వైఫల్యాల నుంచి...వందల బ్రాండ్లను సృష్టిస్తోంది!
ఎన్నో ఆశలతో వ్యాపారంలోకి అడుగుపెట్టాక... తీరా అది నష్టాల్లోకి వెళితే ఎంత బాధ? దానికి ఇంట్లోవాళ్ల సూటిపోటి మాటలూ తోడైతే! అదింకా నరకం. ఆ బాధ ‘అనూజ’కీ తెలుసు. తను అనుభవించిన ఆ వేదన మరెవ్వరికీ రాకూడదనుకుంది. ఓ సంస్థను స్థాపించి వందల స్టార్టప్‌లకు మార్గదర్శి అయ్యింది. వాటికో బ్రాండ్ విలువను సృష్టిస్తోంది. తనూ భిన్న వ్యాపారాల్లో రాణిస్తోంది. వైఫల్యం నుంచి విజయం వైపు సాగుతోన్న ఆమె కథేంటో చదివేయండి!
ఎన్నో ఆశలతో వ్యాపారంలోకి అడుగుపెట్టాక... తీరా అది నష్టాల్లోకి వెళితే ఎంత బాధ? దానికి ఇంట్లోవాళ్ల సూటిపోటి మాటలూ తోడైతే! అదింకా నరకం. ఆ బాధ ‘అనూజ’కీ తెలుసు. తను అనుభవించిన ఆ వేదన మరెవ్వరికీ రాకూడదనుకుంది. ఓ సంస్థను స్థాపించి వందల స్టార్టప్‌లకు మార్గదర్శి అయ్యింది. వాటికో బ్రాండ్ విలువను సృష్టిస్తోంది. తనూ భిన్న వ్యాపారాల్లో రాణిస్తోంది. వైఫల్యం నుంచి విజయం వైపు సాగుతోన్న ఆమె కథేంటో చదివేయండి!
మధ్యతరగతి.. సంప్రదాయ కుటుంబం అనూజది. తన జీవితం తన చేతుల్లోకి రావాలంటే కష్టపడటం ఒక్కటే మార్గమని చిన్న తనంలోనే అర్థమైంది. అందుకే తన దృష్టంతా చదువుపైనే పెట్టింది! సివిల్ ఇంజినీరింగ్ చేసింది. తనది కేరళలోని ఎర్నాకుళం. పెళ్లయ్యాక దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ కార్పొరేట్ సంస్థల్లో మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వివిధ విభాగాల్లో పనిచేసింది. పదేళ్ల అనుభవం సాధించాక ఓషన్ టెక్నాలజీలో ఎంటెక్ చేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యింది. అప్పుడే చదువుకీ, పరిశ్రమ అవసరాలకీ మధ్య ఎంత తేడా ఉందో అర్థమైంది తనకు. ఇంతలో వాళ్ల కుటుంబం భారత్‌కి తిరిగొచ్చింది. ఇక్కడా అదే సమస్యను గమనించింది. దీంతో 2014లో లైక్స్ (లెర్నింగ్ ఇన్నొవేటివ్ కీ ఎంప్లాయ్‌మెంట్ స్కిల్స్) ప్రారంభించింది. కార్పొరేట్ సంస్థలు కోరుకునే నైపుణ్యాలు, లక్షణాలను కోర్సులుగా అందించేది. కానీ తనొక్కరితో అది సాధ్యం కాదని ఆమెకు త్వరగానే అర్థమైంది. ఉద్యోగం మానేసి రాత్రింబవళ్లూ పడ్డ శ్రమంతా వృథా అయ్యింది. పెట్టుబడి పోవడంతోపాటు.. ఇంట్లో వాళ్ల ఎత్తిపొడుపులు. వాటిని తట్టుకోలేక మళ్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరింది.
