Updated : 06/09/2021 05:44 IST

సేవ కోసమే వైద్యవృత్తిని వదిలేశా!

రైతు కుటుంబంలో పుట్టి.. వైద్యురాలిగా ఎదిగారు. ఆపై సమాజహితం కోసం తన వృత్తిని సైతం వదులుకొని.. పర్యావరణ వేత్తగా మారారు. ఆమే డా.శాంతి. చెత్త నుంచి సంపద సృష్టించడమెలాగో చెబుతూ... స్వచ్ఛత కోసం పాటుపడుతున్నారు. ఆ వివరాలను వసుంధరతో పంచుకున్నారిలా...

నుకున్నది ఎంత కష్టమైనా సాధించే మనస్తత్వం నాది. అందుకే నా లక్ష్యాలకు అనుగుణంగా భిన్నమైన దారుల్లో ప్రయాణించగలుగుతున్నా. మా స్వస్థలం విజయవాడ. వ్యవసాయ నేపథ్య కుటుంబం మాది. నాన్న వెంకట సుబ్బారావు రైతు. అమ్మ భాగ్యలక్ష్మి గృహిణి. ఆవిడ ఏడాది కిందట చనిపోయారు. నా చదువంతా అమ్మమ్మ ఊరు కర్ణాటకలోని బల్లార్షలోనే సాగింది. చిన్నప్పుడే వైద్యురాలిని కావాలనే లక్ష్యం పెట్టుకున్నా. గుల్బర్గలో బీడీఎస్‌ పూర్తిచేశా. శిక్షణ పూర్తయ్యాక  బెంగళూరులో వైద్యురాలిగా స్థిరపడ్డా. మావారు దుర్గాప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మాకు ఇద్దరు పిల్లలు... బాబు కోమల్‌శ్రీవాస్తవ్‌ పది, పాప శ్రీఅక్షిత తొమ్మిది చదువుతున్నారు.

చెత్త నుంచి ఎరువు...
ఓ రోజు ఇంటికి వచ్చిన చెత్తసేకరణ వాహనాన్ని చూసి దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఏం చేస్తారు అన్న ప్రశ్న తలెత్తింది. అలా మేం ఉంటున్న హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లోని చెత్తను ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మున్సిపాలిటీ వాహనం వెనుకే నగరానికి దూరంగా ఉన్న డంప్‌యార్డ్‌కి వెళ్లా. అక్కడ ఆ వ్యర్థాలను వేరుచేస్తోన్న వ్యక్తులను చూసి చలించిపోయా. అది మన ఇళ్ల వద్దే జరిగితే...అంత ఇబ్బంది ఉండదు కదా అని ఓ ఆలోచన చేశా. అలా 2011లో స్నేహితురాలు రేఖ సాయంతో మా వార్డు పరిధిలో ఉన్న 35 వేల ఇళ్లల్లో ఈ విషయాన్ని ముద్రించి కరపత్రాలు పంచాం. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. దాంతో ఈసారి మున్సిపాలిటీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పనిచేశా. అప్పటి జాయింట్‌ కమిషనర్‌ సాయంతో తడిచెత్తను కత్తిరించే ఓ యంత్రాన్ని కొనుగోలు చేయించా. దాన్ని స్థానిక పార్కులో పెట్టి దానిద్వారా ఎరువుల తయారుచేసి అమ్మేలా చూశా. అలా నా మొదటి ఆలోచన విజయవంతమైంది. 

జరిమానాతో మార్పు....
2015 నాటికి మరో ఇరవైమంది మహిళలు నాకు తోడయ్యారు. మేమంతా కలిసి హెచ్‌ఎస్‌ఆర్‌ సిటిజన్‌ ఫోరంగా ఓ ఎన్జీవోను ఏర్పాటుచేశాం. దీని ద్వారా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ప్రతి విద్యార్థికి కరపత్రాలు అందించి వారి ఇళ్లకు చేరవేశాం. ఇన్నిచేసినా...పూర్తిస్థాయిలో చెత్తను వేరుచేసి ఇచ్చేవారు కాదు. అప్పుడు తడి, పొడి, హానికర చెత్తను విడదీసి ఇవ్వకపోతే జరిమానా విధించేలా.. అధికారులతో ఓ నిబంధన పెట్టించాం. ఆ నిర్ణయం తర్వాత ఆరునెలలకు మా ఆలోచన ఫలించింది. ఆపై మా సభ్యుల సంఖ్య పెరిగింది. మరికొన్ని ప్రాంతాలకూ మా కార్యక్రమాలు విస్తరించాం.  ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో చేస్తున్న మా పనులను బెంగళూరు పట్టణమంతా విస్తరించేలా.. సిటిజన్‌ పార్టిసిపేషన్‌ ప్రోగ్రామ్‌ని చేపట్టింది. ఆపై 2016 మార్చిలో ప్లాస్టిక్‌ను నిషేధించింది. ఈ విజయాలన్నీ నేను వైద్యవృత్తిని వదులుకున్నాక.. సాధించిన ఆస్తిపాస్తులు.

చెత్తపై అవగాహన కోసం ఓ బడి..
చెత్తను ఎరువుగా ఎలా మార్చాలి. దాన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు వంటి అంశాలను ప్రజల్లోకి క్షుణ్నంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా స్థానిక వార్డులోని మున్సిపాలిటీకి చెందిన ఓ పార్కులో స్వచ్ఛబడిని ఏర్పాటుచేశాం. అవసరమైన వారికి డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నాం. ఎరువు తయారీకి అవసరమయ్యే ఆవుపేడ కోసం మేం ఇక్కడ రెండు ఆవులను కూడా పెంచుతున్నాం. ఈ స్వచ్ఛబడి కార్యక్రమాలు చూసేందుకు చైనా, ఫిలిప్పైన్‌, అమెరికా వంటి దేశాల నుంచి అధికార బృందాలు, విద్యార్థులు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లోని వివిధ మున్సిపాలిటీల కౌన్సిలర్లు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట నుంచి వచ్చిన కౌన్సిలర్లు తమ ప్రాంతంలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలని అడిగారు. దాంతో గతేడాది స్థానిక మంత్రి హరీశ్‌రావు సహకారంతో చెత్త శతశాతం వినియోగించుకునేలా వార్డు కంపోస్టు కేంద్రాలు, స్వచ్ఛబడి వంటివి ఏర్పాటుచేశాం.  మరో నాలుగు మున్సిపాలిటీలూ ఈ దిశగా అవగాహన పెంచుకుంటున్నాయి. ఇప్పటికీ ప్రతి పదిరోజులకీ సిద్ధిపేటలో కార్యక్రమాలు చేస్తున్నా. ఈ సేవలకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం నుంచి కెంపెగౌడ అవార్డు, కర్ణాటక విమెన్‌ అఛీవర్స్‌ అవార్డుని అందుకున్నా.  ప్లాస్టిక్‌ నిర్మూలకు కృషి చేసినందుకు గాను అప్పటి రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ చేతుల మీదుగా అవార్డు పొందాను. ఇప్పటివరకు గుజరాత్‌, వారణాసి, గుంటూరు పట్టణాల్లోని అధికారులకు ఈ చెత్త నిర్వహణపై సెమినార్లు నిర్వహించా.

- తుపాకుల సాయిచరణ్‌, సిద్దిపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని