..దూసుకొచ్చారు
రెప్పపాటులో కంటిని మాయచేస్తూ.. రయ్యిన దూసుకుపోయే కార్లు. మనసుని ఉద్వేగంతో నింపేసే పరమాద్భుత విన్యాసాలు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూసితీరాలి అనుకొనేవారికి... ఈ అనుభూతులని పంచడానికి సిద్ధంగా ఉంది హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్).
రెప్పపాటులో కంటిని మాయచేస్తూ.. రయ్యిన దూసుకుపోయే కార్లు. మనసుని ఉద్వేగంతో నింపేసే పరమాద్భుత విన్యాసాలు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూసితీరాలి అనుకొనేవారికి... ఈ అనుభూతులని పంచడానికి సిద్ధంగా ఉంది హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్). ఈ లీగ్‌లో మెరికల్లాంటి ఆరుగురు అమ్మాయిలు కూడా పోటీపడుతుండటం మరో విశేషం. వాళ్లలో కొందరి గురించి తెలుసుకుందాం రండి...
ఇంటికి దూరమైన బాధ ఉండేది...!
17 ఏళ్ల రేసర్ లోలా లవిన్స్‌ఫోస్.. ఈ రేసులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. వయసు చిన్నదే అని తక్కువ అంచనా వేయొద్దు. ఈ వయసుకే ప్రపంచ మహిళా రేసర్ల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందీ అమ్మాయి. మోటార్ స్పోర్ట్స్‌లో ఎంతోమంది విజేతలని అందించిన ఫ్రాన్స్‌లో పుట్టిన లోలా.. తొమ్మిదేళ్లకే రేసింగ్ మొదలుపెట్టింది. 13 ఏళ్లకే అద్భుతాలు సృష్టించింది. ఫ్రెంచ్ ఐఏఎమ్‌ఈ సిరీస్, ఫ్రాన్స్ ఛాంపియన్‌షిప్, స్పానిష్ ఎఫ్4 వంటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీలతో సహా 13 విజయాలు సొంతం చేసుకుంది. 30 రేసుల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఇటలీతో సహా ప్రపంచంలోని అన్ని ట్రాక్‌లపైనా డ్రైవ్ చేసింది. తండ్రి ఫార్ములా డ్రైవర్ కావడంతో తనూ ఈ క్రీడపై మమకారాన్ని పెంచుకుంది. ‘తొమ్మిదేళ్లప్పుడు నాన్నతో కలిసి సరదాగా ట్రాక్‌లో అడుగుపెట్టా. ఆ తర్వాత నుంచీ ఈ ట్రాక్‌ని వదల్లేదు. అంతర్జాతీయ రేసుల్లో అడుగుపెట్టా అసలు తీరికే దొరికేది కాదు. అందరు టీనేజర్లలా నా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానే బాధ ఉన్నా... ప్రపంచం చుట్టివస్తున్నా అనే సంతోషం ఉంది. ఇప్పుడు కూడా నాన్నే నన్నిక్కడికి తీసుకొచ్చారు. చూస్తుంటే.. ఈ రేసుల్లో భారత్‌కు మంచి భవిష్యత్ ఉందనిపిస్తోంది. సోఫియా ఫ్లోరెచ్ నా రోల్‌మోడల్. అమ్మానాన్నల సహకారం లేకపోతే నేనీ స్థాయిలో ఉండేదాన్ని కాదేమో! రేసులు లేకపోతే మామూలు అమ్మాయిల్లానే స్కూల్‌కెళ్లి చదువుకుంటాను. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూ సిరీస్‌లో జాయిన్ అవ్వాలనేది నా లక్ష్యం’.
వాళ్లకు భారం అవ్వొద్దని..
నాన్నతో సరదాగా చేసే దూర ప్రయాణాలు 10 ఏళ్ల సెలియా మార్టిన్‌కి రేసులపై ఆసక్తి కలిగించాయి. తన కల ఇంట్లోవాళ్లకి భారమవకూడదనుకొని లా అండ్ పర్సనల్ వెల్త్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది. చదువుతూనే రేసర్లతో స్నేహం ఏర్పరచుకుంది. వాళ్ల సాయంతో నేర్చుకుంది కూడా. 2014లో మొదటిసారి పోటీలో పాల్గొన్నాక తనపై తనకు నమ్మకం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ రేసింగ్ టీమ్‌ను నడిపించింది. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక దీనిపై పట్టు సాధించడానికి జర్మనీ వెళ్లింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ సంస్థలకు, న్యూబోర్గ్‌రింగ్ టెస్టింగ్ సెంటర్‌కు రేస్ ట్యాక్సీ పైలట్‌గా చేసింది. ప్రొఫెషనల్ రేసర్ మాత్రమే కాదు.. ఇన్‌స్ట్రక్టర్, ఫార్ములావన్ రేస్‌లకు హోస్ట్ కూడా. 2018 నుంచి రేసింగ్‌ను కెరియర్‌గా మార్చుకున్న తను ఇప్పటివరకూ 24 పోటీల్లో పాల్గొంది. వరల్డ్స్ ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎఫ్‌ఐఏ రేస్ సిరీస్- ద జాగ్వార్ 1 పేస్ ఈ ట్రోఫీ, న్యూబోర్గ్‌రింగ్ 24 గంటల రేస్, గిటీ టైర్ మోటార్ స్పోర్ట్స్ మొదలైనవి తన కెరియర్‌లో ప్రముఖమైనవి. ‘గొప్ప రేసర్‌గా నిలవాలి. అమ్మాయిల్ని ఈ రంగంలో నడిపించాలి. ఇదే నా కల’ అంటోన్న 31 ఏళ్ల సెలియా దిల్లీ తరఫున పోటీపడుతోంది.
స్కూల్ తెలియదు..
మూడేళ్ల వయసులో మీరేం చేశారు? బెంగళూరు తరఫున పోటీపడుతోన్న ఫిలిప్పీన్ రేసర్ బియాంకా బస్టమాంటే మాత్రం నాన్నతో కలిసి రేసులకెళ్లేది. ఆయన్ని చూసే రేసింగ్‌పై ప్రేమ కలిగింది. అయిదేళ్లప్పటి నుంచే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేది. ‘ఇక స్కూలుకెళ్లే అవకాశమేది? చదువంతా ఇంట్లోనే! కార్లు, రేసింగ్ ట్రాక్‌లే ప్రపంచం. తోటి రేసర్లే స్నేహితులు. అలాగని బాల్యం కోల్పోయానన్న భావనేమీ లేదు. రేసింగంటేనే బోలెడు ఖర్చు. ఆర్థికంగా ఇబ్బందైనా నాన్న తను కష్టపడుతూ ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఇదే నా లోకమైంది. ఆగ్నేయాసియాలో మోటార్ స్పోర్ట్స్‌ను ఎంచుకునేవారే అరుదు. దాన్ని మార్చి.. ఆసియన్ డ్రైవర్లూ అంతర్జాతీయంగా సత్తా చాటగలరని నిరూపించాలన్నదే నా లక్ష్యం’ అంటున్న 17 ఏళ్ల బియాంక.. 4 చైనా గ్రాండ్ ప్రిక్స్ కార్ట్ స్కాలర్‌షిప్‌లు, 3 మకావ్ ఇంటర్నేషనల్ కార్ట్ గ్రాండ్ ప్రిక్స్ గెల్చింది. ఎఫ్‌ఐఏ గర్ల్స్ ఆన్ ట్రాక్ రైజింగ్ స్టార్స్ స్కాలర్‌షిప్ అందుకున్న మొదటి ఆసియన్. రెండుసార్లు ఫిలిప్పీన్స్ నేషనల్ సీనియర్ కార్టర్, మూడుసార్లు డ్రైవర్ ఆఫ్ ద ఇయర్.. ఇలా తన ఖాతాలో విజయాలు బోలెడు. ఇవే అంతర్జాతీయ రేసింగ్ ప్రోగ్రామ్ డబ్ల్యూలో స్థానం కల్పించాయి. స్టెమ్ కోర్సుల్లో పదకొండో తరగతి చదువుతోన్న ఈమెకి ఎఫ్1 రేసర్ అవ్వడం కల అట.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.