Updated : 25/10/2021 09:13 IST

వనితా.. సాహసాల ఘనత!

మగరాయుడిలా... బండి నడుపుతావా అని ఒకరు, కొండలెక్కితే... ఏ కాలో చెయ్యో విరిగితే నిన్నెవరు చేసుకుంటారని ఇంకొకరు... ఇలా అడుగడుగునా ఆమెను ‘అబల’గా అంచనా వేసి సూచనలు చేస్తుంటారు. కాలం మారినా.. కంప్యూటర్‌తో పోటీపడుతూ దూసుకెళ్తున్నా.. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో అడ్డంకుల ముళ్లతో సరిహద్దులు గీస్తూనే ఉన్నారు.  ఇలా.. ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు.. ఆ ప్రశ్నకు సమాధానంగా వీరంతా ‘ధైర్యేసాహసే లక్ష్మీ’  అంటూ చేతలతో తమ శక్తిని చాటారు.  ఆ సాహస ప్రయాణాల్ని వసుంధరతో చెప్పుకొచ్చారిలా.


శిరస్సు వంచిన శిఖరం

నీలిమ పూదోట, పర్వతారోహకురాలు

గరంలో పుట్టిపెరిగిన అమ్మాయిని. బండరాళ్లు ఎక్కితే జారిపడతామనే భయమేసేది. మనసులో బలంగా అనుకుంటే ఆపేవారు ఎవరూలేరనేది అర్థమైంది. కొన్ని వేల మీటర్ల ఎత్తులో కేవలం రెండు మూడు అడుగుల వెడల్పున్న దారిలో గమ్యం చేరేందుకు వేేసిన అడుగులతో అప్పటి వరకూ మనసులో ఏదోమూలన ఉన్న భయాలన్నీ పటాపంచలయ్యాయి. మొదటిసారి 6150 మీటర్ల ఎత్తున్న పర్వతం ఎక్కాను. రెండోసారి ఎక్కిన ఎవరెస్ట్‌ 8848 మీటర్ల ఎత్తులో ఉంది. పర్వతారోహణం ముందు వరకూ.. సౌకర్యవంతమైన జీవితం. ఒక్కసారి సాహసయాత్రకు సిద్ధమయ్యాక నా ఆలోచనా సరళి మారిపోయింది. వేలమీటర్ల ఎత్తులో చాలీచాలని ప్రాణవాయువు, తాగేందుకు నీరు దొరకదు. జనం కనిపించరు. ప్రపంచంతో సంబంధాలు తెగినట్టు అనిపిస్తుంది. అప్పుడు కూడా చాలా హాయిగా అనిపించింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు.. అవరోధాలు కూడా ప్రయాణంలో అనుభవాల వంటివే. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా మనోనిబ్బరంతో బతకొచ్చని అర్థం చేసుకున్నా. బయటి ప్రపంచాన్ని తెలుసుకునేందుకు... భవిష్యత్‌ను మలచుకునేందుకు ఇలాంటి సాహసాలు మహిళకు కొండంత బలాన్నిస్తాయి.


దారులన్నీ మోకరిల్లాయి

కిరణ్‌మోర్తా, బైకర్‌

జీవితం చాలా పెద్దది... ప్రపంచం మరింత పెద్దది. రెండింటినీ తెలుసుకునేందుకు ప్రయాణాన్ని మించిన మార్గం ఇంకెక్కడ ఉంటుంది. చదువు పూర్తయి కార్పొరేట్‌ ఉద్యోగం చేసేటప్పుడు.. ఇంతేనా.. ఇంకేం చేయలేనా! అనే ప్రశ్నకు నేనిచ్చిన జవాబు బైక్‌రైడింగ్‌. హైదరాబాద్‌ టు ఖర్‌ఢోంగ్లా,  ఖర్‌డోంగ్లా నుంచి హైదరాబాద్‌. బైక్‌పై ప్రయాణించిన రెండో భారతీయ మహిళను. ఏపీ, తెలంగాణల్లో తొలి తెలుగు వనితగానూ రికార్డు సాధించా. 14,000 కిలోమీటర్లు 2 నెలలపాటు సుదీర్ఘ ప్రయాణం చేశా. రాజస్థాన్‌ ఎండలు.. కేరళ వరదలు.. కశ్మీర్‌ చలిగాలులు ఎన్నో చూశా. అవేవీ నా లక్ష్యానికి అడ్డంకి కాలేదు. సమస్య ఎదురైనప్పుడు బెంబేలెత్తకుండా పరిష్కారం కోసం వెతకటం నేర్చుకున్నా. ఒంటరితనం ఇబ్బందికాదు.. గొప్ప పాఠమని తెలుసుకున్నా. నా విజయం ప్రతి ఆడపిల్లకీ అంకితం.


