నాటి పనితనాన్ని.. నేటి తరానికి అందిస్తున్నారు
close
Updated : 02/12/2021 06:02 IST

నాటి పనితనాన్ని.. నేటి తరానికి అందిస్తున్నారు!

బెనారస్‌ నేతకి వందలేళ్ల చరిత్ర. దాన్ని నేటి తరానికి తెలిసేలా చేయాలనుకున్నారు వందనాసింగ్‌. అందుకు పనితనమున్న నేతకారులను ఒకచోటకు చేర్చాలనుకున్నారు. కోడలితో కలిసి సంస్థను ప్రారంభించి.. ఉపాధి కోల్పోయిన నేతకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

వందనా సింగ్‌ది బిహార్‌. జమీందారు కుటుంబం. తాత స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన్నుంచి దేశంపై భక్తి, గౌరవాన్ని పెంచుకున్నారు. ఇంట్లో అమ్మ చీరలు ఆమెను ఆకర్షించేవి. వాటి డిజైన్ల ద్వారా చిత్ర, హస్త, చేనేత కళలపై ఆసక్తి పెంచుకున్నారు. వివాహమయ్యాక బెనారస్‌ చేరుకున్నారు. అక్కడి రామాపురా, మల్టీబాగ్‌ ప్రాంతాల పట్టుచీరలు నచ్చేవామెకు. కొనుగోలు చేసే క్రమంలో చీర నేతలో కష్టం, అందుకు తగ్గ ఫలితం లేకపోవడం గమనించింది. కొందరు నేతను వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఇవి ఆమెను బాధించాయి. ఓ అరుదైన కళ దూరమవుతుండటం చూడలేకపోయారు.

నేటి తరానికి తగ్గట్టుగా మారిస్తే ఫలితముంటుందనుకున్నారు. చేనేత సంఘాలతో కలిసి చీరలకు కొత్త హంగులు అద్దేలా సలహాలు, సూచనలిచ్చేవారు. ‘నేను చెప్పేది అనుసరించకపోయినా.. నా ప్రతి ఆలోచన వినేవారు. క్రమేపీ వారిలో మార్పు కనిపించింది. సలహాలను పాటించడం ప్రారంభించారు. మార్కెట్‌లో మంచి స్పందనా వచ్చేది. క్రమేపీ నేటి తరానికి కావాల్సిన డిజైన్లు, రంగుల కలబోత గురించి అవగాహన తెచ్చుకున్నారు. వృత్తిని వదిలి వెళ్లినవారితోనూ మాట్లాడి ఒప్పించి తిరిగి వారిని తీసుకొచ్చా. మా కోడలు ఆనందనా సింగ్‌ కూడా నాలాగే ఆలోచించేది. ఇద్దరం కలిసి ఏదైనా చేయాలనుకునేవాళ్లం. 2019లో ‘స్తుతి వీవ్స్‌’ ప్రారంభించాం. నూతన ఆలోచనలను జోడించి బెనారస్‌ పట్టుచీరలను నేయిస్తున్నాం. అలనాటి డిజైన్‌లను తిరిగి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక లూమ్‌తో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు 80కిపైగా ఉన్నాయి. 100మందికిపైగా నేరుగా, 300 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆన్‌లైన్‌, ప్రదర్శనల ద్వారా విక్రయాలు జరుపుతున్నాం. నేతన్నల కళానైపుణ్యంతోపాటు మనదేశ సంప్రదాయ చేనేతకళ తిరిగి వెలుగులోకి తెస్తున్నాం. ఇందుకు ఎంతో సంతోషంగా, తృప్తిగా ఉంది. ఇక్కడికొచ్చే పర్యాటకులకూ ఈ కళపై అవగాహన కల్పిస్తున్నాం’ అని అంటారు వందనాసింగ్‌.

ఏడువేల మోటిఫ్‌లతో... 200 ఏళ్ల క్రితంనాటి బెనారస్‌ దుపట్టాను స్ఫూర్తిగా తీసుకుని ‘స్తుతివీవ్స్‌’ ఓ సిల్వర్‌ జరీ చీరను రూపొందించింది. ఇందులో ఏడువేల ప్యూర్‌ జరీ ఫిష్‌ మోటిఫ్‌లను కొత్త టెక్నిక్‌తో పొందుపరిచారు. ఇది ఎంతోమందిని ఆకర్షిస్తోంది. ఆ దుపట్టా వందనాసింగ్‌ పూర్వీకులదేనట.


Advertisement

మరిన్ని