మన రక్షణ మన చేతుల్లోనే..!

ఒంటరిగా ఉన్నారా? అకస్మాత్తుగా ఇంట్లో దొంగలు పడొచ్చు... ఎవరూ లేరని అసభ్యంగానూ ప్రవర్తించొచ్చు... లేదా మరోరకమైన ఇబ్బందికర పరిస్థితినీ ఎదుర్కోవలసి రావొచ్చు.  ఇలాంటప్పుడు మీరైతే ఎలా స్పందిస్తారు. మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారు?  అమ్మో మాకు భయం అని మాత్రం అనేయొద్దు.

Updated : 23 Mar 2024 14:47 IST

ఒంటరిగా ఉన్నారా? అకస్మాత్తుగా ఇంట్లో దొంగలు పడొచ్చు... ఎవరూ లేరని అసభ్యంగానూ ప్రవర్తించొచ్చు... లేదా మరోరకమైన ఇబ్బందికర పరిస్థితినీ ఎదుర్కోవలసి రావొచ్చు.  ఇలాంటప్పుడు మీరైతే ఎలా స్పందిస్తారు. మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారు?  అమ్మో మాకు భయం అని మాత్రం అనేయొద్దు. ఎందుకంటే ఈ తరం అమ్మాయిలు అబలలు కాదు... ఆత్మరక్షణకోసం ఆది పరాశక్తులుగానూ మారగలరు. తమని తాము కాపాడుకుని మరెందరికో స్ఫూర్తినీ అందించగలరు. అదెలాగో చూద్దామా!

దొంగలు పడినా... ఆగంతకులూ అపరిచితులూ ఇంట్లోకి దూరినా... ఆఖరికి రోడ్డు మీద వెళ్తోంటే ఎవరైనా కామెంట్లు చేసినా... చాలామంది గొడవెందు కని భయపడి మిన్నకుండిపోతారు. కానీ, హైదరాబాద్‌కి చెందిన అమిత మెహ్నోత్‌, ఆమె మైనర్‌ కూతురు మాత్రం... దోపిడీకి వచ్చిన వారి దగ్గర మారణాయుధాలు ఉన్నాయని తెలిసినా వారిపై కలబడ్డారు. తమ శక్తినంతా కూడదీసుకుని ఎదురు తిరిగారు. ఆ సమయస్ఫూర్తి వారికెలా వచ్చింది.

రెండు రోజుల క్రితం బెంగళూరులో జరిగింది మరో సంఘటన. ఫుడ్‌ ఆర్డర్‌ తెచ్చిన వ్యక్తి... వంటింట్లోకి వెళ్తోన్న ఆమె వెనకే వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఏం జరుగుతోందో అర్థం చేసుకున్న ఆమె... అందుబాటులో ఉన్న అట్ల పెనంతోనే నాలుగు అంటించింది. ఈ తెగువ ఆ మహిళకి ఎవరిచ్చారు?

ఆ మధ్య రోడ్డుపై నడిచి వెళ్తోన్న ఓ కాలేజీ అమ్మాయిని వేధించాడో పోకిరీ. వికృతంగానూ ప్రవర్తించాడు. పోలీసులకు ఎమర్జన్సీ కాల్‌ చేసింది. మరోపక్క వాడు తప్పించుకోకుండా తన చున్నీతోనే బండి మీద నుంచి కింద పడేలా చేసి నిలువరించింది. ఏ మాత్రం భయం లేకుండా ఇవన్నీ చేసే ధైర్యం ఆమెకెక్కడిది?

వీరికే కాదు... మీకూ సాధ్యమే. ఇలాంటి పరిస్థితులు నిత్యం ఎక్కడో చోట, ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ, వాళ్ల నుంచి హాని కలుగుతుందనే భయంతో చూసీ చూడకుండా వదిలేసేవారే ఎక్కువ. కానీ, ఎన్నాళ్లిలా? ఎందుకంటే ఆపదలేవీ చెప్పిరావు... ఆడవాళ్లుగా మనం వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉంటే చాలు, అరచేతినే ఆయుధంగా చేసుకుని తిరగబడే బలం మీ సొంతమవుతుంది.

అదెలా సాధ్యమంటే...

చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై అవగాహన, శారీరకదార్ఢ్యం, ఆత్మరక్షణ విద్యలూ, మెలకువలూ ఒంటపట్టించుకోవాలి. కరాటే, కర్రసాము నేర్చుకుంటే ఏ ఆయుధం లేకున్నా కాళ్లూ, చేతులతోనే పోరాటం చేయొచ్చు. అందుబాటులో ఉన్న కర్ర, చున్నీ వంటి వాటి సాయంతోనే శక్తినంతా కూడదీసుకుని దుండగులకు ఎదురొడ్డి నిలబడొచ్చు.

  • ఆపదొచ్చినప్పుడు భయంతో మెదడుకి ఏదీ తట్టదు. ఇలాంటప్పుడు సమస్యను గుర్తించాలన్నా, దాన్నుంచి బయటపడే మార్గాలు మదిలో మెదలాలన్నా ఏకాగ్రత చాలా అవసరం. ఇందుకు విలువిద్య ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న వస్తువులతోనే దుండగుడి చేతిలోని ఆయుధాలను గురి చూసి కొట్టే శక్తి వస్తుంది.
  • చాకు, ఎలక్ట్రిక్‌ షాకర్‌, పెప్పర్‌ స్ప్రే, కీ చెయిన్‌, సేఫ్టీపిన్‌ లాంటివన్నీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సాయం చేసేవే. అవేవీ లేకపోతే మెడ, కాళ్లు, ముక్కు, జననేంద్రియ భాగాల మీద దాడి చేసీ తక్షణం బయటపడొచ్చు. ఈ ప్రాథమిక అంశాన్ని గుర్తుంచుకోవాలి.
  • బైకు, కారు నడపడం నేర్చుకోండి. ఇది గమ్యానికి చేర్చడమే కాదు... సమస్యలను దాటే నైపుణ్యాన్నీ నేర్పిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించి తక్షణం బయటపడగల అవకాశాన్నీ ఇస్తుంది. వీటన్నింటికన్నా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటమే ముఖ్యం.

ఐదేళ్లు నేర్చుకున్నా...
- అమిత మెహ్నోత్‌

కొరియర్‌ అని వచ్చినవారు...  ఇంట్లోకి ఎందుకొస్తున్నారని ఆలోచించేలోగానే వారి బ్యాగులో నాటు తుపాకీ కనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకీ ప్రమాదమే అన్న భావన రావడంతో వాళ్లతో తలపడటానికి సిద్ధపడ్డా.  ఆడవాళ్లు బలహీనులంటే నేను ఒప్పుకోను. గత పదిహేనేళ్లుగా ఫిట్‌నెస్‌పై ఆసక్తితో వర్కవుట్లు చేస్తున్నా. శారీరకంగా దృఢంగా మారా. ఐదేళ్లపాటు సరదాగా నేర్చుకున్న కుంగ్‌ఫూ ఇప్పుడు మమ్మల్ని కాపాడింది. ప్రతి అమ్మాయీ ఆత్మరక్షణ విద్యలు అలవరుచుకోవాలి. అప్పుడే ఎవరి అవసరం లేకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


ఆరోతరగతి నుంచే నేర్పాలి...  
- రోహిణీ ప్రియదర్శిని, నార్త్‌జోన్‌ డీసీపీ, హైదరాబాద్‌

పదకొండేళ్ల నా కెరియర్‌లో అమితలాంటి మహిళను చూడలేదు. దుండగుల దగ్గర ఆయుధాన్ని చూసి కూడా వారిని ఎదుర్కోవాలన్న ఆమె తెగువ అభినందనీయం. ఊహించని ఇబ్బంది ఎదురైనప్పుడు ముందు మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. అప్పుడే ఎలా బయటపడగలమన్న ఆలోచన స్ఫురిస్తుంది.  ఆరో తరగతి నుంచే ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించేలా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావాలి. అప్పుడే ఎన్నోరకాల వేధింపులు, సమస్యలను సులువుగా ఎదుర్కొని బయటపడగలరు. ఆపదలో ఉంటే నిస్సంకోచంగా 100కి డయల్‌ చేయండి. తక్షణం మీకు రక్షణగా నిలబడేందుకు పోలీసు వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

ఆకతాయిల వేధింపుల నుంచి, ఆగంతకుల దాడుల నుంచి మహిళలు తమని తాము ఎలా రక్షించుకోవాలి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్