అంతర్జాతీయ వేదికలపై... ఆదిమ గిరిజన యువతి

అర్చనది ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లా బిహాబంద్‌ గ్రామం. ఖడియా తెగలో జన్మించిన ఈమె తాత ఒకప్పుడు అడవుల సంరక్షణ బృందాలకు మార్గదర్శకుడు. నాన్న గిరిజనులకు వైద్యం చేసేవాడు. ఈమె కూడా చిన్నప్పటినుంచీ వాళ్ల బాటలో నడవడం మొదలుపెట్టింది. పట్నా మహిళా కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ, ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నుంచి మాస్టర్స్‌ చేసింది

Published : 22 Oct 2021 01:55 IST

తాత, తండ్రిల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. ఆమె తన గ్రామం, దేశానికి పరిమితం కాలేదు. ఎల్లలు దాటింది. అంతర్జాతీయ వేదికలపై సలహాలిచ్చే స్థాయికి ఎదిగింది. గిరిజన తెగకు చెందిన అర్చనా సోరెంగ్‌కి ఇదెలా సాధ్యమైంది?

ర్చనది ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లా బిహాబంద్‌ గ్రామం. ఖడియా తెగలో జన్మించిన ఈమె తాత ఒకప్పుడు అడవుల సంరక్షణ బృందాలకు మార్గదర్శకుడు. నాన్న గిరిజనులకు వైద్యం చేసేవాడు. ఈమె కూడా చిన్నప్పటినుంచీ వాళ్ల బాటలో నడవడం మొదలుపెట్టింది. పట్నా మహిళా కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ, ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నుంచి మాస్టర్స్‌ చేసింది. తర్వాత ఒడిశాలోని ‘వసుంధర’ అనే ఎన్‌జీఓలో చేరి.. రాష్ట్రంలోని అన్ని తెగల గిరిజనులను కలిసి అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ తెగల సంస్కృతులు, సంప్రదాయాలు, వారు పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, అందులో ఇబ్బందుల గురించి తెలుసుకునేది. వీటిపై ఆమె రాసిన కథనాలు జాతీయ, అంతర్జాతీయ వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి.

పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న వారిని యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సంప్రదించింది. 140 దేశాల నుంచి 1000 మందిని ఎంపిక చేసి, ఓ యువ విభాగాన్ని ‘యంగో’ పేరిట ఏర్పాటు చేసింది. దానిలో అర్చన కూడా సభ్యురాలు. వీరితో కలిసి సమితిలో ఈమె కూడా పాల్గొంది. ఇక్కడే ఐరాస ప్రధాన కార్యదర్శి యువ సలహా సంఘం ఏర్పాటుకూ బీజం పడింది. సభ్యుల ఎంపికకు వివిధ దేశాల నుంచి ఐరాస దరఖాస్తులు స్వీకరించింది. అర్చనను యంగో నామినేట్‌ చేసింది. వడపోతల తర్వాత ఐరాస ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసిన ఏడుగురిలో ఈమె కూడా ఉంది.

తాజాగా ఇటలీలోని మిలాన్‌, దుబాయ్‌ల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించింది. ‘అర్చన సలహాలు ఇవ్వడంలో, పరిశోధనలో అనుభవజ్ఞురాలు. ఆదిమ గిరిజన సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని అక్షరీకరించి, పరిరక్షించేందుకు కృషి చేస్తోంది’ అని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో కొనియాడింది. ఈ ఏప్రిల్‌లో వాతావరణంపై జరిగిన రెండ్రోజుల వర్చువల్‌ శిబిరంలో మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నుంచి ఆహ్వానం అందుకుంది. దానిలో వాతావరణ మార్పులకు ప్రకృతిపై ఆధారపడిన పరిష్కారాలను సూచించింది. ఈ నెల యూఎన్‌ ఇండియా పర్యావరణ పరిరక్షణ ‘వి ద ఛేంజ్‌ నౌ’ ప్రచారంలో భాగంగా ఎంపిక చేసిన 17 మందిలోనూ అర్చన ఒకరు. ‘అడవుల సంరక్షణ, ప్రకృతితో సంబంధాన్ని పునరుద్ధరించే జ్ఞానం ఆదిమ గిరిజనులకు ఉంది. వారికి భూమి, అటవీ హక్కులను కల్పించి, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని అభివృద్ధి పనులను తిరస్కరించే హక్కులను వీళ్లకు కల్పించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమే’ అంటుందీ 25 ఏళ్లమ్మాయి.

- కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, ఒడిశా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్