ముత్యాల పంట పండిస్తోంది...

ఒకటీ రెండూ కాదు.. 20 ఏళ్లుగా ముత్యాలను పండిస్తోందీమె. తను లాభాలు ఆర్జించడమే కాకుండా మరెన్నో వేల మందికీ శిక్షణ ఇస్తోంది. తద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ సేద్యానికి అవసరమయ్యే పరికరాలు, కొత్త నైపుణ్యాలను కనిపెడుతూ పలు పురస్కారాలనూ దక్కించుకున్న కుల్జానా దుబే స్ఫూర్తి కథనమిది.   

Updated : 04 Dec 2021 06:16 IST

ఒకటీ రెండూ కాదు.. 20 ఏళ్లుగా ముత్యాలను పండిస్తోందీమె. తను లాభాలు ఆర్జించడమే కాకుండా మరెన్నో వేల మందికీ శిక్షణ ఇస్తోంది. తద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ సేద్యానికి అవసరమయ్యే పరికరాలు, కొత్త నైపుణ్యాలను కనిపెడుతూ పలు పురస్కారాలనూ దక్కించుకున్న కుల్జానా దుబే స్ఫూర్తి కథనమిది.    

ముత్యాల సేద్యం గురించిన ఓ కార్యక్రమంలో అశోక్‌ను కలుసుకుంది కుల్జానా. ఇద్దరూ వ్యవసాయ కుటుంబాల వారే. ఆసక్తులు కలిసి పెళ్లితో ఒకటయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఉంటూ ముత్యాల సాగు మీద ప్రయోగాలు చేపట్టారు. వైఫల్యాలు ఎదురైనా పట్టువదల్లేదు. అలా సొంత సాధనతో నైపుణ్యాలను అందిపుచ్చుకున్నారు. 2001లో ‘ఇండియన్‌ పర్ల్‌ కల్టివేషన్‌’ సంస్థను ప్రారంభించారు. ‘కష్టం ఫలిస్తూ చేతికొచ్చిన ముత్యాన్ని చూసినప్పుడు కలిగే తృప్తి మాటల్లో చెప్పలేను. ఆసక్తి ఉన్న వారికి దీని సాగు విధానాలపై శిక్షణనిస్తున్నాం. ఒక ఆల్చిప్పలో ఒకటి లేదా రెండు ముత్యాలుండటం సహజం. వీటి సంఖ్యను ఆరుకు పెంచడానికి మేం చేసిన ప్రయోగాలు ఫలించాయి. ఈ టెక్నిక్‌లను రైతులకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కృషి చేస్తున్నాం’ అంటోందీమె.

12 రాష్ట్రాల్లో.. ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఉపయోగించి నీటిలోని పోషక విలువలను పెంచడంపై శిక్షణ నందిస్తున్నారు. మహారాష్ట్ర కర్ణాటక, కేరళ, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ్‌ బంగ, మణిపుర్‌, మేఘాలయ, అసోం తదితర 12 రాష్ట్రాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘నాణ్యమైన ముత్యానికి మార్కెట్‌ విలువ దాదాపు రూ.500కు పైనే. వీటిని పెంచడానికి ఇంటివెనుక ఖాళీ స్థలం సరిపోతుంది. దాన్ని చెరువుగా మార్చి, పంట సాగు చేయాలంటే రూ.25 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహంగా రూ.12.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది’ అని వివరించింది కుల్జానా. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 400 శిక్షణా తరగతులు, వర్కషాపులు నిర్వహించింది. రైతుల ఉపాధి కోసం ఈ దంపతుల కృషికి జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డులు సహా 70కి పైగా పురస్కారాలు దక్కాయి. అంతేకాదు... వినూత్న పద్ధతిలో ప్రయోగాలు చేసి విజయాలను సాధించేవారికి సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ అక్వాకల్చర్‌ (సీఐఎఫ్‌ఏ) అందించే ‘ఫస్ట్‌ ప్రోగ్రెస్‌ ఫార్మర్‌’ అవార్డునూ దక్కించుకున్నారు. ముత్యాల సాగును విస్తృతం చేసి, మన దేశాన్ని దీనికి చిరునామా చేయాలనేది ఆమె ఆశ. ఇందుకోసం 20 ఏళ్లుగా కృషి చేస్తున్న కుల్జానా ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్