బెర్రీల సాగులో లాయరమ్మ!

బెర్రీస్‌ అనగానే ఏం గుర్తొస్తుంది? విదేశీ పంట, ధర ఎక్కువ! కావాలంటే ఎండు రకాలనే ఎంచుకోవాలనే కదా! కానీ మనవాళ్లు ఎక్కువగా తీసుకుంటున్న వాటిలో ఇవీ ఒకటి. అలాంటప్పుడు దేశీయంగానే ఎందుకు పండించకూడదు అనుకుంది కేయా. అంతా కష్టమన్నా... లాభాల బాటలో సాగుతోందీమె.

Published : 06 Mar 2024 02:04 IST

బెర్రీస్‌ అనగానే ఏం గుర్తొస్తుంది? విదేశీ పంట, ధర ఎక్కువ! కావాలంటే ఎండు రకాలనే ఎంచుకోవాలనే కదా! కానీ మనవాళ్లు ఎక్కువగా తీసుకుంటున్న వాటిలో ఇవీ ఒకటి. అలాంటప్పుడు దేశీయంగానే ఎందుకు పండించకూడదు అనుకుంది కేయా. అంతా కష్టమన్నా... లాభాల బాటలో సాగుతోందీమె. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలనుందా... అయితే చదివేయండి.

ఇంట్లోనే కాదు, బంధువులూ వ్యాపారస్థులే! ఇంకేం తనూ వ్యాపారవేత్త అవ్వాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది కేయా సలోత్‌. ఆ చిన్నిబుర్రలో బోలెడు వ్యాపార ఆలోచనలు. అమ్మానాన్నలతో పంచుకుంటే ‘నువ్విప్పుడు దృష్టిపెట్టాల్సింది చదువు మీద. భవిష్యత్తులో నువ్వేం కావాలనుకున్నా చదువే పునాది’ అన్నారట. దీంతో వ్యాపార ఆలోచనలు పక్కనపెట్టింది. ఈమెది గుజరాత్‌. ఏ డిగ్రీ చేయాలా అనుకున్నప్పుడు ‘కార్పొరేట్‌ లా’ ఆమెను ఆకర్షించింది. ‘న్యాయవిద్య తొలి ఏడాది నుంచే ఇంటర్న్‌షిప్‌లపై దృష్టిపెట్టా. వివిధ సంస్థల్లో చేసేసరికి మంచి నెట్‌వర్క్‌ కూడా ఏర్పడింది. వ్యాపారం సాగేతీరు, పరిచయాలు అన్నింటి గురించీ తెలుసుకున్నా’ అంటుంది కేయా. 2014లో చదువు పూర్తయ్యాక పెద్ద లా సంస్థల్లో పనిచేసింది కూడా. చదువు, అనుభవం, నెట్‌వర్క్‌ ఉంది... ఎప్పుడెప్పుడు వ్యాపారం ప్రారంభిద్దామా అన్న తొందరే! కానీ ఏం చేయాలన్న దానిపైనే చాలా ఆలోచించింది.

‘వ్యాపారం అంటే లాభాలు ఉండాల్సిందే. అయితే నేను చేసేదేదైనా సానుకూల మార్పునీ తేవాలనుకున్నా’ననే కేయా ఆరోగ్య రీత్యా అందరూ మైక్రోగ్రీన్స్‌పై దృష్టిపెట్టడం గమనించింది. ఇంట్లోనే వాటిని పెంచి, తెలిసిన వారికి అందించేది. లాభసాటిగా తోచాక 30 రకాలు పెంచి, రెస్టరంట్లకూ సరఫరా చేసేది. ఆరునెలల్లో క్లయింట్లతోపాటు రిటైల్‌ అమ్మకాలపై అనుభవాన్నీ సంపాదించుకుంది. ఇంకా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో పెళ్లయ్యింది. ఓసారి భర్తతో కలిసి యూరప్‌, మెక్సికో వెళ్లింది. అక్కడ బ్లూబెర్రీ, రాస్‌బెర్రీల సాగు ఆమెను ఆకర్షించింది. మనదేశంలో వాటిని తీసుకునేవారు ఎక్కువే. పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం కూడా. అలాంటప్పుడు దేశీయంగానే ఎందుకు పెంచకూడదు అనుకుని 2020లో ‘ఫార్మ్‌ టూ ఫామ్‌’ ప్రారంభించింది.

‘హిమాలయాలు, తమిళనాడు, అసోంల్లోని కొన్ని ప్రాంతాల్లో పెంచుతున్నా అవి పులుపు. తీపి రకాలు సాగు చేయాలనుకొని మొక్కలు, టెక్నాలజీని తెప్పించుకున్నా. ఏడాదిపాటు ప్రయోగాలు చేసి, 2021లో పుణెలో 20 ఎకరాల్లో సాగు మొదలుపెట్టా. వీటి కోసం ప్రత్యేకంగా మట్టి, టన్నెల్స్‌ని ఏర్పాటు చేసుకున్నాం. యూరప్‌లో మాదిరిగా రసాయన రహిత విధానాలను ఇక్కడా కొనసాగించా’మంటుంది కేయా. ఈ ఏడాది 135 టన్నుల దిగుబడి సాధించింది. దేశంలోని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తోంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ఎకరాలనూ లీజు తీసుకోనుందట. అన్నట్టూ... తన వద్ద మొక్కల పెంపకం దగ్గర్నుంచి, పండ్ల సేకరణ వరకూ చేసేదంతా మహిళలే. ఆడవాళ్లు తమ కాళ్లమీద తాము నిలబడితేనే ఏ ఇంట్లోనైనా విద్య, ఆరోగ్యాలు వర్థిల్లుతాయన్నది కేయా నమ్మకమట. అందుకే మహిళలకే ప్రాధాన్యం అంటోందీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్