ఉద్యోగానికి వెళుతూనే...

విమల ఇద్దరు పిల్లలకు అన్నీ చేసి మరీ అత్తగారికి అప్పగించి వెళుతుంది. సాయంత్రం వచ్చాక మళ్లీ వారి బాధ్యతలను తనే చూసుకుంటుంది. అయినా సరే... ఆ, ఉద్యోగం చేసే వాళ్లకు పిల్లలను పెంచడం ఎలా కుదురుతుందిలే అనే బంధువుల వ్యాఖ్యలు ఆమెను బాధిస్తుంటాయి. దాంతో తను సరిగ్గా చేయలేకపోతున్నానా అని ఆందోళనపడుతూ ఉంటుంది. అవేవీ పట్టించుకోవద్దు... ఉద్యోగం చేస్తూనే పిల్లలను చక్కగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 03 Jun 2022 00:54 IST

విమల ఇద్దరు పిల్లలకు అన్నీ చేసి మరీ అత్తగారికి అప్పగించి వెళుతుంది. సాయంత్రం వచ్చాక మళ్లీ వారి బాధ్యతలను తనే చూసుకుంటుంది. అయినా సరే... ఆ, ఉద్యోగం చేసే వాళ్లకు పిల్లలను పెంచడం ఎలా కుదురుతుందిలే అనే బంధువుల వ్యాఖ్యలు ఆమెను బాధిస్తుంటాయి. దాంతో తను సరిగ్గా చేయలేకపోతున్నానా అని ఆందోళనపడుతూ ఉంటుంది. అవేవీ పట్టించుకోవద్దు... ఉద్యోగం చేస్తూనే పిల్లలను చక్కగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు నిపుణులు.

ముందుగా తల్లి సంతోషంగా, ఉత్సాహంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఎవరో ఏదో అంటున్నారనే అపరాధభావాన్ని దూరంగా ఉంచితేనే చిన్నారుల అవసరాలను పూర్తిగా తీర్చగలుగుతారు. వారికి జీవితంలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పగలుగుతారు. అందుకే తల్లి తన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఉల్లాసంగా ఉంటూ ఆఫీస్‌లో బాధ్యతలెన్ని ఉన్నా.. ఇంటికొచ్చాక కూడా అదే ఉత్సాహంతో ఉండగలుగుతుంది.

ఇంటికొద్దు... ఆఫీస్‌ పనిని ఇంటికి తీసుకు రాకూడదు. అది ఒత్తిడిని పెంచుతుంది. ఇంటికొచ్చాక కూడా అమ్మ మా మీద శద్ధ్ర చూపడంలేదనే భావం పిల్లల్లో మొదలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకూ పనులన్నీ కార్యాలయంలోనే ముగించి రాగలగాలి. అయితే కొన్ని ఉద్యోగాలకు ఇంట్లోనూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అటువంటి వాటికి కాస్త సమయం విరామం ఇచ్చి చేయాలి. ముందు పిల్లల అవసరాలను గుర్తించి పూర్తిచేయాలి. వారితో సమయాన్ని గడపాలి. ఆరోజు వారేం చేశారో అడుగుతూ మాట్లాడుతుంటే చాలు. వాళ్లూ ఉత్సాహంగా చెప్పడానికి ముందుకొస్తారు. వాళ్లతో ఆడటం, కథలు చెప్పడం వంటివి ఉత్సాహాన్ని పెంచడమే కాదు, తల్లీబిడ్డల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. మిగిలిన ఆఫీస్‌ వర్క్‌ను పిల్లలు నిద్రపోయిన తర్వాత వేగంగా పూర్తిచేసి నిద్రకు ఉపక్రమించాలి.

నో చెప్పాలి.. కొందరికి ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్‌ పని చేయాల్సిన అవసరం ఉండదు. అయినా మొహమాటానికి వాటిని పూర్తి చేస్తామని మాటిచ్చి, ఇంటికొచ్చి పిల్లలతో గడపలేక, మరోవైపు పని చేయలేక సతమతమవుతుంటారు. అలాకాకుండా అదనపు పని చేయడానికి కచ్చితంగా నో చెప్పడం నేర్చుకోవాలి. కుటుంబానికి కొంత సమయాన్ని వెచ్చించడానికి మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ రోజు ఏయే పనులు పూర్తిచేయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అలా ప్రణాళికగా సమయాన్ని వినియోగించుకోగలిగితే అటు ఆఫీస్‌, ఇటు ఇల్లు.. రెండింటినీ సమన్వయం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్