కోడలికి పెళ్లైతే... మాకు హక్కుండదా!

నాకు ఇద్దరు కొడుకులు. రెండోవాడు కొవిడ్‌తో చనిపోయాడు. అప్పటికి వాడికి ఇద్దరు పిల్లలు. మా కోడలు మాతోనే ఉంటూ ప్రభుత్వోద్యోగం చేసేది. ఇప్పుడు తన తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చేస్తున్నారు. అందుకు మేమేమీ అభ్యంతరం చెప్పడం లేదు.

Updated : 21 Nov 2023 12:21 IST

నాకు ఇద్దరు కొడుకులు. రెండోవాడు కొవిడ్‌తో చనిపోయాడు. అప్పటికి వాడికి ఇద్దరు పిల్లలు. మా కోడలు మాతోనే ఉంటూ ప్రభుత్వోద్యోగం చేసేది. ఇప్పుడు తన తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చేస్తున్నారు. అందుకు మేమేమీ అభ్యంతరం చెప్పడం లేదు. పిల్లల్ని తను తీసుకెళ్లిపోతే మాకు వారిపై ఎటువంటి హక్కులూ ఉండవా? మాకు చూడాలనిపించినప్పుడు తను పంపిస్తా అంటోంది కానీ, అలా చేయకపోతే చట్టం మాకెలా సాయం చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఏమైనా బాండ్‌ పేపర్‌ మీద రాయించుకోవాలా? తర్వాత వారి ఇంటిపేరుని మార్చే అధికారం తనకి ఉంటుందా? ఆమె చేసుకోబోయే వ్యక్తి మా అంగీకారం లేకుండా దత్తత తీసుకోగలడా? దయచేసి సలహా ఇవ్వగలరు?

ఓ సోదరి

మీరు అనవసరంగా భయపడుతున్నారనిపిస్తోంది. మీ కోడలికి వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకోవడం సబబే కదా! మీ కోడలు రెండో పెళ్లి చేసుకున్నా... చట్టంలో తాత, నానమ్మలకు ఎలాంటి హక్కులు ఉంటాయో అవన్నీ మీకూ ఉంటాయి. సాధారణంగా హిందూ మైనారిటీ అండ్‌ గార్డియన్‌షిప్‌ యాక్ట్‌ -1956లోని సెక్షన్‌ 4(బి) ప్రకారం తల్లిదండ్రులు సహజంగా సంరక్షకులవుతారు. వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా రెండోవారికే వారిపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. అయితే, తల్లి లేదా తండ్రి పిల్లల క్షేమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సెక్షన్‌ 7 ప్రకారం కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు. అప్పుడు కోర్టు నియమించినవారే గార్డియన్‌ అవుతారు. మీ కోడలు పిల్లల్ని మీకు చూపించకపోతే విజిటింగ్‌ రైట్స్‌ కోసం కోర్టులో వేయాలి. దానికోసం మీరు బాండ్‌ పేపర్ల మీద రాయించుకోనవసరం లేదు. ఆమె తన పిల్లలకు రెండో భర్త ఇంటిపేరుని మార్చాలనుకుంటే అతడు వారిని దత్తత చేసుకున్నట్లుగా రిజిస్టర్‌ చేయించాలి. తర్వాత గెజిట్‌ పబ్లికేషన్‌ చేయించుకోవాలి. దానికి మీ అంగీకారం అవసరం లేదు. ఎందుకంటే పిల్లల మీద సంపూర్ణ హక్కులూ తనకి ఉంటాయి. చిన్నారులను చూడలేకపోతున్నామని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారు కొడుకు పిల్లలుగా మీ వారసులే. వాళ్లకి పద్దెనిమిదేళ్లు వచ్చే వరకూ ఎక్కడ ఉండాలి అనేది తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత వాళ్లకి నచ్చిన చోట ఉండొచ్చు. మీ కోడలితో సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉంచుకోండి. అంతా మంచే జరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్