ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తూ.. విడాకులు ఇవ్వమని చిత్రహింస పెడుతున్నాడు!

పెళ్లై పదిహేనేళ్లు. కొన్నిరోజులుగా ఆయన ఏదోక వంకతో నన్నూ పిల్లల్నీ కొడుతున్నాడు. అది సరిపోనట్లు స్నేహితురాలంటూ ఒకమ్మాయిని తరచూ ఇంటికి తీసుకొస్తున్నాడు.

Published : 08 Aug 2023 15:46 IST

పెళ్లై పదిహేనేళ్లు. కొన్నిరోజులుగా ఆయన ఏదోక వంకతో నన్నూ పిల్లల్నీ కొడుతున్నాడు. అది సరిపోనట్లు స్నేహితురాలంటూ ఒకమ్మాయిని తరచూ ఇంటికి తీసుకొస్తున్నాడు. ఎదురు తిరిగితే, ఇది నా ఇల్లు.. నోరుమూసుకుని పడి ఉండు అంటున్నాడు. నాతో ఉండాలని లేదట, విడాకులకీ నన్నే దరఖాస్తు చేయమని చిత్రహింసలు పెడుతున్నాడు. అలా చేస్తే నాకూ, నా పిల్లలకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయా?

- ఓ సోదరి

మీ భర్త మిమ్మల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది. హిందూ వివాహ చట్టం వివాహేతర సంబంధాలను విడాకులకు ఓ కారణంగా పరిగణిస్తోంది. కానీ, అతడు మిమ్మల్ని విడాకులకు దరఖాస్తు చేయమనడానికి కారణం తన తప్పు లేదని నిరూపించు కోవడానికే అయ్యుండొచ్చు. విడాకులు తీసుకుంటే మీకూ, పిల్లలకూ భరణం ఇవ్వాలి. కేసు నడుస్తుండగా కూడా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 భరణం కోరే అవకాశం కల్పిస్తోంది. అలానే, హిందూ దత్తత, భరణాల చట్టం-1956లోని సెక్షన్‌-18 హిందూ భార్యను భర్త తప్పక పోషించాలని చెబుతోంది. ఇందులోని సెక్షన్‌-18 భర్తకు దూరంగా ఉన్న భార్య కూడా అతడి నుంచి మెయింటెనెన్స్‌ అడగొచ్చని పేర్కొంటోంది. సెక్షన్‌ 18(2) ప్రకారం భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చినా, బయట కలిసి ఉంటున్నా కూడా మెయింటెనెన్స్‌ కోరవచ్చు. విడిగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురైతే భర్తకు దూరంగా మరోచోట ఉండేందుకు అవకాశమూ కల్పిస్తుంది.
  ఇక, మీకు.. హిందూ దత్తత, భరణాల చట్టం, హిందూ వివాహ చట్టం, సెక్షన్‌ 125 సీఆర్‌పీసీ, గృహహింస చట్టం వంటివన్నీ మీరూ, మీ పిల్లలు పోషణ ఖర్చులు పొందడానికి సాయం చేస్తాయి. మీ భర్త మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా బాధపెడుతుంటే డీవీసీ సెక్షన్‌ 18 ప్రకారం రక్షణ అడగండి. ఇల్లు అతని పేరు మీద ఉంటే సెక్షన్‌ 19 ప్రకారం అందులో ఉండే హక్కుని మీరూ పొందవచ్చు. సెక్షన్‌ 20 మీకూ, మీ పిల్లలకు అవసరమైన పోషణ ఖర్చుల్నీ లేదా ఒకే మొత్తాన్నీ భరణంగా తీసుకునేలా అవకాశాన్నీ ఇస్తుంది.. ఇక, ఇన్నాళ్లూ మిమ్మల్ని పెట్టిన బాధకు పరిహారంగా సెక్షన్‌ 22 ప్రకారం కాంపన్సేషన్‌నీ తీసుకోవచ్చు. అయితే విడాకుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం మీకు లేదు. అతడి బెదిరింపులకు భయపడొద్దు. ముందు ఎవరైనా కౌన్సెలర్‌తో చెప్పించండి. మారకపోతే లాయర్‌ని సంప్రదించి పరిష్కారం కోసం ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్