ఈ డాక్టర్‌ ఖాదీకి కొత్త ఊపిరిలూదుతోంది

ఖాదీ పేరెత్తితే... ఒకప్పుడు అమ్మో ముతక ఖద్దరా అనే యువతరం... ఇప్పుడు దాంతోనే ప్రయోగాలు చేస్తోంది. దాన్నే ట్రెండ్‌గా భావిస్తోంది. అంతేనా! దానికి ఆధునిక సొగసులు, సంప్రదాయ కళలను జతచేర్చి అద్భుతాలు సృష్టిస్తోంది. ఆమే వైజాగ్‌కి చెందిన డాక్టర్‌ గంగూరి ఐశ్వర్య.

Published : 30 Aug 2021 00:31 IST

ఖాదీ పేరెత్తితే... ఒకప్పుడు అమ్మో ముతక ఖద్దరా అనే యువతరం... ఇప్పుడు దాంతోనే ప్రయోగాలు చేస్తోంది. దాన్నే ట్రెండ్‌గా భావిస్తోంది. అంతేనా! దానికి ఆధునిక సొగసులు, సంప్రదాయ కళలను జతచేర్చి అద్భుతాలు సృష్టిస్తోంది. ఆమే వైజాగ్‌కి చెందిన డాక్టర్‌ గంగూరి ఐశ్వర్య. ఖాదీతో చేసిన చీరలు, గౌనులు, ఇండోవెస్ట్రన్‌ సూట్‌లకు తోలుబొమ్మల కళారూపాలను కలగలిపి కొత్త ఆవిష్కరణలకు తెరతీసింది. వాటికి దేశవిదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. ఆ వివరాలను వసుంధరతో పంచుకుందిలా...

ఫ్యాషన్‌లు, ట్రెండ్‌లు వంటివాటిపై నాకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఎక్కువ. అమ్మ, అమ్మమ్మ ఎంబ్రాయిడరీ చేసేవారు. దుస్తులూ కుట్టేవారు. వారి ప్రభావం నామీదా ఉండేది. రెండో తరగతిలో ఉండగా...నా పుట్టిన రోజు గౌను డిజైన్‌ ఎలా ఉండాలో నిర్ణయించుకున్నా. మెడ చుట్టూ వేయాల్సిన స్వరోస్కీ స్టోన్ల పరిమాణం, ఆకృతి వంటివన్నీ నేనే ఎంపిక చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ అభిరుచి నాతో పాటూ పెరుగుతూ వచ్చింది. కళలపైనా పట్టు ఉండాలనే ఇష్టంతో అమ్మానాన్నలు నన్ను డ్యాన్స్‌, సంగీతం తరగతులకీ పంపేవారు. ఓ పక్క చదువు, మరోక్క హాబీలు నేర్చుకునేందుకు సమయం కేటాయించేదాన్ని. ఎనిమిదో తరగతిలో ఉండగా కుట్టుపని నేర్చుకున్నా. అయితే కెరియర్‌గా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఎంచుకోవడానికి అమ్మ ఇష్టపడలేదు. మా తాతగారికి నన్ను డాక్టర్‌గా చూడాలన్నది కల. కానీ అది పూర్తయ్యేంతవరకూ వేచి చూడటం నా వల్ల కాలేదు. అందుకే సమాంతరంగా ఫ్యాషన్‌ పట్టా అందుకున్నా. అయితే అందరిలా బొటిక్‌ పెట్టి కస్టమైజ్డ్‌ దుస్తులు కుట్టివ్వడం కాకుండా కాస్త భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నా. అలా మన సంప్రదాయ చేనేత, ఖాదీ రకాలకు ప్రాచుర్యం కల్పించాలనుకున్నా. దాంతో వినూత్న ప్రయోగాలు చేయడం మొదలుపెట్టా. ముఖ్యంగా దీనికి ఇప్పుడిప్పుడే కాలం కలిసొస్తోంది. ముతకగ్గా ఉంటుందన్న అపోహను పోగొట్టడానికి రంగులద్ది రకరకాల ప్రయోగాలు చేశా. సంప్రదాయ రకాలతో పాటు ఇండ్రోవెస్ట్రన్‌లోనూ ఇది చక్కగా ఇమిడిపోతుందన్నది చూపించాలనేదే నా ప్రయత్నం.

