Published : 09/06/2022 18:35 IST

ఆర్డరిస్తే.. ఇంటికే పూలు!

పూజ, వేడుక ఏదైనా మనకు పూలతోనే పని. ముందే తెచ్చుకుంటేనేమో వాడిపోతాయి. కొన్నిసార్లు తేమ ఎక్కువై పాడవుతుంటాయి. వీటికి పరిష్కారంగా ‘హూవు ఫ్రెష్‌’ను తీసుకొచ్చారు యశోద, రియా. వాడిన పూలకీ ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు. అదేంటో చదివేయండి.

శోద, రియా అక్కాచెల్లెళ్లు. వీళ్లనాన్న రామకృష్ణ కరుటూరి ఇథియోపియాలో గులాబీ తోటలున్నాయి. దేశవిదేశాలకు పూలను సరఫరా చేస్తారు. వాటిని చూస్తూ పెరిగారు వీళ్లిద్దరూ. రియా స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ సొసైటీలో బ్యాచిలర్స్‌; యశోద వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. చదువు పూర్తయ్యాక నాన్నకు వ్యాపారంలో సాయం చేయడం మొదలుపెట్టారు. ఓరోజు వాళ్లమ్మ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు పూలు ఆలస్యమవడం, వాటిలో కొన్ని తడిచి పాడవడం చూసినపుడు వీళ్లు ఆలోచనలో పడ్డారు.

‘పూజకు వాడే పూలకు మన దేశంలో ఎంత ప్రాధాన్యం ఉంటుందో మనకు తెలిసిందే. వాటిని అలా పాడైపోయి చూడటం ఇబ్బందిగా అనిపించింది. మాది పూలవ్యాపారం. బొకేలు, డెకరేషన్లకు ఉపయోగించే పూలను కనీసం 5 నుంచి15 రోజులు తాజాగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాం. ఆ ప్రమాణాలను వీటి విషయంలో ఎవరూ పాటించకపోవడం ఆశ్చర్యమేసింది. అందుకే బొకే వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందినా.. పూజ, వేడుకల పూలది మాత్రం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఎంతో గిరాకీ ఉండే దీనిలో మేం మార్పులు తేవాలనుకున్నాం. దీంతో 2019లో ‘రోజ్‌ బజార్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించాం. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి తాజాపూలను అందించడమే మా పని. 2020లో దీన్నే ‘హూవు’గా మార్చాం. అంటే కన్నడలో పువ్వు అని అర్థం. పూజ అనగానే ఎవరికైనా వాళ్ల మాతృభాషే గుర్తొస్తుంది కదా! అందుకే ఇలా మార్పు చేశాం. పూలు కాస్త ఒత్తిడికే వడలిపోతాయి. అందుకే ప్యాకింగ్‌ దగ్గర్నుండి, డెలివరీ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. విడిపూల నుంచి దండల వరకు అందిస్తున్నాం. స్థానిక రైతులతో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లలో 90 శాతం ఆడవాళ్లే. ప్రముఖ ఈకార్ట్‌ సంస్థలు బిగ్‌బాస్కెట్‌, బ్లింకిట్‌, జొమాటో, స్విగీ.. ఇలా ఎన్నో సంస్థల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నాం. ఎవరు పట్టుకున్నారో అన్న భయం చాలామందికి ఉంటుంది. అందుకే ‘జీరో టచ్‌’ విధానాన్ని ప్రారంభించాం. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై సహా ఎన్నో పట్టణాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి’ అని చెబుతున్నారీ అక్కా చెల్లెళ్లు.

లాక్‌డౌన్‌లో అందరూ ఇబ్బంది పడితే వీళ్ల వ్యాపారం మాత్రం బాగా పుంజుకుంది. రెండేళ్లలో 10 రెట్లు పెరిగింది. నెలకు లక్షన్నరకుపైగా ఆర్డర్లు అందుకుంటారట. పండగవేళల్లో ఇది ఇంకా ఎక్కువే. నెలవారీ సబ్‌స్క్రిప్షన్లూ మొదలుపెట్టారు. పెద్ద పెద్ద గుళ్లూ వీరి ఖాతాదారులే. ఈ మొత్తానికి వీళ్లు పెట్టిన పెట్టుబడి రూ.10 లక్షలు. వ్యాపారాభివృద్ధి నచ్చి ఓ సంస్థ రూ.91 లక్షలు పెట్టుబడి పెట్టింది. పూలను తాజాగా ఉంచే టెక్నిక్‌లతో 40% వృథా ఆపారు సరే.. రోజూ వాడిన పూల ద్వారా కూడా చెత్త పేరుకుంటోందని గ్రహించారీ అక్కాచెల్లెళ్లు. దీంతో గుళ్ల నుంచి వాడిన పూలను సేకరించి వాటితో రసాయనాల్లేని అగర్‌బత్తీలు తయారు చేస్తున్నారు. త్వరలో ఇళ్లకీ దీన్ని విస్తరిస్తామంటున్నారు. దీన్నో పెద్ద వ్యాపారంగా మలచడంతోపాటు మరింత మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమంటున్నారీ యువతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి