ఆకాశమే హద్దు...

మన చుట్టూ ఉన్న కాలుష్యాన్ని, తింటున్న ఆహారంలో కల్తీని తిట్టుకోని రోజంటూ ఉండదు. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే లాభమేముంది.

Updated : 06 Dec 2022 05:59 IST

మన చుట్టూ ఉన్న కాలుష్యాన్ని, తింటున్న ఆహారంలో కల్తీని తిట్టుకోని రోజంటూ ఉండదు. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే లాభమేముంది. లేచి దీపం వెలిగిస్తే కదా వెలుగులు పరచుకునేది. లోకంలో ఏదీ సవ్యంగా, ప్రణాళికాబద్ధంగా ఉండదు. అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని తిట్టుకోవడం, నిందించడం వల్ల ఒనగూరేదేమీ ఉండదు. మన వంతు ఏం చేయగలమో ఆలోచించి కృషి చేసేందుకు ఒక అడుగు ముందుకేస్తే మరికొందరు వచ్చి కలుస్తారు. పర్యావరణ కాలుష్యానికి విరుగుడు మొక్కల పెంపకం. ఎక్కువెక్కువ మొక్కలు, పెద్దపెద్ద చెట్లు పెంచే వెసులుబాటు లేదంటే ఇక చేయగలిగింది ఏముంది అని ఆదర్శానికి తిలోదకాలు ఇవ్వొద్దు. చిన్న మొక్కలతో పని మొదలెట్టండి. మీ వ్యాపకం ఎన్నాళ్లు సాగుతుందో నమ్మకం లేదంటే కుండీలు కూడా కొనకండి. ఖాళీ అయిన స్వీట్‌ బాక్సులు, కొబ్బరి చిప్పలు, చిన్ని చిన్ని డిస్పోజబుల్‌ కంటెయినర్లు.. లాంటి వాటిల్లో చిన్ని చిన్ని మొక్కల్ని ఎంచక్కా పెంచేయొచ్చు. కిటికీలు, బాల్కనీ, వరండా ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేయండి. కాసిని నీళ్లు, కొద్దిగా సూర్యరశ్మి ఉంటే చాలు. ఉల్లి పొట్టు, కూరగాయల వ్యర్థాలు వాటికి సహజ ఎరువుగా వేస్తే ఏపుగా పెరుగుతాయి. పుదీన, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి, బెండ లాంటి మొక్కల్ని నాటితే... అవి ఎదగడం, పుష్పించి ఫలించడం చూస్తుంటే ఆనందానికి మాటలు చాలవు. ఆ ఉత్సాహం మరిన్ని మొక్కల పెంపకానికి దారితీస్తుంది. ఆనక మీ అభిరుచికి తగ్గట్టుగా అనేక మొక్కలను ఎంచుకోవచ్చు. వాకిట్లో స్థలం ఉంటే సొర, బీర, పొట్ల, కాకర, చిక్కుడు లాంటి తీగెలను డాబా మీదికి లేదా ఫెన్సింగుకు పాకించేయొచ్చు. మల్లె, కనకాంబరం, బంతి, చేమంతి, గులాబి, లిల్లీ, సన్నజాజి లాంటి పూలమొక్కల్ని నాటొచ్చు. మామిడి, జామ, సపోటా, నేరేడు, పనస లాంటివీ పెంచొచ్చు. ఆసక్తి, అభిరుచి ఉండాలే కానీ ఆకాశమే హద్దుగా సాగుతుంది మొక్కల పెంపకం. అది మరెందరికో ప్రేరణ కలిగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్