ఆ బాధ్యత ఇద్దరిదీ...

ఒకటో తారీఖున ఠంచనుగా జీతం పడినా... వచ్చే డబ్బు చాలడం లేదు.. ఖర్చులెలా తగ్గించాలో తెలియడంలేదు- అంటూ మదనపడే ఇల్లాళ్లెందరో... అలాంటప్పుడు ఏం చేయాలి మరి అనుకుంటున్నారా? దీనికి ఆర్థిక నిపుణులు ఏం సూచిస్తున్నారంటే...

Published : 14 Jul 2022 00:52 IST

ఒకటో తారీఖున ఠంచనుగా జీతం పడినా... వచ్చే డబ్బు చాలడం లేదు.. ఖర్చులెలా తగ్గించాలో తెలియడంలేదు- అంటూ మదనపడే ఇల్లాళ్లెందరో... అలాంటప్పుడు ఏం చేయాలి మరి అనుకుంటున్నారా? దీనికి ఆర్థిక నిపుణులు ఏం సూచిస్తున్నారంటే...

* ఆదాయ వ్యయాల గురించి ఆలుమగలు ఇద్దరూ విపులంగా చర్చించండి. ఈ విషయంలో ఇద్దరూ పారదర్శకంగా వ్యవహరించండి. ఒకరికి తెలీకుండా రెండోవారు దేనికీ ఖర్చు చేయొద్దు.

* వచ్చే సొమ్ములో కనీసం 30 శాతం పొదుపు చేయండి. వీలైతే ఆ సొమ్ముని ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టండి. మిగిలిన దాంట్లో బడ్జెట్‌ తయారుచేయండి. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఇంటి అద్దె లేదా హోంలోన్‌ ఈఎంఐ.. ఇలా ఖర్చులన్నిటికీ లెక్క రాయండి. అవన్నీ పోనూ మిగిలిన దాంట్లో అనారోగ్య సమస్యలు, పెళ్లిళ్లూ, కానుకలూ, సినిమాలూ షికార్లకు కొంత తీసి పెట్టండి. ఇంకా మిగిలిన దాన్ని బండి చెడిపోవడం, మిక్సీ మొరాయించడం లాంటి అనుకోకుండా వచ్చే అవాంతరాల కోసం భద్రపరచండి.

* అతను విలాసాలకో, మీరు దుస్తుల కోసమో ఖర్చుపెట్టడం వల్ల ఎంత డబ్బు తరిగిపోయిందీ, దాని వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నదీ వివరంగా మాట్లాడుకోండి. తెలిసో తెలీకో ఎవరి వల్ల నష్టం జరిగినా ఆత్మీయంగా నచ్చచెప్పుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అరుపులూ అవమానించడాలతో మార్పు రాదని గుర్తుంచుకోండి.

* డబ్బు కొరత ఏర్పడగానే తోచే తక్షణ పరిష్కారం అప్పు. కానీ అది తీర్చాలంటే తర్వాతైనా బాధ తప్పదు. దీని గురించి ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీ భాగస్వామి దుబారా తగ్గించకుంటే అప్పులతో ఇబ్బందిపడిన ఇతరుల అనుభవాలను ఉదాహరణగా చెప్పండి. వింటే సరి.. లేదంటే ఇంటిపెద్దలు లేదా దగ్గరి మిత్రులతో చెప్పించండి. అప్పటికీ మార్పు రాకపోతే ఆర్థిక నిపుణుల సలహా, సహకారం తీసుకోండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.

* పాలసీలు లేదా చిట్లు లాంటివి ఇద్దరూ కలిసి చేయండి. గడువులోగా డబ్బు కట్టాలనే బాధ్యత ఇద్దరిమీదా ఉంటుంది.

* ఒకటికి నాలుగు క్రెడిట్‌ కార్డులుండటం స్టేటస్‌ అనుకోకండి. దానివల్ల షాపింగులు ఎక్కువ చేసేసి ఆనక వడ్డీలు కట్టలేక అవస్థపడాలి.

* మీకు ఆసక్తి ఉంటే ‘ది టోటల్‌ మనీ మేకోవర్‌’, ‘ది మిలియనీర్‌ నెక్ట్స్‌ డోర్‌’ లాంటి ప్రేరణ కలిగించే పుస్తకాలు చదవండి. అవి సంస్థలకే కాదు, సంసారాలకూ పనికొస్తాయి. ఆర్థిక ఒత్తిళ్లకు లోనవకుండా హాయిగా బండి నడిపించవచ్చు. అంత ఓపిక లేదంటారా.. ఇంట్లో పెద్దవాళ్లను అనుసరించినా సరిపోతుంది. వాళ్లెంత పొదుపు చేసి మనకు అన్నీ సమకూర్చారో తలచుకుంటే దుబారా చేయరు.
లక్ష్యం పెట్టుకోవాలి... ఈ సంవత్సరం ఇద్దరూ కలిసి ఇంత మొత్తం పొదుపు చేయాలి, లేదా ప్లాటో, కొంత బంగారమో కొనాలి... లాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. దాన్ని ప్రతినెలా సమీక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు అనవసర ఖర్చులు చాలావరకూ తగ్గిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్