తోలుబొమ్మలతో...

ఈ ప్రయోగాల్లో ముఖ్యంగా అంతరించిపోతున్న కళారూపాల్ని ఖాదీ వస్త్రాలకు మేళవించి ఆకర్షణీయమైన డిజైన్లెన్నో రూపొందించా. వాటిలో తోలు బొమ్మలు కూడా ఒకటి. ఇందుకోసం అనంతపురం జిల్లాలోని నిమ్మలకుంట గ్రామం వెళ్లొచ్చా. అక్కడి నుంచే వాటిని తెప్పించుకుంటా. వాటిని జతచేసి చేసిన చీరలు, కుర్తీలు, గౌన్లు... వంటివెన్నో డిజైన్‌ చేశా. నూలుతో ట్రెండీ నగలను రూపొందించా. వీటికి చక్కటి ఆదరణ లభించింది. దేశవిదేశాల నుంచి ఎన్నో ఆర్డర్లూ అందుకున్నా. మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ వస్త్రశ్రేణిని దేశవ్యాప్తంగా ఫ్యాషన్‌ వేదికలపై ప్రదర్శించా. 2018లో అమెరికా నుంచి మిస్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైన మిస్‌ క్లారిసా బోవర్స్‌కు తేలికైన ‘ఖాదీ పట్టు బాల్‌గౌన్‌’ బహుకరించా. ఆమె నన్ను కలవడానికే ప్రత్యేకంగా వైజాగ్‌ వచ్చింది. క్లారిసా... ‘తన జీవితంలోనే అందమైన కానుక ఆ గౌను’ అని చెప్పడం నాకెంతో తృప్తినిచ్చింది. ఖాదీకి పూర్వవైభవం తీసుకురావడానికి చేసిన ప్రయోగాలు నాకు గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 2019లో ‘ఖాదీ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’(కె.డి.సి.ఐ.) నుంచి ‘ఉత్తమ ఖాదీ డిజైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నా.  అంతేకాదు కె.డి.సి.ఐ. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగానూ నియమితురాలినయ్యాను.

క్షేత్రస్థాయిలో పని...

మా డిజైన్లకోసం ప్రధానంగా మస్లిన్‌ క్లాత్‌ వాడుతుంటా. ఇందుకోసం తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని చేనేత పని వారితో కలిసి పని చేస్తున్నా.  నేను కూడా కొన్నాళ్లక్రితం తూర్పుగోదావరి జిల్లాలోని ఏడిద గ్రామంలో నేతపనీ నేర్చుకున్నా. ఆసక్తి ఉన్నప్పుడు ఏదీ కష్టం కాదు...అందుకే దంత వైద్యురాలిగా ప్రాక్టీస్‌ చేస్తూనే, మరో పక్క డిజైనర్‌గానూ కెరియర్‌ని తీర్చిదిద్దుకుంటున్నా.


సంగీతం-నృత్యంలోనూ..: నాన్న వెంకట రవీంద్రనాథ్‌ వ్యాపారవేత్త. అమ్మ లక్ష్మీ సుజాత ఫ్యాషన్‌ డిజైనర్‌. మూడేళ్ల వయసు నుంచే నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టా, కూచిపూడి శ్రీహరి బాలాదిత్య, బాలకొండలరావు, అనుకూల ఆదిత్యల వద్ద నేర్చుకున్నా. అలానే టోనీ మాస్టర్‌ వద్ద వెస్ట్రన్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. వైజాగ్‌లోని డి.వి.ఎన్‌.కళాక్షేత్రంలో కర్ణాటక సంగీతం సాధన చేశాను. ఇప్పటివరకూ సుమారు 500 నృత్యప్రదర్శనలిచ్చాను. ఓ పక్క దంత వైద్యం చేస్తూనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లోనూ సాగుతున్నా. ఒకేసారి ఇన్ని పనులు చేయడం నాకే మాత్రం కష్టంగా లేదు. ఎందుకంటే ఇష్టంగా చేస్తే అలసట తెలియదు కదా!

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్