హార్వర్డ్‌లో సన్మానం చేశారు!

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అంటూ రాయప్రోలు సుబ్బారావు రచించిన దేశభక్తి గీతాన్ని నిజం చేస్తున్నారు తేలుకుంట్ల జయశ్రీ. వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేస్తూనే, విదేశీ గడ్డపై మన సంస్కృతి...

Published : 03 Sep 2021 02:58 IST

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని..
నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అంటూ రాయప్రోలు సుబ్బారావు రచించిన దేశభక్తి గీతాన్ని నిజం చేస్తున్నారు తేలుకుంట్ల జయశ్రీ. వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేస్తూనే, విదేశీ గడ్డపై మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. స్వదేశంలో సేవా కార్యక్రమాలతో సాగిపోతున్నారు. ఆమెతో వసుంధర ముచ్చటించింది.

నుభవాలే పాఠాలు నేర్పుతాయి. కొత్త దారులూ చూపిస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకుంటామన్నది మన చేతుల్లోనే ఉంది. అదే మనకు జీవితాన్ని పరిచయం చేస్తుంది కూడా. ఈ రోజు దేశం కాని దేశంలో నిలదొక్కుకున్నామన్నా, సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా అదే కారణం. మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మధ్యతరగతి కుటుంబం. నాన్న ఊట్కూరి జోగయ్య మార్కెట్‌ యార్డ్‌లో కార్యదర్శిగా చేసేవారు. అమ్మ గృహిణి. పీజీ చేస్తుండగా పెళ్లి కావడంతో మధ్యలోనే దాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆయనతో పాటు అమెరికా వచ్చేశా. చదువును కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇక్కడే కొన్ని కంప్యూటర్‌ కోర్సులు చేశా. మా వారు నర్సింహ, ఐటీ ఇంజినీర్‌. ‘ఐటీ సర్వ్‌’ సంఘానికి నార్త్‌ ఈస్ట్‌ ఛాప్టర్‌ ఫౌండర్‌ ప్రెసిడెంటు. మాకిద్దరు పిల్లలు మణిదీప్‌, సైబర్‌ సెక్యూరిటీ కోర్సు చేస్తున్నాడు. వైష్ణవి, 11వ గ్రేడ్‌ చదువుతోంది.

గళం నా బలం... చిన్నతనం నుంచే తెలుగు భాషన్నా, మన సంస్కృతీ, సంప్రదాయాలన్నా మక్కువ. ఆ ఇష్టంతోనే 2008 నుంచి ఇక్కడి ప్రవాసాంధ్రులకు తెలుగునీ, సంప్రదాయాల్ని నేర్పిస్తున్నా. ముఖ్యంగా సిలికానాంధ్ర సౌజన్యంతో యూఎస్‌లోని పిల్లలకు 13 ఏళ్ల పాటు తెలుగుని నేర్పించా. గలగలా మాట్లాడగలగడం, వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాహిత్య, న్యాయ అంశాలపై ఉన్న పట్టు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత నన్ను వ్యాఖ్యాతగా మార్చాయి. 2011లో రేడియో జాకీగా నా ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం ‘టోరి’లో అయిదు రకాల కార్యక్రమాలు చేస్తున్నా.

ఇవాంక బృందంలో నేను...  2017లో హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌’కు ఇవాంకా ట్రంప్‌తో పాటు వచ్చిన ప్రవాసీల బృందంలో నేనూ ఒకదాన్ని. ఇలా సొంత గడ్డకే విదేశీ అతిథిగా రావడం నాకో గొప్ప అనుభూతి. సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన కార్యక్రమంలో నన్నూ అతిథిగా ఆహ్వానించి, సన్మానించారు.

అమ్మానాన్నల మరణంతో... కాలేజీ రోజుల నుంచీ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేదాన్ని. 2010లో అమ్మ ఆ తర్వాత రెండేళ్లకే నాన్న క్యాన్సర్‌తో మరణించారు. క్యాన్సర్‌ని ముందుగా గుర్తిస్తే కొందరి ప్రాణాలైనా కాపాడగలమన్న ఆలోచనతో ఉచిత నిర్ధరణ పరీక్షలు చేయించడం మొదలుపెట్టా. ఇందుకోసం క్యాన్సర్‌పై పోరు సాగించే ‘ఆంకోటిలెంట్‌’ స్వచ్ఛంద సంస్థకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా, భారతదేశ కన్వీనర్‌గా పని చేస్తున్నా. యశోద ఆసుపత్రుల సహకారంతో మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేటతో పాటు మంచాల్‌, హైదరాబాద్‌ వంటి చోట్ల క్యాంపులు ఏర్పాటు చేశా. కరోనా సమయంలో పీపీఈ కిట్లు, మాస్కులు వంటి రక్షణ సామగ్రిని తిరుపతి రుయా ఆసుపత్రితో పాటు కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి పంపిణీ చేశాం.

ఎవరూ ఇబ్బంది పడకూడదనే... అమెరికా వచ్చిన కొత్తలో మేం పడిన ఇబ్బందులు మరెవరూ పడకూడదనే ఆలోచనతో 2017లో ‘డిజిక్స్‌ ఫామ్‌’ సంస్థను స్థాపించా. దీని ద్వారా మహిళలకు ఉపాధితో పాటు గ్రీన్‌కార్డులు, హెచ్‌1 వీసా ప్రాసెసింగ్‌ వంటి వాటిలో సహకారం అందిస్తాం. టీడీఎఫ్‌ (తెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరం)లో భాగంగా ‘సంకల్పం’ ‘జైకిసాన్‌’ వంటి విభాగాల్ని ఏర్పాటు చేసి చేనేత, రైతు కుటుంబాలకు సాయమందిస్తున్నా. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సాయంతో వారికి అధునాతన పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. ఆ శిక్షణ వల్లనే మొదటి సారి మెన్‌ కుర్తీలను తయారు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘ఇన్ఫోజంక్షన్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నా. దీని ద్వారా గ్రామీణ పేదలకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇచ్చి.. విదేశీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఆలోచన.

- ఆవుల రమేష్‌, మిర్యాలగూడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్