Muthamil selvi:చావు కబురు తెలిస్తే చాలనుకున్నా!

పిట్టల్లా ఒక్కొక్కరుగా రాలిపోతున్న.. తోటి పర్వతారోహకులు. చుట్టూ శవాలు.. ఊపిరికూడా గట్టకట్టుపోయేంత చలి! కనీసం తన మరణ వార్తైనా కుటుంబానికి తెలియాలన్న తపన.. ఇలా సాగింది ఆమె ఎవరెస్ట్‌ శిఖర అధిరోహణం. చివరి నిమిషం వరకూ ఆమె చూపించిన ధైర్యమే తిరిగి మనతో మాట్లాడేలా చేసింది.

Updated : 03 Jun 2023 07:26 IST

పిట్టల్లా ఒక్కొక్కరుగా రాలిపోతున్న.. తోటి పర్వతారోహకులు. చుట్టూ శవాలు.. ఊపిరికూడా గట్టకట్టుపోయేంత చలి! కనీసం తన మరణ వార్తైనా కుటుంబానికి తెలియాలన్న తపన.. ఇలా సాగింది ఆమె ఎవరెస్ట్‌ శిఖర అధిరోహణం. చివరి నిమిషం వరకూ ఆమె చూపించిన ధైర్యమే తిరిగి మనతో మాట్లాడేలా చేసింది. ఆమె 34ఏళ్ల ముత్తమిళ్‌ సెల్వి. తమిళనాడులో స్థిరపడ్డ ఈ తెలుగు సాహసికురాలు ఎవరెస్ట్‌ దారిలో ఒళ్లు గగ్గుర్పొడిచే తన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారిలా..

డప నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం మాది. చెన్నై సమీపంలోని మన్నీవాక్కంలో ఉంటున్నాం. మావారు తెలుగువారే. జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మాకిద్దరు ఆడపిల్లలు. చిన్నతనం నుంచీ నాకో ప్రత్యేకత ఉండాలనుకొనేదాన్ని. సాహసాల ద్వారా ఆ గుర్తింపు సాధించా. శ్రీపెరంబుదూర్‌ దగ్గర మలైపట్టు గ్రామంలో కళ్లకు గంతలు కట్టుకుని 155 అడుగుల కొండను 58 సెకన్లలో ఎక్కా. కులుమనాలిలోనూ కళ్ల గంతలతో 165 అడుగుల కొండను 55సెకన్లలోనే ఎక్కా. గతేడాది గుర్రంపై వేగంగా వెళ్తూ 3 గంటలపాటు ఆపకుండా 1389 బాణాల్ని లక్ష్యాలకు గురిపెట్టా. ఈ మూడు ప్రపంచ రికార్డులనీ కొద్దిపాటి శిక్షణతోనే సాధించా.
తెలుగు ఐఏఎస్‌ అండతో ఎవరెస్ట్‌ ఎక్కాలన్నది నా కల. దాని కోసం 2నెలల ప్రత్యేక శిక్షణ తీసుకోవాలన్నారు. పిల్లల్ని వదిలి అంత కాలం ఉండలేకపోయా. 5000 మీ ఎత్తైన పర్వతం ఎక్కినా చాలని ప్రత్యామ్నాయం చూపించారు. దాంతో గతేడాది లద్దాఖ్‌లోని 5500మీ ఎత్తున్న కాంగెట్సె శిఖరం ఎక్కి ఆ అర్హత పొందా. కానీ ఎవరెస్ట్‌ ఎక్కడానికి ఖర్చు రూ.46 లక్షలవుతుందన్నారు. అంత నా దగ్గర లేదు. గతంలో మేమున్న విరుదునగర్‌ కలెక్టర్‌గా చేసిన మేఘనాథరెడ్డి తెలుగువారే. ఆయన ఇప్పుడు తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని కలిస్తే, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో మాట్లాడి ప్రభుత్వ సాయం అందేలా చేశారు. తక్కినది మా బంధువులు ఇచ్చారు. ఏప్రిల్‌ 2న చెన్నై నుంచి బయలుదేరా. మొత్తం 38 మంది సభ్యుల్లో.. భారత్‌ నుంచి 8మంది ఉన్నాం.

చావో రేవో తేల్చుకోమన్నారు

బేస్‌క్యాంప్‌ తర్వాత క్యాంప్‌-1, 2, 3, 4 ఉంటాయి. 21వేల అడుగుల ఎత్తున్న క్యాంప్‌-2కు వెళ్లగానే ఇద్దరు భయంతో తప్పుకొన్నారు. మిగిలిన వారిలో విపరీతమైన చలి వల్ల ఒకరికి చెయ్యి, మరొకరికి కాలు గడ్డకట్టేశాయి. దాంతో వైద్యులు ఆ భాగాల్ని తొలగించారు. అది చూసి అనుభవజ్ఞులు మాత్రం ఇది మొదలే... ఇలాంటివి ఇంకా చూడాలని హెచ్చరించారు. నన్నైతే ‘ఇద్దరు పిల్లల తల్లివి. ఆలోచించుకో’ అన్నట్లు చూశారు. క్యాంప్‌-4కి వెళ్లాక విపరీతమైన మంచు వాన. ఆక్సిజన్‌ ఖర్చైపోతోంది. నా కళ్లముందే ఓ అమ్మాయి చలికి చనిపోయింది. ఆలస్యం చేస్తే మన గతీ అదే అన్నాడు వెంట ఉన్న షేర్పా. చలి కొరికేయడంతో నా ముఖం నిండా గాయాలు. అన్ని కష్టాల మధ్య శిఖరం చేరుకున్నా. నా కల నిజమైందన్న సంబరం. కానీ కష్టాలు అక్కడి నుంచే మొదలయ్యాయి.

ప్రాణాల్ని కాపాడుకుంటూ..

శిఖరం నుంచి కిందికి చూశాక బీపీ పెరిగిపోయింది. నాతో ఉన్న వాళ్లలో మరొకరి ప్రాణం పోయింది. ఇంకొకరు చావు బతుకుల్లో ఉండటం చూసి నా అదనపు ఆక్సిజన్‌ సిలిండర్‌ ఇచ్చేశాను. కాసేపటికి నా ఆక్సిజన్‌ కూడా అయిపోయింది. నిద్ర, ఆహారంలేక శక్తి సన్నగిల్లింది. నేను ఆలస్యం చేయడంతో అంతా వెళ్లిపోయారు. ఒంటరిగా ఉన్న నన్ను చూసి ఓ షేర్పా తన సిలిండర్‌ ఇచ్చి ‘ఆక్సిజన్‌ కొంతే ఉంది. ప్రాణాలు కాపాడుకో’ అన్నారు. క్యాంప్‌-3 దాటేసరికి అదీ అయిపోయింది. క్యాంప్‌-2 చేరాలంటే 8గంటలు నడవాలి. ప్రాణం పోవడం ఖాయం.. కానీ తిరిగొస్తానని పిల్లలకిచ్చిన మాటలు గుర్తొచ్చాయి. కనీసం నా చావుకబురైనా వాళ్లకు చేరాలనుకున్నా. పర్వతారోహకులు దిగే తాడుకు నా శరీరాన్ని లాక్‌ చేశాను. ఆ దారిన ఎవరొచ్చినా నన్ను చూస్తారన్న ఆశతో. స్పృహలేని నన్ను ఓ మెక్సికో కుర్రాడు చూశాడు. అతని సిలిండర్‌ని నాకిచ్చి బతికించాడు. ఇద్దరం మాస్క్‌ను మార్చిమార్చి పెట్టుకుంటూ మూడు కిలోల బూట్లతో కిందికి పరుగెత్తాం. క్యాంప్‌-2కి చేరగానే ఇద్దరం కుప్పకూలిపోయాం. అలా ప్రాణాలు దక్కాయి. తమిళనాడు ప్రభుత్వానికి విషయం తెలిసి హెలికాప్టర్‌లో నన్ను తీసుకొచ్చి, చెన్నైలో ఘనస్వాగతం పలికారు. ఇన్ని సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా తమిళనాడు పేరు నిలపాలనుకున్నా. మిగిలిన 6 ఖండాల్లో ఎత్తయిన పర్వతాలన్నింటినీ ఎక్కి దేశానికి పేరు తేవాలన్నదే ఇప్పడు నా లక్ష్యం.

హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్