అనాథలకు అమ్మగా నిలిచి...

నడిరోడ్డులో చెత్తతో ఆకలి తీర్చుకుంటున్న ఓ మహిళ.. అత్యాచారానికి గురై అనాథగా రోడ్డు పక్కన పడి ఉన్న ఓ యువతి ఇలాంటివాళ్లని చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది

Updated : 20 Oct 2021 05:36 IST

నడిరోడ్డులో చెత్తతో ఆకలి తీర్చుకుంటున్న ఓ మహిళ.. అత్యాచారానికి గురై అనాథగా రోడ్డు పక్కన పడి ఉన్న ఓ యువతి ఇలాంటివాళ్లని చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. తోడు, నీడ లేని మహిళలకు అండగా నిలబడటానికి భర్తతో కలసి ట్రస్టును స్థాపించారు డాక్టర్‌ సుచేతా ధామనే.
పుణెకు చెందిన సుచేతా ధామనే, రాజేంద్ర కుటుంబాలు రెండూ పేదలకు సేవనందించేవే. అలా బాల్యం నుంచి తోటివారి కష్టాన్ని గుర్తించి సాయం చేయడం చూస్తూ పెరిగిన ఇద్దరూ వైద్యవృత్తిని ఎంచుకున్నారు. ఒకే ఆలోచనాదృక్పథం వీరిని ఒకటి చేసింది. చదువయ్యాక సుచేత మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరితే, రాజేంద్ర క్లినిక్‌ ప్రారంభించారు. ఆ దంపతులు ఓరోజు బస్టాండులో ఓ మహిళ ఆకలితో పక్కనే ఉన్న చెత్తను తినడం చూసి తల్లడిల్లారు. క్లినిక్‌కు తీసుకెళ్లి బస ఏర్పాటు చేశారు. రోజూ ఎక్కడో చోట ఎవరో ఒకరు అనాథగా కనబడటం, వారికి తమవద్ద ఉన్న ఆహారాన్ని అందించడం పరిపాటిగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ అమ్మాయిని అత్యాచారం చేసి చీకట్లో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారనే వార్త తెలిసింది. రక్షణ లేకుండా అనాథలుగా మారుతున్న ఇటువంటి వారికి పునరావాసం కల్పించాలనుకున్నారు సుచేత.

అన్నీ తామై... ఇద్దరూ కలసి అహ్మదానగర్‌లో ‘మౌలీ సేవా ప్రతిష్ఠాన్‌’ ఛారిటబుల్‌ హోంను 2007లో స్థాపించారు. అనాథ మహిళలకు నీడ, వైద్య సాయంతోపాటు లైంగికహింసకు గురి కాకుండా రక్షణ కల్పించడం కోసమే ఈ హోం అంటారు డాక్టర్‌ సుచేత. ‘మౌలీ అంటే మరాఠీలో అర్థం అమ్మ. మా హోం కూడా అనాథలకు అమ్మలా ఉండాలనుకున్నాం. ఇద్దరు మహిళలతో మా సేవ ప్రారంభమైంది. ఈ హోం గురించి తెలుసుకున్న కొందరు తమకెదురైన అనాథ పిల్లలను, మానసిక స్థితి సరిగాలేని మహిళలను, సొంత వారే వదిలేసి వెళ్లిన వృద్ధమహిళలను మా వద్దకు చేర్చడం మొదలు పెట్టారు. క్రమేపీ ఆ సంఖ్య పెరిగింది. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు వీరందరి అవసరాలను తీర్చడమే నా బాధ్యత. వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటా. రోజూ ఉదయం యోగా, తేలికైన వ్యాయామాలు చేయిస్తుంటా. చిన్నారులకు చదువు చెప్పిస్తా. కొందరికి వంట, తోటపనులు నేర్పుతున్నాం. ఎయిడ్స్‌తో వచ్చినవారికి చికిత్సతోపాటు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తుంటాం. తమలాంటి వారికి చేయూతనందించేలా వారిని తయారుచేస్తాం. ఎయిడ్స్‌ బాధిత చిన్నారులనూ అక్కున చేర్చుకుంటున్నాం. సేవా భావం ఉన్నవారు మా హోంలో రోగులకు సపర్యలు అందించడానికి వస్తుంటారు. అందరికీ ఆహారం తయారు చేయడం, నర్సుగా, ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, అవసరమైతే గదుల శుభ్రత... ఇలా మావారు, నేను పనులన్నీ పంచుకుంటాం. మా హోంలో 300 మంది మహిళలు, 29మంది పిల్లలున్నారు. చాలామంది వదాన్యులు ఆర్థికంగా సాయపడుతున్నారు’ అని చెబుతున్నారు సుచేత. వీరి సేవలను గుర్తించిన హాంకాంగ్‌ రోటరీ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రతిష్ఠాత్మక హ్యూమానిటేరియన్‌ అవార్డుతోపాటు రూ.75 లక్షల నగదు బహుమతిని అందించింది. ఆ మొత్తాన్నీ సేవకే వెచ్చించారీ దంపతులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్