Updated : 13/05/2022 06:58 IST

సమయపాలన గురించి అడిగితే...

అమల ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు గత సంస్థలో అనుభవాలు, లక్ష్యాలు అడుగుతారు అనుకుంది. వాళ్లేమో ఇచ్చిన సమయాన్ని ఎలా వినియోగిస్తావని అడిగారు. ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు.

పట్టికగా.. ప్రతి ఒక్కరికీ ఉండేది 24 గంటలే. ఆ సమయాన్నే జాగ్రత్తగా ఉపయోగించుకుని కొందరు జీవితంలో ఎదుగుతారు. మరికొందరు వృథా చేసి దొరికిన కెరియర్‌నే నిలబెట్టుకోలేకపోతారు. సమయాన్ని సముచితంగా ఉపయోగించుకోవాలంటే... రేపటి పనులను ఈరోజే పట్టికలా వేసుకోవాలి. వాటిలో ప్రాముఖ్యతను బట్టి వరుసగా రాయాలి. ఉదయమే ఓసారి పరిశీలించి, ఆఫీస్‌కు వెళ్లిన వెంటనే మొదలుపెడితే చాలు. సమయం వృథాకాకుండా పూర్తిచేయొచ్చు.

ఉత్సాహ సమయం.. ఆఫీస్‌కు వచ్చాక మొదటి మూడు నాలుగు గంటలు యాక్టివ్‌ సమయం. చాలామంది కార్యాలయంలో అడుగుపెట్టగానే సహోద్యోగులతో మాట్లాడుతుంటారు. ఆ తర్వాత ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి అదనపు సమయం కావాల్సి ఉంటుంది. భోజనానికి దూరమవుతారు. దీంతో ఒత్తిడికి గురై, తీవ్ర అలసటనూ.. తెచ్చిపెడుతుంది. పనిలో సరైన ఫలితాలు రాకపోవచ్చు. సమయానికి ఆహారాన్ని తీసుకుంటేనే శరీరం, మెదడు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండి సకాలంలో అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడానికి వీలుంటుంది.

మెయిల్స్‌లో.. ఉదయం పరిశీలించాల్సిన మెయిల్స్‌ ఉంటే దానికంటూ నియమిత సమయాన్ని కేటాయించుకొని పూర్తిచేయగలగాలి. ఆ తర్వాత మిగతా పని మొదలుపెట్టాలి. సమావేశానికి హాజరు కావాల్సిన రోజు అక్కడ చర్చించాల్సిన విషయాలను ముందే రాసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే అక్కడ అందరిముందు పని సులువవుతుంది. పై అధికారుల దగ్గర చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. బృందంతో కలిసి పనిచేయడానికి నిత్యం ఉత్సాహంతో సంసిద్ధంగా ఉండాలి. ఇల్లు, ఆఫీస్‌ ఎక్కడ పని చేయాలన్నా.. మనసు ప్రశాంతంగా ఉంటేనే వీలవుతుంది. ఇందుకోసం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించాలి. పోషకాహారంతోపాటు యోగా, ధ్యానం వంటివి పాటించాలి. దీంతో సమయపాలన పాటించగలిగి విజయాలు సాధించొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని