Dear Vasundhara: అమ్మ ఆస్తి.. నాకు హక్కులేదా?

భర్త వదిలేయడంతో దర్జీ పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్నా. మా తాతయ్య తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని తన నలుగురు కూతుళ్లకూ సమానంగా రాసిచ్చాడు.

Updated : 10 Oct 2023 16:05 IST

భర్త వదిలేయడంతో దర్జీ పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్నా. మా తాతయ్య తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని తన నలుగురు కూతుళ్లకూ సమానంగా రాసిచ్చాడు. మా అమ్మ వాటా కింద ఒక ఫ్లాట్‌, కొంత పొలం వచ్చాయి. ఆమెకు నేను, తమ్ముడు మాత్రమే వారసులం. నా పెళ్లప్పుడు తాతయ్య పంచి ఇచ్చే ఆస్తిలో భాగం ఇస్తామని పెళ్లి మాటల్లో చెప్పారు. ఇప్పుడేమో వాటా ఇవ్వడం అమ్మతో సహా పుట్టింటి వారెవరికీ ఇష్టం లేదు. తనకు వాటాగా వచ్చిన ఆస్తిలో భాగం కోరే హక్కు నాకు ఉంటుందా! చట్టం నాకెలాంటి సాయం చేస్తుంది.

- ఓ సోదరి

మీ భర్తతో విడిపోయాక పుట్టింటి వాళ్లతో కలవకుండా ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు? మీకు ఆస్తి ఇవ్వడానికి ఎందుకు వారు ఇష్టపడటం లేదు. మీ మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? మీ అమ్మగారు, వారి అక్క చెల్లెళ్లు... వారి తండ్రి ఆస్తిని పార్టిషన్‌ డీడ్‌ రిజిస్టర్‌ చేసుకుని పంచుకున్నారా? లేదా అన్న విషయాలేవీ మీ లేఖలో ప్రస్తావించలేదు. సాధారణంగా హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 14 ప్రకారం స్థిరచరాస్తులేవైనా సరే... స్త్రీకి పెళ్లప్పుడు ఇచ్చినా, వారసత్వంగా సంక్రమించినా, భరణంగా వచ్చినా, దానంగా ముట్టినా, బంధువులు- అత్తింటి వారెవరు ఇచ్చినా అది తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కిందే లెక్క. ఈ స్వార్జితపు ఆస్తిని తనకు నచ్చిన వారెవరికైనా ఇచ్చుకునే హక్కు ఆమెకు ఉంది. సాధారణంగా ఆడపిల్లలు అమ్మానాన్నలకు కాస్త దగ్గరగా ఉండటం వల్ల వారికి రాసివ్వడానికి ఇష్టపడతారు. కానీ, మీ విషయంలో అలా జరగకపోవడం బాధాకరం. మీ తల్లిగారు తన ఆస్తిని కొడుకు పేరున మాత్రమే రాయాలనుకోవడానికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చు. ముందు వారితో మీరు సఖ్యత పెంచుకుంటే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ ఆస్తిని కోర్టు ద్వారా పొందే అవకాశం తక్కువ. ఆలోచించి అడుగేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్