నాన్న హమాలీ.. కూతురు ఎస్సై!
పదో తరగతిలోనే పెళ్లి మాటెత్తితే.. చదువుకుంటానని కచ్చితంగా చెప్పింది. ఇంతవరకూ తన గ్రామం నుంచి ఒక్క అమ్మాయి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేదు. ఆ మొదటి అమ్మాయి తనే కావాలనుకుంది బొల్లబోయిన హేమలత.
పదో తరగతిలోనే పెళ్లి మాటెత్తితే.. చదువుకుంటానని కచ్చితంగా చెప్పింది. ఇంతవరకూ తన గ్రామం నుంచి ఒక్క అమ్మాయి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేదు. ఆ మొదటి అమ్మాయి తనే కావాలనుకుంది బొల్లబోయిన హేమలత. పేదరికంతో పోరాడి.. హేమలత ఆ కల నెరవేర్చుకుందా?
మాది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఒటాయి గ్రామం. ఏజెన్సీ ఏరియా. నాన్న హమాలీ పనిచేస్తుంటారు. నాకో చెల్లి, అన్నయ్య. నా కంటే ముందే మా చెల్లికి పెళ్లి చేశారు. నిజానికి నాకూ పదో తరగతిలోనే పెళ్లిచేస్తామన్నారు. నేను ఒప్పుకోలేదు. టీటీసీ చదువుతుండగా మరో సంబంధం వచ్చింది. అప్పుడు అమ్మానాన్నలకు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలబడ్డాకే పెళ్లి చేసుకుంటానని కచ్చితంగా చెప్పా. వారు కూడా నా మనసు అర్థం చేసుకొని ప్రోత్సహించారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి.. ఓయూలో పీజీ పూర్తి చేశా. ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో ప్రయత్నించా. ప్రిలిమ్స్, గ్రౌండ్‌లో పాసయ్యా. అలాగే మెయిన్స్ తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్సై పోస్టు సాధించా. ఇంతవరకూ మా గ్రామంలో ఇంతవరకూ ప్రభుత్వం ఉద్యోగం సంపాదించిన అమ్మాయిలు ఎవరూ లేరు. నేనే మొదటి అమ్మాయిని. అన్నయ్య హైదరాబాద్ వెళ్లి కష్టపడి నా చదువుకు సహకరించాడు. ఈలోపు నేనే పెళ్లికి వెళ్లినా, బంధువుల ఇంటికి వెళ్లినా హేళనగా మాట్లాడేవారు. ఇప్పుడు వాళ్లే మెచ్చుకుంటున్నారు. ఈ పరీక్ష కోసం ఈనాడు దినపత్రిక నాకు ఎంతో ఉపయోగపడింది. సజ్జనార్, రంగనాథ్ లాంటి ఐపీఎస్ అధికారులను చూస్తే గర్వంగా ఉంటుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసు శాఖ ముందడుగు వేసి మానవత్వాన్ని చూపడం నాకెంతో నచ్చింది. అందుకే పోలీసు ఉద్యోగంలో చేరాలనే తాపత్రయంతో కష్టపడి చదివా. గ్రూపు-1 కూడా సిద్ధం అవుతున్నా. అందులో మంచి మార్కులొస్తాయని నాకు నమ్మకం ఉంది. ఖాకీ దుస్తుల్లో మా ఊళ్లో అడుగుపెట్టాలని ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.