దాతృత్వ లక్ష్ములు

దేశంలోని సంపన్నుల జాబితా చూస్తే దానిలో మహిళలూ ఎక్కువే. అయితే ఆర్జనలోనే కాదు.. దాతృత్వంలోనూ వాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారీ నారీమణులు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రపీ 2021 జాబితాలో 9 మంది మహిళలు స్థానం దక్కించుకోగా.. ముంబయికి చెందిన ఈ ముగ్గురూ మొదటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ల గురించి..

Published : 01 Nov 2021 21:30 IST

దేశంలోని సంపన్నుల జాబితా చూస్తే దానిలో మహిళలూ ఎక్కువే. అయితే ఆర్జనలోనే కాదు.. దాతృత్వంలోనూ వాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారీ నారీమణులు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రపీ 2021 జాబితాలో 9 మంది మహిళలు స్థానం దక్కించుకోగా.. ముంబయికి చెందిన ఈ ముగ్గురూ మొదటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ల గురించి..

రోహిణి నీలేకని: రూ.69 కోట్లు

ఈమెది ఓ మధ్యతరగతి కుటుంబం. ఫ్రెంచ్‌ లిటరేచర్‌లో డిగ్రీ చేశారు. ప్రముఖ పత్రికల్లో పనిచేశారు. నందన్‌ నీలేకనితో పరిచయం పెళ్లికి దారి తీసింది. తర్వాత ఆయన సహ వ్యస్థాపకుడిగా ఉన్న ఇన్ఫోసిస్‌ భారీ విజయంతో ఆర్థికంగా ఉన్నతస్థానాన్ని అందుకున్నారు. ‘ఇలా ఒక్కసారిగా ఎదిగిపోవడం ఇబ్బందిగా అనిపించేది. దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే మనశ్శాంతిగా ఉండేది’ అంటారీమె. అందుకే సంపాదనలో సగాన్ని సేవకే కేటాయిస్తారు. ఏక్‌స్టెప్‌, అర్ఘ్యం, పార్థమ్‌ బుక్స్‌ వంటి స్వచ్ఛంద సంస్థలను స్థాపించారు. పిల్లలకు ఉచితవిద్య, నీరు, పారిశుద్ధ్యంపై పనిచేస్తాయివి. పర్యావరణంపై పనిచేసే అట్రీ, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అక్షర ఫౌండేషన్లకు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ కూడా. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రపీ 2021 జాబితాలో మహిళల్లో 61 ఏళ్ల రోహిణి మొదటి స్థానంలో ఉన్నారు. నందన్‌ నీలేకని రూ.183 కోట్లు దానం చేసి అయిదో స్థానంలో ఉన్నా.. ఈమె తనవంతుగా చేస్తుండటం విశేషం.


 లీనా గాంధీ తివారి: రూ.24 కోట్లు

ఈ ఏడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన దేశంలో అత్యంత ధనిక మహిళల్లో ఈమె ఒకరు. ముంబయి యూనివర్సిటీ నుంచి బీకాం, బోస్టన్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యూఎస్‌వీ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చైర్‌పర్సన్‌. ఇది మధు మేహం, గుండె వ్యాధుల మందుల తయారీ సంస్థ. తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఈ సంస్థ బాధ్యతలన్నీ ఈమె భర్త ప్రశాంత్‌ చూసుకుంటారు. 64 ఏళ్ల లీనా రచయిత కూడా. తన తాత విఠల్‌ గాంధీ జీవితచరిత్రను ఆరేళ్లు రిసెర్చ్‌ చేసి మరీ పుస్తకంగా తీసుకొచ్చారు. నాన్నమ్మ సుశీల గాంధీ పేరిట స్వచ్ఛందసంస్థను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య, ఉపాధి పరంగా చేయూతనిస్తున్నారు.


అను ఆగా: రూ.20 కోట్లు

మొదట్నుంచీ సంపన్న కుటుంబమే. దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఈవిడా ఒకరు. సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి బీఏ (ఎకనామిక్స్‌), టిస్‌ నుంచి మెడికల్‌ అండ్‌ సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌లో పీజీ చేశారు. తండ్రి స్థాపించిన థర్మాక్స్‌ అనే ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ సంస్థలో ఉద్యోగిగా చేరారు. తర్వాత మానవ వనరుల విభాగానికి నాయకత్వం వహించారు. 1996లో భర్త రోహిన్‌టన్‌ మరణించాక సంస్థ చైర్‌పర్సన్‌ బాధ్యతలను చేపట్టారు. 2004లో వాటి నుంచి తప్పుకుని సేవపై దృష్టిపెట్టారు. భర్త, కొడుకు ఒకరి తర్వాత ఒకరు మరణించడం, సంస్థ ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకోవడం ఈమెను బలమైన వ్యక్తిగా మార్చాయి. అందరికీ సమాన అవకాశాలు ఉండాలంటారామె. అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతారు. అందులో భాగంగానే థర్మాక్స్‌ సోషల్‌ ఇన్నొవేటివ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించి ప్రభుత్వంతో కలిసి పేద పిల్లలకు విద్యనందిస్తున్నారు. సంస్థ లాభాల్లో ఒక శాతాన్ని ఇందుకు కేటాయించడంతోపాటు టీచ్‌ ఫర్‌ ఇండియా, గివ్‌ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆర్థికసాయం అందిస్తున్నారు. తన సేవలకుగానూ పద్మశ్రీ అవార్డునూ అందుకున్న 79 ఏళ్ల అను రాజ్యసభ సభ్యురాలిగానూ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్