సవాళ్లకు సమాధానం

 జై భారతి, బైకర్‌

జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. ఊహించని ట్విస్టులతో ఝలక్‌ ఇస్తూనే ఉంటుంది. దానికి తగినట్టుగా మనమే మారాలి. ప్రతి ఆడపిల్ల బుల్లెట్‌ నడపగలదని చెప్పటమే కాదు.. ఆచరణలో నిరూపించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళలు, యువతులకు ఉచితంగా డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చా. 2018లో 6 దేశాలు.. లక్ష కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి రికార్డు కొట్టా. ప్రస్తుతం ‘మూవింగ్‌ బౌండరీస్‌’ పేరుతో దేశంలోని 20 నగరాల మీదుగా 11,111 కిలోమీటర్ల ప్రయాణం చేయబోతున్నా. 40 రోజుల పాటు సాగే ఈ ట్రావెల్‌లో స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులతో శిక్షణ పొందుతున్న/జీవనంగా మలచుకున్న మహిళలకు డ్రైవింగ్‌ ప్రాముఖ్యత తెలియజేయటమే ముఖ్య ఉద్దేశం. అడ్వెంచర్‌ రైడ్స్‌ వల్ల ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతకగలమనే ధైర్యం అలవడుతుంది. భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, వ్యక్తులను గమనిస్తూ సాగే ఈ జర్నీ  జీవితపాఠాలెన్నో నేర్పించింది.


సాగర స్వాగతం 

గోలి శ్యామల, స్విమ్మర్‌

దైనా సాధించడానికి వయసుతో పనిలేదు. అందుకు నేనే ఓ ఉదాహరణ  కనీసం ఎప్పుడూ చెరువులు.. నదుల్లో దిగటం తెలియని నేను నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక జలసంధిని అవలీలగా ఈదేశా. ఈ ఏడాది మార్చిలో పాక్‌జలసంధి 30 కి.మీ దూరాన్ని 13 గంటల 43 నిమిషాలు ఈది తెలంగాణ తొలి మహిళగా గుర్తింపు పొందా. తాజాగా ఎంతో క్లిష్టమైన కాటలినా ఛానల్‌ను 10 గంటల 4 నమిషాల 45 సెకన్ల పాటు ఏకబిగిన ఈతకొట్టి మరో రికార్డు సాధించా. మహిళకు 40 ఏళ్లు దాటాక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటివి నాకూ ఎదురయ్యాయి. వాటిని అధిగమించేద]ుకు నేను ఎంచుకున్న మార్గం ఈత. సాహసక్రీడలు పేరుకోసమే కాదు.. శారీరక వ్యాయామం.. మానసిక దృఢత్వం కోసమూ అనే విషయాన్ని ప్రతి మహిళా గుర్తించాలి.


మంచుకొండలు ముచ్చటపడ్డాయి 

ప్రత్యూష పరకాల మౌంటనీర్‌

ప్రపంచ చివరన ఉంది అంటార్కిటికా ఖండం.. 2018లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత్‌ నుంచి దాన్ని చేరుకుని మంచు పర్వతాలు కరగడానికి కారణాలను అన్వేషించే అరుదైన అవకాశం నాకు దక్కింది. రెండు వారాల పాటు ఆ ప్రకృతి పాఠాల్ని నేర్చుకున్నా. ఈ ఒక్క ప్రయాణం నా జీవితదృక్పథాన్నే మార్చేసింది. ఈ దారిలో ప్రమాదకరమైన అలలు ఎగసిపడేవి. శరీరం గడ్డకట్టేంతటి చలి వణికించేది. మరోపక్క ఆహార మార్పులు.. ఇవన్నింటినీ తట్టుకుంటూ కొత్త ప్రపంచం చూసొచ్చా. అటువంటి వాతావరణంలో ఉండటం ద్వారా.. దేన్నైనా తట్టుకోగలనని ధైర్యం వచ్చింది. ఆడపిల్లలు చాలా సున్నితమనేది అపోహమాత్రమే.. ఎంతటి క్లిష్టమైన, ఇంకెంతటి కఠినమైన పరిస్థితులనైనా తేలికగా తట్టుకోగలరని గుర్తించా.  రేడియోజాకీగా కెరియర్‌ మొదలుపెట్టిన నేను ఈ సాహసంతో యూకేలో మాస్టర్స్‌ చేసే అవకాశం లభించింది. త్వరలో ఇక్కడ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పర్యావరణ సదస్సు కాప్‌26లో కూడా పాల్గొనబోతున్నా.

- జి.సాంబశివరావు, హైదరాబాదు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని