గోడెక్కి.. రికార్డు కొట్టి!
‘అమ్మాయిలు గోడలెక్కడం ఏంటి?’ ‘గోడలు ఎక్కడం ఆటా? దానికి పతకాలు కూడానా!’ ఇలాంటి మాటల మధ్యే తన ప్రయాణం కొనసాగిస్తోంది శివ్‌ప్రీత్ పన్ను. నిజానికి ఇదో ఆట ఉందని చాలామందికి తెలియదు మరి.
‘అమ్మాయిలు గోడలెక్కడం ఏంటి?’ ‘గోడలు ఎక్కడం ఆటా? దానికి పతకాలు కూడానా!’ ఇలాంటి మాటల మధ్యే తన ప్రయాణం కొనసాగిస్తోంది శివ్‌ప్రీత్ పన్ను. నిజానికి ఇదో ఆట ఉందని చాలామందికి తెలియదు మరి. శివ్‌ప్రీత్‌కీ దీని గురించి ఇంటర్‌లోనే తెలిసింది. పంజాబ్‌కి చెందిన తనకి స్ప్రింటర్ అవ్వాలని కోరిక. అనివార్య కారణాల రీత్యా కొనసాగించ లేకపోయింది. ఆమె స్కూల్లో ‘క్లైంబింగ్ వాల్’ ఉండేది. ఊతం కోసమని బిగించిన చిన్న చిన్న ఆధారాల్ని పట్టుకొని పైవరకూ ఎక్కాలి. చిన్నతనంలో శివ్‌ప్రీత్ తోటివారితో పోలిస్తే కాస్త ఎత్తు తక్కువ. ఎత్తు పెరగొచ్చు అనుకొని ఎక్కడం ప్రారంభించింది. అదికాస్తా వ్యాపకంగా మారింది. మనసు బాగోకపోయినా.. చదువు నుంచి విరామం కావాలన్నా ఆ గోడ దగ్గరికి వెళ్లిపోయేది. తర్వాత దీనిలోనూ పోటీలుంటాయని తెలిసి పాల్గొనడం మొదలుపెట్టింది. ‘జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నా అధికారులూ దీన్ని స్పోర్ట్‌గా పరిగణించకపోవడం బాధేసేది. డిగ్రీలో ఉన్నప్పుడు స్పీడ్ క్లైంబింగ్ గురించీ, విదేశాల్లో దీనిపై పోటీల గురించి తెలిసీ దృష్టిపెట్టా’నంటుంది శివ్‌ప్రీత్. ఇంగ్లిష్ అండ్ సైకాలజీలో బీఏ చేసిన తను కళాశాల అనుమతితో విదేశీ టోర్నమెంట్‌ల్లో పాల్గొంది. తర్వాత దిల్లీలో హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్‌గా చేరి, ఆటపై పట్టు సాధించింది. చైనా, బ్యాంకాక్, సింగపూర్, నేపాల్‌ల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్, యూత్ స్పీడ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలూ గెలిచింది. తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ పోటీల్లో 15 మీటర్ల గోడను పది సెకన్లలోపే ఎక్కి జాతీయ రికార్డునూ నెలకొల్పింది. ‘పతకాలు గెలవడం సంతోషించే విషయమే! కానీ మిగతా ఆటల్లా దీనికి గుర్తింపు కాదు కదా.. కనీస అవగాహనా లేదు. అది కాస్త బాధిస్తుంది. అంతర్జాతీయంగా పోటీలు, టోర్నమెంట్లు జరుగుతున్నా ప్రోత్సాహం తక్కువే. 2023 ఒలింపిక్స్‌లో వాల్ క్లైంబింగ్ కూడా ఉంది. దానిలో గెలిచి, దేశంలో ఈ ఆటపై గుర్తింపు తేవాలన్నది కల’ అంటోంది 23ఏళ్ల శివ్‌ప్రీత్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.