205 శాఖల సిబ్బందికి ఆమె బాస్‌!

ఆమె చదువుకుంది సాధారణ బీయ్యేనే! అయితేనేం... ప్రపంచంలో అతి పెద్ద న్యాయసేవల సంస్థ డెంటన్స్‌కి చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు... ఆమే తెలుగింటి ఆడపడుచు నీలిమ పాలడుగు. ఈ స్థాయి పదవినందుకున్న తొలి భారతీయురాలిగానూ గుర్తింపు పొందారు.

Updated : 18 Oct 2021 11:53 IST

ఆమె చదువుకుంది సాధారణ బీయ్యేనే! అయితేనేం... ప్రపంచంలో అతి పెద్ద న్యాయసేవల సంస్థ డెంటన్స్‌కి చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు... ఆమే తెలుగింటి ఆడపడుచు నీలిమ పాలడుగు. ఈ స్థాయి పదవినందుకున్న తొలి భారతీయురాలిగానూ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది. వృత్తిపరమైన సవాళ్ల నుంచి అభిరుచుల వరకూ ఆమె మనోభావాలు ఇవీ...

సంకల్పం గట్టిదైతే... సాధ్యం కానిది ఏమీ లేదు. అలాగని పరిస్థితులు అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. వాటిని మనకు తగ్గట్లు మార్చుకోగలగాలి. అప్పుడే విజయం మన వెంట నడుస్తుంది. ఈ రోజు ప్రపంచ పటంలో నాకంటూ స్థానం సంపాదించుకోగలిగినా... అందుకు మూలాలు మాత్రం తెలుగు నేలపైనే ఉన్నాయి. మాది విశాఖపట్నం. నాన్న ఉప్పలపాటి రాజా, అమ్మ సాయి రాణి. తమ్ముడు రాణా స్కేటర్‌. గిన్నిస్‌ రికార్డులూ అందుకున్నాడు. కొటక్‌ స్కూల్లో పాఠశాల విద్య, సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో బీఏ చదివా. చిన్నప్పుడు సైకాలజిస్ట్‌ కావాలనుకున్నా. అందుకే బీయ్యేలో సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లిషు లిటరేచర్‌ నా ప్రధానంశాలుగా ఎంచుకున్నా. తర్వాత సైకాలజిస్ట్‌ కాలేకపోయినా మానవ వనరులవిభాగానికి సారథ్యం వహించడం ద్వారా ఎంతో మంది మనసత్త్వాలను అర్థం చేసుకోగలిగా. బీఏ చదువుతుండగానే ఎన్‌ఐఐటి లో డిప్లొమా ఇన్‌ సిస్టమ్స్‌ పూర్తి చేశా. అకడమిక్‌గా మరేమీ డిగ్రీలు లేవు. డిగ్రీ అయిపోయిన తర్వాత నాన్నగారి టైటాన్‌, టైమెక్స్‌ షోరూంల నిర్వహణలో ఒక ఉద్యోగిగా చేశా. ఈ అనుభవమే న్యూజిలాండ్‌లో మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం అందుకునేలా చేసింది.  మా వారు పాలడుగు సుధాకర్‌. ఆయనిది హనుమాన్‌ జంక్షన్‌. పెళ్లయ్యాక కొన్నాళ్లు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో ఉన్నాం. పద్దెనిమిదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాం. నాన్న చిన్నప్పటి నుంచీ కొత్త ప్రదేశాలు చూపించేవారు. దానివల్ల కొత్త విషయాలు తెలిసేవి. సమస్యలపై స్పందించే గుణమూ ఆయన్నుంచే నేర్చుకున్నా. ఆఫ్రికన్‌ చిన్నారుల చదువుల కోసం ‘క్లైంబ్‌ ఫర్‌ ఎ చైల్డ్‌’,  మనదేశంలో నాన్హి కలి, రెస్క్యూ ఎయిడ్‌ ప్రాజెక్టులకు సాయం అందిస్తున్నా. వారితో కలిసి పనిచేస్తున్నా. మాకిద్దరు పిల్లలు. అమ్మాయి రియాకు కథక్‌ అంటే ఆసక్తి. అబ్బాయి సునీల్‌ సాకర్‌ బాగా ఆడతాడు.

కెరియర్‌ ఇలా...

మెరిల్‌ లించ్‌, పీడబ్ల్యూసీ, ఇంటర్నేషనల్‌ మెషిన్స్‌ కార్పొరేషన్‌ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం డెలాయిట్‌లో మానవ వనరుల విభాగంలో గ్లోబల్‌ పీపుల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా చేస్తున్నా. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా నాకు ఇండియాకు రాలేకపోయా. అమ్మానాన్నల్ని చూడటానికి పది రోజులక్రితమే ఇక్కడికి వచ్చా. తర్వాతే డెంటన్స్‌ గ్లోబల్‌ చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాననే సమాచారం అందింది.

వారి సహకారంతో...

డెలాయిట్‌కి 85కి పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉంటే... డెంటన్స్ సంస్థకి అంతకన్నా ఎక్కువ దేశాల్లో 205 శాఖలున్నాయి. ఇప్పుడు వీరందరికీ సారథ్యం వహించనున్నా. ఆయా దేశాల చట్టాలను, సంస్కృతులను అనుసరిస్తూ, గౌరవిస్తూ...మానవ వనరుల్ని వినియోగించుకుని కంపెనీ పురోగతికి తోడ్పడాలి. చిన్నప్పటి నుంచి నాన్న ఇచ్చిన ఆత్మవిశ్వాసం, ప్రోత్సహించిన తీరే నన్నిక్కడి దాకా చేర్చాయి. ఇక నా భర్త, పిల్లల సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళలకు కెరియర్‌ పరంగా ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఒక్కోసారి పొద్దు పోయేవరకూ పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కుటుంబ సహకారం లేకపోతే కష్టం. అమ్మమ్మ బొప్పన జయప్రద ఫ్యామిలీతో ఎలా గడపాలో నాకు నేర్పించారు. కష్టపడే తత్త్వం అమ్మను చూసి అలవరుచుకున్నా.

పర్వతాలు ఎక్కేస్తా...

పర్వతారోహణ అంటే ఇష్టం. ఏటా హిమాలయాల్లోని వివిధ పర్వతాలను అధిరోహిస్తూ వచ్చా. ఇదేమీ అంత సులువు కాదు. ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించా. భయాన్ని జయించా. మధురానుభూతుల్ని పదిలపరుచుకున్నా. తొలిసారిగా ఆఫ్రికాలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించా. యూరప్‌, యూఎస్‌ల్లో మరికొన్ని పర్వతారోహణలూ చేశా. కిలిమంజారో ఎక్కేటప్పుడు ముందు ఎటువంటి సాధన లేకుండా వెళ్లా. ఒక దశలో ఆక్సిజన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడ్డా. ఆ తర్వాత నుంచి కొంత సాధన చేసి ఎక్కుతున్నా.

 

- ఎం.వి.కూర్మరాజు, ఈటీవీ, విశాఖపట్నం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్