ఈమె.. ఆల్పైన్‌ గర్ల్‌!

కొద్ది ఎత్తున్న ప్రాంతాలకు నడవాలన్నా ఆమెకు కాళ్లు సహకరించవు. అటువంటి అనారోగ్యాన్ని కూడా జయించి, కశ్మీరులోని పదివేల అడుగులెత్తులో ఉన్న 50 సరస్సులను సందర్శించిందామె. దేశంలో

Published : 22 Nov 2021 00:28 IST

కొద్ది ఎత్తున్న ప్రాంతాలకు నడవాలన్నా ఆమెకు కాళ్లు సహకరించవు. అటువంటి అనారోగ్యాన్ని కూడా జయించి, కశ్మీరులోని పదివేల అడుగులెత్తులో ఉన్న 50 సరస్సులను సందర్శించిందామె. దేశంలో ఈ తరహా సాహసం చేసిన తొలిమహిళగా నిలిచింది. సవాళ్లెెన్నింటినో ఎదుర్కొని అనుకున్నది సాధించి..ఆల్పైన్‌ గర్ల్‌గా నిలిచిన బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల నమ్రతా నందీష్‌ గురించి తెలుసుకుందామా!

బెల్లందుర్‌ ప్రాంతంలో నివసించే నమ్రత స్థానికంగా ఓ ఐటీ సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌. సెలవులకు భర్త అభిషేక్‌తో కలిసి అందమైన ప్రాంతాలను ఎంపికచేసుకుని విహారయాత్రలకు వెళ్లేది. ఓసారి కశ్మీరు వెళ్లినప్పుడు అక్కడి ఎత్తైన ప్రాంతాలు ఆమెను ఆకర్షించాయి. చలికాలంలో అక్కడ గడ్డకట్టే దాల్‌లేక్‌ను సందర్శించాలనే కల ఉండేదీమెకు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్న నమ్రత ఈ ఏడాది ట్రెక్కింగ్‌ సీజన్‌లో ఎలాగైనా తన కల నెరవేర్చుకోవాలనుకుని కశ్మీరు చేరుకుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఎత్తైన ప్రాంతాల్లో ఉండే సరస్సులన్నింటినీ చూడాలనుకుంది. ఓవైపు ఆఫీస్‌ విధులు నిర్వహిస్తూనే, మరోవైపు వారాంతాల్లో ట్రెక్కింగ్‌ బృందంతో కలిసి కొండలెక్కడంలో శిక్షణ తీసుకుంది.

నాలుగు నెలల్లో..

ట్రెక్కింగ్‌ సీజన్‌లో ఈ ఏడాది ఒకేసారి నా లక్ష్యాన్ని సాధించాలనుకున్నా అంటుంది నమ్రత. ‘ఇక్కడి ట్రెక్కింగ్‌ బృందానికి నేతృత్వం వహించే తాహిర్‌ నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించారు. సరస్సులన్నింటి వద్దకు వెళ్లాలని చెప్పిన వెంటనే ఆయన ఒక మాట చెప్పారు. ఇక్కడి మంచు ప్రాంతాల్లో నడవాలనుకునేవారికి అనారోగ్యాలేమైనా ఉంటే సమస్య అవుతుందన్నారు. నాకు మోకాళ్లు నొప్పి అని చెప్పిన వెంటనే ఆశ్చర్యపోయారాయన. అలాంటప్పుడు అంతెత్తుకు నడవడం కష్టమన్నారు. ఇది నా లక్ష్యమని, ఈ సమస్యను జయించగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పాను. అలా నా ప్రయాణం మొదలై, మొదట తులియన్‌ సరస్సును సందర్శించా. ముందుగా నా లక్ష్యం 33 సరస్సులే. ఆ తర్వాత ఆ సంఖ్య దాటింది. నాలుగునెలల్లో మొత్తం 50 సరస్సులను సందర్శించగలిగా. ఇలా ఈ లోయలో సముద్రమట్టానికి 13వేల అడుగుల ఎత్తులో ఉండే ఇన్ని సరస్సులను సందర్శించిన తొలి మహిళగా నిలిచా. చివరి ప్రయాణంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలెదురయ్యాయి. ముఖ్యంగా మంచుప్రాంతాల్లో ఎత్తైనచోట్లకు వెళ్లేటప్పుడు కలిగే అక్యూట్‌ మౌంటెయిన్‌ సిక్‌నెస్‌ (ఏఎమ్మెస్‌)కు గురయ్యా. అయినా నా ప్రయాణాన్ని ఆపలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగేశా. 13వేల అడుగులెత్తులోని మురుగన్‌ టాప్‌కు చేరుకున్నా. మొత్తం 460 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని పూర్తిచేశా’ అని చెబుతున్న నమ్రతా నందీష్‌ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్