కోట్లు కొల్లగొడుతున్నారు!

ఐపీఎల్‌ అంటే ఒకప్పుడు మనకి అబ్బాయిలే గుర్తుకువచ్చేవారు.. ఆ పరిస్థితిని కాస్తా మార్చేసి ఆటతో కోట్లు కొల్లగొట్టే పనిలో అమ్మాయిలూ ముందుంటున్నారు. తాజాగా డబ్ల్యూపీఎల్‌.. సీజన్‌ 2 వేలంలో కాశ్వీగౌతమ్‌ రెండు కోట్లతో ముందు వరుసలో ఉంటే.. మనతెలుగమ్మాయి త్రిషకూడా ఆ జాబితాలో ఉంది.

Updated : 12 Dec 2023 06:57 IST

ఐపీఎల్‌ అంటే ఒకప్పుడు మనకి అబ్బాయిలే గుర్తుకువచ్చేవారు.. ఆ పరిస్థితిని కాస్తా మార్చేసి ఆటతో కోట్లు కొల్లగొట్టే పనిలో అమ్మాయిలూ ముందుంటున్నారు. తాజాగా డబ్ల్యూపీఎల్‌.. సీజన్‌ 2 వేలంలో కాశ్వీగౌతమ్‌ రెండు కోట్లతో ముందు వరుసలో ఉంటే.. మనతెలుగమ్మాయి త్రిషకూడా ఆ జాబితాలో ఉంది. ఆటతో మనసులు గెలుచుకుంటున్న ఈ అమ్మాయిల గురించి మనమూ తెలుసుకుందాం.. 


రెండు కోట్లతో..

కాశ్వీ గౌతమ్‌.. ఈ నెల 9తేదీ వరకూ ఎవరికీ పెద్దగా తెలియని పేరిది. ఇప్పుడు దేశమంతటా మార్మోగుతోంది. డబ్ల్యూపీఎల్‌ వేలంలో రూ.2 కోట్ల ధర దక్కించుకోవడమే అందుకు కారణం. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేయని ఈ చండీగఢ్‌ క్రీడాకారిణి కోసం గుజరాత్‌ జెయింట్స్‌ అంత మొత్తం చెల్లించడం ఆశ్చర్యమేగా. కాశ్వీ తండ్రి సుదేశ్‌ శర్మ కూడా క్రికెట్‌ ఆడేవారు. కానీ ముందుకు వెళ్లలేకపోయాడు. అందుకే తన ఇద్దరు కూతుళ్లలో పెద్దదైన కాశ్వీని క్రికెట్‌ వైపు ప్రోత్సహించాడు. 13 ఏళ్ల వయసులో తనకంటే పెద్దవాళ్లతో గల్లీ క్రికెట్‌ ఆడటంతో కాశ్వీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత అకాడమీ శిక్షణతో రాటుదేలింది. మొదట పంజాబ్‌కు ఆడి, ఆ తర్వాత చండీగఢ్‌ జట్టుకు మారింది. స్వింగ్‌, వేగంతో బౌలింగ్‌ చేస్తూ వికెట్ల వేటలో ముందుకు సాగుతోంది. 2020లో బీసీసీఐ మహిళల అండర్‌-19 వన్డే మ్యాచ్‌లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. అయితే డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌కు జరిగిన వేలంలో కాశ్వీని ఎవరూ తీసుకోలేదు. ఆ నిరాశ నుంచి బయటపడి బౌలింగ్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది జాతీయ టీ20 టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు సాధించింది. ఏసీసీ ఎమర్జింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి భారత్‌ అండర్‌-23 జట్టులో స్థానం సంపాదించింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌ను ఇష్టపడే ఆమె..  భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమని పేర్కొంది.


పక్కన పెట్టిన అమ్మాయే..

