నౌక‘రాణి’

ఇల్లాలి బాధ్యతలు అన్నీ ఇన్నీ కావు. వాటిల్లో భర్త, పిల్లల సాయం అరకొరగానే ఉంటుంది. అందుకే  పనిమనిషి మీదే ఎక్కువగా ఆధారపడతాం...

Published : 08 Sep 2021 01:09 IST

ఇల్లాలి బాధ్యతలు అన్నీ ఇన్నీ కావు. వాటిల్లో భర్త, పిల్లల సాయం అరకొరగానే ఉంటుంది. అందుకే  పనిమనిషి మీదే ఎక్కువగా ఆధారపడతాం. ఒక్కరోజు ఆమె రాలేదంటే అలసి, సొలసిపోతాం. అలా కాకుండా మనల్ని కొంచెం విశ్రాంతిగా ఉండనిస్తూ ఊపిరి పీల్చుకునేలా చేస్తోన్న ఆమెనెంత ఆదరించినా తక్కువే! మెయిడ్‌తో ఇలా ఉండమంటున్నారు అనుభవజ్ఞులు..

* అందరి అలవాట్లూ, పనితీరూ ఒకలా ఉండవు. కనుక మీకెలా కావాలో ఆమెకి మొదటిరోజే విడమర్చి చెప్పండి. అర్థం కాకపోతే చేసి చూపండి. అలవాటు చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వండి.

* కేవలం పనులు అప్పగించడమే కాకుండా ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఆమెకి కూడా ఉత్సాహంగా ఉంటుంది.

* ఇల్లు ఊడవటం దగ్గర్నుంచీ కూరగాయలు తరిగివ్వడం వరకూ ఎన్నెన్నో సాయాలు చకచకా చేసేస్తూ అండదండగా ఉండే అమ్మాయి ఎపుడైనా రాకపోతే పని భారం పెరిగిందని కోపగించుకోవడం కద్దు. కానీ ఆమెకేం సమస్య వచ్చిందో వాకబు చేస్తే సంతోషిస్తుంది.

* గిన్నెలు కడుగుతున్నప్పుడు కప్పు చేజారడం, షోకేస్‌ తుడుస్తున్నప్పుడు గాజుబొమ్మ పగిలిపోవడమో లాంటి పొరపాట్లు ఎవరికైనా సహజం. అలాంటప్పుడు హెచ్చరిస్తే ఫర్లేదు. కానీ బెదిరించడమో జీతం తగ్గించి ఇవ్వడమో చేయొద్దు. అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవుతుంది.

* ఆమెక్కూడా విశ్రాంతి, కొన్ని సరదాలూ కావాలని గుర్తించండి. ఎపుడైనా పని మానేసి సినిమాకో షికారుకో వెళ్లడం నేరం కాదుగదా!

* తన అభిప్రాయాలూ అభ్యంతరాలూ చెప్పే స్వేచ్ఛను ఇవ్వండి. నిరంకుశ ధోరణి చూపితే మీ మీద ప్రేమ, గౌరవం ఉండవని గుర్తుంచుకోండి.

* జీతం ఇస్తున్నందుకు చేస్తోంది అనే భావన రానీయొద్దు. బాగా చేసినప్పుడు మెచ్చుకోవడం ప్రోత్సాహంగా ఉంటుంది. సందర్భానుసారం ఏవైనా కానుకలు ఇస్తూ ప్రేమగా చూసుకుంటే ఆమె కూడా మీపట్ల ప్రేమగా, నిజాయతీగా ఉంటుంది.

* మీ నౌకరానీని నౌక‘రాణి’ అని పిలిచి చూడండి.. ఆమె కళ్లు మెరవ్వా చెప్పండి?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్