పోల్చుకోండి.. పర్లేదు!
‘పక్కవాళ్లతో పోల్చుకోవద్దు.. ఇది మనసుపై చెడు ప్రభావం పడేలా చేస్తుంది’ సాధారణంగా వినిపించే సలహానే! కెరియర్‌లో ముందుకు సాగాలంటే ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
‘పక్కవాళ్లతో పోల్చుకోవద్దు.. ఇది మనసుపై చెడు ప్రభావం పడేలా చేస్తుంది’ సాధారణంగా వినిపించే సలహానే! కెరియర్‌లో ముందుకు సాగాలంటే ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే అది ఇలా, సానుకూలంగానూ సాగాలంటున్నారు.
నీ తోటి వారికి పదోన్నతి వచ్చిందనుకోండి. ‘నాకు రాలేదు’ అన్న కోపం, బాధ కొందరిని ఆవరించేస్తాయి. ఎందుకు రాలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒకేసారి చేరాం లేదా సీనియర్ అన్నది కాదు పోల్చుకోవాల్సింది. తనలో ఏ తీరు మీకంటే భిన్నం.. ఏ లక్షణాలు ఆ స్థానానికి చేర్చాయన్నది గమనించాలి. దాన్నిబట్టి మీ లోపాలను గ్రహించుకొని సరిచేసుకుంటే సరి.
* పోలిక రెండు వైపులా పదును ఉన్న కత్తి. అవతలి వాళ్లని నెగెటివ్ దృష్టితో చూసుకుంటూ వెళితే అది మిమ్మల్నీ పతనం వైపే తీసుకెళుతుంది. సానుకూలంగా చూస్తే ఉన్నత స్థానానికి నడిపిస్తుంది. ఉదాహరణకు ‘నా స్నేహితురాలు వ్యాపారంలో దూసుకెళుతోంది. నేనేమో రాత్రి వరకూ ఆఫీసులోనే నెట్టుకొస్తున్నా’ అనుకుంటే బాధనిపిస్తుంది. బదులుగా వ్యాపారం మొదలు పెట్టిన తీరు.. తనెలా కష్టపడింది.. ఎలా నేర్చుకుంటూ పై స్థాయికి వెళ్లిందో కనుక్కోండి. మీరూ వ్యాపారమే చేయాలనేం లేదు. కానీ ఆ లక్షణాలు కెరియర్‌లో ముందుకెళ్లడంలో మీకు సాయపడతాయి.
* మీ పరిధులను దాటుకొని ఎంత వరకూ ప్రయత్నించొచ్చో తెలుసుకోవాలన్నది దీని ఉద్దేశం. ‘నా వల్ల కాదు’, ‘సమయం లేదు’ అనుకొని కూర్చోకుండా మీ శక్తిని ఇంకా ఎంత వరకూ ఉపయోగించగలరో అంచనా వేసుకునే మార్గం కూడా. ఇది చెయ్యి, ఇక్కడికి వెళ్లు.. ఇలా చెయ్యి అన్న సలహాలు భారంగా తోయొచ్చు. అదే నేను చేయాలి, సాధించాలి అన్న స్వీయ ప్రేరణ ప్రయత్నించాలన్న కోరికను బలపరుస్తుంది. కాబట్టి.. ఇక నుంచి ఇలాంటి పోలికలను అలవాటు చేసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.