రెండో రోజే 89 మంది స్మగ్లర్లను పట్టుకున్నా

ఆమె లక్ష్యం పర్యావరణ పరిరక్షణ! అందుకే గ్రూప్‌-1 ఉద్యోగాన్ని పక్కన పెట్టి, ఐఎఫ్‌ఎస్‌ను ఎంచుకుంది. ఉద్యోగంలో చేరాక ఎన్నో సవాళ్లు. కరడుగట్టిన స్మగ్లర్లతో రోజూ పోరాటమే! కానీ పర్యావరణంపై ప్రేమ ముందు ఇవేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. ఆ తీరే ఆమెను తమిళనాట ఉన్నత స్థానం పొందేలా చేసింది. ఆవిడే తెలుగు ఆడపడుచు పోలూరి రాజేశ్వరి. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా..

Updated : 07 Sep 2021 07:19 IST

ఆమె లక్ష్యం పర్యావరణ పరిరక్షణ! అందుకే గ్రూప్‌-1 ఉద్యోగాన్ని పక్కన పెట్టి, ఐఎఫ్‌ఎస్‌ను ఎంచుకుంది. ఉద్యోగంలో చేరాక ఎన్నో సవాళ్లు. కరడుగట్టిన స్మగ్లర్లతో రోజూ పోరాటమే! కానీ పర్యావరణంపై ప్రేమ ముందు ఇవేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. ఆ తీరే ఆమెను తమిళనాట ఉన్నత స్థానం పొందేలా చేసింది. ఆవిడే తెలుగు ఆడపడుచు పోలూరి రాజేశ్వరి. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా..

మాది గుంటూరు జిల్లా, కొత్తరెడ్డిపాలెం. చిన్న పల్లెటూరు. నాన్న పీవీఎస్‌ ప్రసాదరావు ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. డిగ్రీ గుంటూరులో, ఎమ్మెస్సీ బోటనీ ఆంధ్రా యూనివర్సిటీలో చదివా. అప్పుడే పల్లెకీ, నగరానికీ మధ్య తేడా అర్థమై పర్యావరణం పట్ల ఆసక్తి పెరిగింది. అందుకే గ్రూప్‌-1 ఉద్యోగమొచ్చినా వదులుకున్నా. పీహెచ్‌డీ చేస్తుండగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) రాసి, ఎంపికయ్యా. దేహ్రాదూన్‌లో శిక్షణ. ఏడాదిలో రెండు, మూడు సార్లే ఊరికి రావడానికి వీలుపడేది. రైల్లో దిల్లీ.. అక్కడి నుంచి దేహ్రాదూన్‌కు బస్సులో ప్రయాణం. రాత్రి 11, 12 గంటలకు బస్సులుండేవి. ఒంటరి ప్రయాణం, పక్కన ఎవరు కూర్చుంటారో తెలియదు. కొందరు తాగొచ్చేవారు. భయపడిన సందర్భాలెన్నో. కానీ లక్ష్యం గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకునేదాన్ని. డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చొని ప్రయాణించిన రోజులూ ఉన్నాయి. శిక్షణలో నేర్చుకున్న గుర్రపుస్వారీ, ఈత, తుపాకీ పేల్చడం వంటివి ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపాయి.

