓ పద్యాన్ని మైకులో ధైర్యంగా వినిపించింది. ‘నన్ను జాగ్రత్తగా నడిపించు.. జీవించడానికి నాకొక అవకాశాన్నివ్వు. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు నన్ను ముక్కలవ్వకుండా వచ్చేలా చూడు’ అంటూ ఆ చిన్నారి చెప్పిన కవిత అక్కడ అందరినీ కంట తడి పెట్టించింది. తన ఏడో ఏటనే హరియాణ ముఖ్యమంత్రి చేతులమీదుగా ‘బాల పురస్కార్‌’ను అందుకుంది.

అవగాహన.. ఓవైపు చదువుకుంటూనే అవగాహనాకార్యక్రమాల్లో పాల్గొనేది. తన పదో ఏట దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 4,800 కిలోమీటర్లు పర్యటించి, ‘సేవ్‌ డాటర్స్‌, సేవ్‌ ఎర్త్‌’ పేరుతో అవగాహన కలిగించింది. ‘ఎర్త్‌ ఇన్‌ ఫ్లేమ్స్‌’ పేరుతో తీసిన డాక్యుమెంటరీని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించేది. చెల్లి అనన్యతో కలిసి స్థానిక ఎన్జీవో ‘సారథి’ సహకారంతో భ్రూణహత్య, ఆడపిల్ల-చదువు, మహిళల మానసికారోగ్యం వంటి పలురకాల అంశాలపై అవగాహన అందిస్తోంది.

ప్రధానికి లేఖ... సంజోలి తన 16వ ఏట భ్రూణహత్యలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెల్లి అనన్యతో కలిసి  ప్రధాని మోదీకి ఉత్తరం రాసింది. ‘గర్భం దాల్చిన వెంటనే ఆ మహిళ గురించి వివరాలన్నింటినీ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రిజిస్టరు చేయించాలని ఆ లేఖలో కోరా. లింగనిర్ధారణ పరీక్షలను నిర్మూలించాలని అభ్యర్థించా. దీంతోపాటు మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ల ఏర్పాటు, వాటిలో మహిళా పోలీసు అధికారులను నియమిస్తే మహిళలు తమ సమస్యలను నేరుగా వారికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రస్తావించా. 2018లో హరియాణలోని దరార్‌ గ్రామాన్ని దత్తత తీసుకొని ‘సుశిక్షా’ పేరుతో మొబైల్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాం. యుక్తవయసువారికి చదువులో శిక్షణనిచ్చి, వారి ద్వారా చిన్నపిల్లలకు విద్యనందించడం మా ఉద్దేశం. ఇందులో ప్రస్తుతం 80 మంది పిల్లలున్నారు. అనన్య సహకారం ఎంతో ఉంది’ అని చెబుతున్న సంజోలీ 2019లో ‘గర్ల్‌టేక్‌ఓవర్‌పార్లమెంట్‌ ఇన్‌ ఆస్ట్రేలియా’ ప్రచారంలో పార్లమెంటులో మహిళలపాత్రపై ప్రసంగించి ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. సామాజికపరమైన అంశాలపై అందరిలో అవగాహన కలిగించే విభాగంలో గతేడాది ఈమెను ‘ది డయానా’ అవార్డు వరించడం విశేషం.    


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి