తెలుసుకుంటే సులువే..!

ఇంటికి సహజ శోభను తేవాలంటే కాసిని మొక్కలు పెంచితే సరిపోతుంది. ఇంటి ముందో వెనుకో స్థలం ఉంటే ఎంచక్కా పూలూ కాయగూరల మొక్కలూ నాటవచ్చు

Published : 21 Apr 2022 01:31 IST

ఇంటికి సహజ శోభను తేవాలంటే కాసిని మొక్కలు పెంచితే సరిపోతుంది. ఇంటి ముందో వెనుకో స్థలం ఉంటే ఎంచక్కా పూలూ కాయగూరల మొక్కలూ నాటవచ్చు. అలాంటి అవకాశం లేని వాళ్లు కూడా నిరాశ చెందనవసరం లేదు. ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవచ్చు. కాకపోతే నిపుణుల ఈ సూచనలు పాటిస్తే సరి.

* ఇంట్లో పెంచే మొక్కలకు సాధారణంగా నీళ్లు ఎక్కువ అవసరం ఉండదు. కొలత ప్రకారం కొద్ది నీళ్లు మాత్రమే పోస్తుండాలి. కొన్ని మొక్కలకైతే చెంచాడు నీరే సరిపోతుంది. ఇంకొన్నిటికి రెండు మూడు రోజులకోసారి అతి కొద్దిగా పోయాల్సి ఉంటుంది. ఎక్కువెక్కువ పోస్తే మొక్కలు చనిపోతాయి. అసలే పోయకున్నా ఎండిపోతాయి.
* ఈ రకపు మొక్కలకు చెమ్మగా ఉండే మట్టిని ఎంపిక చేసుకోవాలి.
* మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి వారం పదిరోజులకు ఒకసారి ఎరువు వేస్తుండాలి.
* కుండీలలో చెట్టు మొదలు చుట్టూ రంగు రాళ్లను అమర్చడం వల్ల తేమ పైకి కనిపించదు కనుక దోమలు, నుసుములు వంటివి చేరవు. మొక్కలకు అదనపు అందం వస్తుంది.
* కొందరు తాగుతున్న వేడి నీళ్లో, ఫ్రిజ్‌ నీళ్లో మిగిలినప్పుడు మొక్కలకు పోస్తే పనైపోతుంది అనుకుంటారు. కానీ అది మంచిది కాదు. గది వాతావరణంలో ఉండే నీళ్లు మాత్రమే పోయాలి. ఎక్కువైన నీరు బయటకు పోయేందుకు కుండీలకు రంధ్రం తప్పకుండా ఉండాలి. మట్టి గుల్లగా ఉంటేనే నీళ్లు పోతాయని గుర్తుంచుకోవాలి.
* ఇండోర్‌ ప్లాంట్స్‌ నీడపట్టున పెరిగే మాట నిజమే అయినా వాటిక్కూడా కాస్త గాలీ వెలుతురూ తగలాలి. కనుక కుండీలను అలాంటి చోటే ఉంచాలి. వసారాలో సీలింగుకు కొక్కేలు ఏర్పాటు చేసి కూడా తగిలించవచ్చు. ఇంట్లోకి సూర్యరశ్మి తగిలే అవకాశం పూర్తిగా లేనట్లయితే వేడి తగిలే లైట్లను ఏర్పాటు చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్