వారికి చేయూతగా... ఏమాత్రం సమయం దొరికినా వర్క్‌షాపులు నిర్వహించేది. బోధనలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టేది. అయినా సొంతంగా ఏదో చేయాలన్న తపన. అందుకే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసి.. సొంత ప్రాజెక్టులు చేయడం మొదలు పెట్టింది. క్రమంగా పెద్ద కార్పొరేట్ సంస్థలతో పనిచేసే స్థాయికి ఎదిగింది. వ్యాపారాంశాల్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుందని ఎంబీఏ చేసింది. కార్పొరేట్ సంస్థలతో పనిచేసిన అనుభవం, చదువు వ్యాపార టెక్నిక్‌లు అర్థం చేసుకోవడానికి సాయపడ్డాయి. దాంతోపాటు అందరూ ఎక్కడ విఫలం అవుతున్నారన్నదీ తెలిసింది. అలాంటి వాళ్లకి సాయం చేయాలని 2017లో కొచ్చీలో ‘ఆరియా’ ప్రారంభించింది. ఇదో బ్రాండ్ మార్కెటింగ్ సంస్థ. మార్కెటర్స్, స్ట్రాటజిస్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, డెవలపర్లు, ఫైనాన్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, హెచ్‌ఆర్ సహా అన్ని విభాగాలవారూ ఇందులో ఉంటారు. ఒక ఆలోచనను వ్యాపారంగా మలిచేలా సాయం చేయడమే కాదు... ఆ బ్రాండ్ వినియోగదారులకు చేరువయ్యేలా వ్యూహాలు రూపొందిస్తుంది. ఉదాహరణకు ఆపిల్ అనగానే టెక్నాలజీ ఆవిష్కరణలు, టాటా అంటే నమ్మకం.. ఇలా ఎలా గుర్తొస్తున్నాయో... కొత్త బ్రాండ్‌లకూ అలాంటి విలువను తెచ్చిపెడుతుంది. త్వరగానే బ్రాండ్ స్ట్రాటజిస్ట్‌గా పేరు తెచ్చుకొంది. స్నేహితుడితో కలిసి ‘ఫ్లెక్సీక్లౌడ్’ సంస్థను మొదలుపెట్టింది. క్లయింట్ల యాప్‌లను క్లౌడ్‌లో సులభంగా చేర్చడమే దీని పని.
అంతర్జాతీయ ఖ్యాతి పట్టుదల, శ్రమ తనను ఏ స్థాయికి చేర్చాయంటే... ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెయ్యికిపైగా స్టార్టప్‌లు, చిన్న మధ్యతరహా సంస్థలు ఈమె ఖాతాదారులు. అంతేనా... డబ్ల్యూఐసీసీఐ, నాస్కామ్, నీతిఆయోగ్, ఐఐఎం కాశీపూర్, ఐఐటీ మండి, కేరళ స్టార్టప్ మిషన్, జేఎన్‌ఎఫ్‌యూ వంటి ఎన్నో సంస్థలకూ మెంటార్ తను. టెడెక్స్ స్పీకర్ కూడా అయిన అనూజ విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం లైక్స్ సహా మరెన్నో వెంచర్లనూ ప్రారంభించింది. కొన్ని స్టార్టప్‌లకు పెట్టుబడిదారు కూడా. మహిళా వ్యాపారవేత్తలకు ప్రాధాన్యమిచ్చే తను వెనుకబడిన తరగతుల వారికి విద్య, ఉద్యోగావకాశాల్లోనూ సాయమందిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘విమెన్ ఎక్సలెన్స్’, ‘విమెన్ అచీవర్స్ 40 అండర్ 40’ వంటి పలు అవార్డులనూ అందుకుంది.
ఆరియా అంటే గ్రీకు భాషలో పర్వతమని అర్థం. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా అలా నిలబడాలన్న ఉద్దేశంతో సంస్థకు ఆ పేరు పెట్టా. దీనిలోకి అడుగుపెట్టే ముందే ఎన్నో సవాళ్లు ఉంటాయని నాకు తెలుసు. కానీ అవే వ్యక్తి ఎదుగుదలలో సాయపడతాయన్న విషయాన్ని బలంగా నమ్ముతా. మీమీద మీకు నమ్మకం ఉంటే అసాధ్యమనేదే ఉండదు. కాబట్టి, లక్ష్యాలను ఏర్పరచుకోవడంలోనూ, సాధించడంలోనూ ఎప్పుడూ వెనకడుగు వేయకండి. వైఫల్యాలకు భయపడకండి’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.