చాలామంది మహిళా క్రికెటర్లలానే వ్రిందా కూడా చిన్నప్పుడు అబ్బాయిలతో గల్లీలో ఆడి క్రికెట్‌ నేర్చుకుంది. ఈమెది బెంగళూరు. బీబీఏ చదువుతోంది. నాన్న దినేష్‌ సుబ్బప్ప లీగ్‌ క్రికెట్‌ ఆడేవారు. ఆయన ప్రోత్సాహంతోనే 13ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది. బెంగళూరులోని ఎన్‌ఐసీఈ అకాడమీలో శిక్షణ పొందుతోన్న ఈమె ఇందు కోసం రోజూ 45 కిలోమీటర్లు ప్రయాణించేది. అలా ప్రస్తుతం మహిళల అండర్‌- 23 టోర్నీ కోసం రాయ్‌పూర్‌లో ఉన్న ఆమెను శనివారం డబ్ల్యూపీఎల్‌ వేలంలో రూ.1.3 కోట్లకు యూపీ వారియర్స్‌ సొంతం చేసుకుంది. ఈ విజయం ఆమెకు అంత తేలిగ్గా ఏమీ రాలేదు. 2018లో సీనియర్‌ స్టేట్‌ టీమ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన వ్రిందాను ఆ తర్వాత రెండేళ్లపాటు పక్కన పెట్టేశారు. ఆ సమయంలో తర్వాత సీజన్‌కు తప్పకుండా ఆడాలనే పట్టుదలతో మరింత శ్రమించింది. ‘వేలంలో యూపీ వారియర్స్‌ నన్ను తీసుకోగానే అమ్మకు ఫోన్‌ చేశా. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న సంగతి సరేసరి. ఇప్పుడు వాళ్ల కలల కారును బహుమతిగా అందిస్తా’ అంటోందీ యువ రైట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌.


తెలుగమ్మాయి...

దేళ్ల క్రితం మాట.. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానం. అబ్బాయిలూ, అమ్మాయిలూ క్రికెట్‌ సాధన చేస్తున్నారు. పదకొండేళ్ల చిన్నారి తన అన్నయ్య ఆడుతుంటే చూడ్డానికని వచ్చింది. కానీ ఆమె దృష్టంతా ఆ పక్కనే క్రికెట్‌ ఆడుతున్న అమ్మాయిలపైనే ఉంది. అలా ఈ ఆటపై ఇష్టం పెంచుకుంది త్రిష పూజిత. స్వస్థలం భద్రాచలం. కొడుకు రుత్విక్‌ క్రికెట్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన తండ్రి కృష్ణారావు.. కూతురూ ఆ ఆటలోనే రాణిస్తుందని మొదట్లో ఊహించలేదు. తల్లి ఉపాధ్యాయురాలు కావడంతో... త్రిష మాత్రమే హైదరాబాద్‌లో ఉండి శిక్షణ తీసుకుంది. ఉదయం నాలుగున్నరకే మైదానంలో ఉండే ఆమె పట్టుదల చూసి అమ్మానాన్నలూ ప్రోత్సహించారు. జింఖానా మైదానంలో ఓనమాలు నేర్చుకున్న త్రిష అండర్‌-16, 19, 23 విభాగాల్లోనూ రాణించి శభాష్‌ అనిపించుకుంది. ఇటీవల సీనియర్‌ మహిళల టీ20 టోర్నీలో హైదరాబాద్‌ తరఫున సత్తాచాటింది. టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌గా, ఆఫ్‌ స్పిన్నర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం కోచ్‌ సలామ్‌ బయాష్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోన్న త్రిషను.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. రోహిత్‌ శర్మ లాగా బంతిని గట్టిగా బాదడమంటే త్రిషకు ఇష్టం. అందుకు తగ్గట్టుగా ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతోంది. టీవీల్లో చూసిన క్రికెటర్లతో ఇప్పుడు లీగ్‌లో కలిసి ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని త్రిష చెప్పింది. భారత్‌ తరఫున ప్రపంచకప్‌లో ఆడాలని, విజయానికి అవసరమైన పరుగులు చేసి దేశాన్ని విశ్వవిజేతగా నిలపాలన్నది తన లక్ష్యం అంటున్న త్రిష ఆటతోపాటూ చదువుపైనా దృష్టి పెట్టింది. విజయవాడలో డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డేటాసైన్స్‌ చదువుతోంది.  

చందు శనిగారపు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్