ఫోన్ తీస్తే.. కోపమొస్తుంది!
ఆఫీసులో కొత్తగా చేరా. మా పైఅధికారి చాలా స్ట్రిక్ట్. ఆఫీసులో ఫోన్ తీసినా, స్నేహితులతో కలిసి పక్కకు వెళ్లినా ఆయనకు కోపం వస్తుంది. పని గుర్తు చేస్తూ ఉంటాడు. ఏకధాటిగా ఎలా పని చేస్తాం? పైగా కొత్త.
ఆఫీసులో కొత్తగా చేరా. మా పైఅధికారి చాలా స్ట్రిక్ట్. ఆఫీసులో ఫోన్ తీసినా, స్నేహితులతో కలిసి పక్కకు వెళ్లినా ఆయనకు కోపం వస్తుంది. పని గుర్తు చేస్తూ ఉంటాడు. ఏకధాటిగా ఎలా పని చేస్తాం? పైగా కొత్త. అన్ని బాధ్యతలూ తీసుకోలేను. ఆయనలా చెబుతోంటే చిరాగ్గా ఉంది. ఏం చేయను?
- లతీష, వైజాగ్
కఠినంగా వ్యవహరించే బాస్ వల్ల మెరుగైన పనితీరు, విలువలూ తెలుస్తాయి. కొలువులో చేరిన తొలి రోజుల్లోనే మీరెంతవరకూ సీరియస్‌గా ఉన్నారనేది అంచనా వేస్తారు. అలాంటిది ఫోన్ పట్టుకొని కూర్చుంటే నెగెటివ్ ముద్ర పడుతుంది. అది మీకే మంచిది కాదు. సంస్థలూ మిలీనియల్స్, జెన్ జెడ్‌లపై చేసే ఫిర్యాదే ఇది. ఎక్కువసేపు ఉంటున్నాం కదా అని ఆలస్యంగా వస్తుంటారు. క్రమశిక్షణ, పనిపట్ల గౌరవం లేవనే భావన కలిగిస్తున్నారు. ముందొచ్చి బయట సేదతీరినా పర్లేదు కానీ సమయానికి ఆఫీసులో ఉండేలా చూసుకోండి. ఇంకా ‘కొత్త’ అనే సాకు పక్కన పెట్టి బృందంతో కలిసిపోండి. మీ బాధ్యతలు త్వరగా తెలుసుకొని చేస్తోంటే ఇతరులపై భారం తగ్గించినవారు అవుతారు. అప్పుడు వాళ్లూ మీపట్ల సానుకూలంగా వ్యవహరిస్తారు. స్ట్రిక్ట్‌గా ఉండే బాస్‌తో మెలగడం కష్టమే. అయినంత మాత్రాన నెగెటివ్‌గా చూడక్కర్లేదు. జాగ్రత్తగా గమనించండి. మిగతా సమయాల్లో మామూలుగానే ఉంటుండొచ్చు. ఒత్తిడిలో, టార్గెట్లు దగ్గర పడుతున్నప్పుడు అలా ప్రవర్తిస్తున్నారేమో! అలాంటప్పుడు మీరు మారితే వారి తీరూ మారొచ్చు. అలాకాకుండా బాస్ అకారణ ద్వేషం చూపిస్తోంటే మెంటార్ లేదా హెచ్‌ఆర్ సాయం తీసుకోండి. అయితే ఎవరైనా మీ తీరునే తప్పుపడతారు. ఫోన్, స్నేహితులతో గడపడం మీకు ఆనందమే కానీ ఆఫీసు వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి, ముందు మారండి. కాలేజీ జీవితంలానే ఆఫీసూ ఉంటుందని పొరబడొద్దు, ఆశించొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.