నిమ్మతొక్కను పడేయకండి...

రసం పిండాక నిమ్మకాయ చెక్కలను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ ఆ తొక్కల వల్ల ఉపయోగాలు తెలిస్తే ఇంకెప్పుడూ అలా పడేయరు. ఇంతకీ ఏం చేయొచ్చంటారా? ఒకటో రెండో కాదు, చాలానే లాభాలున్నాయి. వెంటనే చదివేసి నిమ్మతోలును సద్వినియోగం చేసుకోండి...

Published : 18 May 2022 01:17 IST

రసం పిండాక నిమ్మకాయ చెక్కలను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ ఆ తొక్కల వల్ల ఉపయోగాలు తెలిస్తే ఇంకెప్పుడూ అలా పడేయరు. ఇంతకీ ఏం చేయొచ్చంటారా? ఒకటో రెండో కాదు, చాలానే లాభాలున్నాయి. వెంటనే చదివేసి నిమ్మతోలును సద్వినియోగం చేసుకోండి...

* నిమ్మరసం, తేనె నీళ్లలో వేసుకుని తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుందనేది అందరికీ తెలుసు. నిమ్మ తోలులోనూ ఆ సుగుణం ఉంది. ఇది అధిక బరువును తగ్గించడంతో బాటు రక్తపోటునూ నియంత్రిస్తుంది. అరుచిని పోగొట్టి ఆకలి వేసేలా చేస్తుంది. నిమ్మచెక్క క్యాన్సర్‌ కణాలను నిరోధిస్తుందని కొన్ని అధ్యయనాలూ తేల్చాయి.

* నిమ్మరసంలో ఉన్నంత కాకున్నా దాని తోలు లోనూ సి-విటమిన్‌ ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి లేదా ఎండు నిమ్మతొక్కలను కూర లేదా చారులో వినియోగించవచ్చు. మరిగే టీలోనూ వేయొచ్చు.

* దీంట్లో ఉండే పెక్టిన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాలేయంలో బైల్‌ యాసిడ్స్‌ విడుదలయ్యేలా తోడ్పడుతుంది.

* నడక లేదా వ్యాయామం తర్వాత చెమట పట్టి అలసటగా అనిపిస్తుంది. నిమ్మచెక్క వేసి కాచిన నీళ్లను చల్లార్చి తాగడం వల్ల ఆ అలసట తీరి సేదతీరవచ్చు.

* నిమ్మతొక్కలో క్యాల్షియం ఉన్నందున ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పీచుపదార్థం జీర్ణప్రక్రియను పెంపొందిస్తుంది.

* సలాడ్‌, నూడుల్స్‌లో సన్నగా తురిమిన నిమ్మ తొక్కను వేసి చూడండి. అది పోషకంగా పనిచేస్తుంది, రుచిని కూడా పెంచుతుంది. పెరుగు లేదా మజ్జిగకు కూడా ఇది వర్తిస్తుంది.

* రసం పిండిన నిమ్మతొక్కలను ముక్కలుగా కోసి తగినంత ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, కొద్దిగా ఆవపిండి, మెంతిపిండి వేసి తాలింపు పెడితే కమ్మటి పచ్చడి సిద్ధమవుతుంది.

* వీటిని ఎండబెట్టి పొడి చేసి శనగపిండిలో కలిపి సున్నిపిండిలా వాడుకోవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా అవ్వడమే కాదు, కాంతులీనుతుంది.

* నిమ్మతొక్కలను నూనెలో వేసి కాచి చల్లార్చి కురులకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గుతుంది.

* తొక్కలతో మోచేతులకు మర్దనా చేస్తే నలుపు పోయి మృదువుగా అవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్