గంధపు చెక్కల స్మగ్లింగ్‌ బాగా జరిగే తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం రేంజ్‌లో మొదటి పోస్టింగ్‌. విధుల్లో చేరిన రెండోరోజే పెద్ద ఆపరేషన్‌ చేపట్టా. ఒకటిన్నర టన్నుల గంధపు చెక్కలు, 89 మంది స్మగ్లర్లను పట్టుకొన్నా. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకేసారి అంతమందిని పట్టుకున్న దాఖలాల్లేవు. నేటికీ అక్కడదే అతిపెద్ద కేసు. తర్వాత కొడైకెనాల్‌ అటవీ డివిజన్‌లో వర్కింగ్‌ ప్లాన్‌ అధికారిగా మూడేళ్లు పనిచేశా. శాఖాపరమైన పనులపై ‘అటవీ నిర్వహణ ప్రణాళిక’ (1996-2006)ను రాశా. అక్కడ అటవీ సంరక్షణ కోసం అవగాహనా బోర్డులు ఏర్పాటు చేశాం. ఆపై అటవీ అధికారిగా తిరుచిరాపల్లి వెళ్లా. దీంతోపాటు వేలూరులో స్మగ్లింగ్‌ బాగా జరిగేది. ఇక్కడినుంచి గంధపు చెక్కలు కేరళకు రవాణా అయ్యేవి. అడ్డుకోవడానికి ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి రేయింబవళ్లు కాపు గాసేవాళ్లం. ఒక్కోసారి అర్ధరాత్రి సమాచారం వచ్చేది. రోడ్డుపక్క బడ్డీ కొట్ల దగ్గర టీ తాగుతూ గమనించేవాళ్లం. స్మగ్లర్లు కొన్నిసార్లు చెక్‌పోస్టులను లెక్కచేయకుండా ఢీకొడుతూ వెళ్లేవారు. ఈ క్రమంలో అధికారులతోపాటు ప్రజల ప్రాణాలూ పోయేవి. 1997లో ఓసారి సరుపయ్య అనే వాచర్‌ని స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టి చంపారని రాత్రి 2 గంటలకు సమాచారం వచ్చింది. పై అధికారి రావడానికి సందేహించినా నేనెళ్లిపోయా. పోస్టుమార్టం చేయించి బాధితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూశా. అప్పుడు నా ఆర్నెల్ల కూతుర్ని ఇంట్లో వదిలేసి మరీ వెళ్లా.

కలపను తరలించే వారినీ, ఆ వాహనాల్నీ పట్టుకోడానికే నేను పరిమితం కాలేదు. నరికే వాళ్లతో పాటు దందా నిర్వహించే వాళ్లనీ వారి ఊళ్లకు వెళ్లి మరీ పట్టుకునే వాళ్లం. వాళ్ల మీద గూండా యాక్టు కింద కేసులు పెట్టించా. ప్రతి రోజూ ఆపదే. వరల్డ్‌ బ్యాంక్‌ ప్రాజెక్టులో మూడేళ్లపాటు డెప్యుటేషన్‌లో, తమిళనాడులో పేదరిక నిర్మూలనపై అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా చేశా. 2006లో భారత్‌ నుంచి ఏకైక ప్రతినిధిగా ఆఫ్రికా దేశాలకు వెళ్లా. ‘ఘనా’లో పేదరిక నిర్మూలనకు గ్రామీణ బ్యాంకులు సహకరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి, వాటిని ఇక్కడా అమలుచేశాం. అవి సత్ఫలితాలనిచ్చాయి. మా వారు బండ్లమూడి సింగయ్య ఐఆర్‌ఏఎస్‌ అధికారి. ఇప్పుడు ఆయన ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, చెన్నైలో పని చేస్తున్నారు. గతంలో ఇద్దరిదీ వేర్వేరు ప్రాంతాల్లో పని. అప్పుడప్పుడూ మాత్రమే కలుసుకోవడం వీలయ్యేది. అటవీశాఖలో అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (వైల్డ్‌లైఫ్‌)గా చేస్తుండగా తమిళనాడు ప్రభుత్వం డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించింది. ఆపేసిన పీహెచ్‌డీని మళ్లీ కొనసాగిస్తున్నా. అభివృద్ధి ప్రాజెక్టులతోపాటు పర్యావరణ పరిరక్షణ.. సవాళ్లతో కూడిన పనే. ప్రతి రంగంలాగే ఇక్కడా లింగ భేదాలున్నాయి. ధైర్యంగా, సమర్థంగా పని చేసే వారికి   ఇవేమీ అడ్డు కాదనీ, తప్పక విజయం సాధిస్తాననీ నమ్ముతున్నా.

సుతారపు సోమశేఖర్‌, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్