Updated : 06/12/2021 05:25 IST

ఆవిష్కరణలతో అదరగొడుతున్నారు!

అమ్మాయిలంటే ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించడానికే పరిమితమవడం లేదు. సృజనాత్మకతకీ పని చెబుతున్నారు. తద్వారా సమాజానికీ సేవలందిస్తున్నారు. ఈ ఇద్దరినీ చూస్తే మీరూ అవునంటారు. తను పడిన ఇబ్బంది మరెవరికీ రావద్దని రితూపర్ణ నీటి ఏటీఎమ్‌లను ప్రారంభిస్తే.. నాన్న కష్టం చూసి నుస్రత్‌ అలాంటి వాళ్లకు సాయపడేలా పరికరాలను రూపొందిస్తోంది. సమాజహితమైన వీళ్ల ఆవిష్కరణల గురించి తెలుసుకుందామా!


నీటికీ ఏటీఎంలు: రితూపర్ణ

మెది పశ్చిమ్‌ బంగాలోని దుర్గాపూర్‌. ఉన్నత చదువుల కోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. తరచూ జబ్బు పడేది. వైద్యులు అపరిశుభ్రమైన తాగునీరే కారణమన్నారు. మినరల్‌ వాటర్‌ తాగమని సూచించారు. విద్యార్థిగా అంత డబ్బు ఎలా అనుకుంది. ఇంట్లో వాళ్లు గత్యంతరం లేక వేరే ఏర్పాటు చేశారు. తర్వాత ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడింది. ఓసారి స్నేహితులతో చర్చల్లో చాలామంది విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆమెకు తెలిసి బాధపడింది. ఇలాగైతే వాళ్ల ఆరోగ్యం ఏమవుతుందోననుకుంది. టెక్నాలజీతో దీనికి పరిష్కారం చూపాలనుకుంది. ఆలోచనను స్నేహితులతో పంచుకుంటే ఇద్దరు చేతులు కలిపారు. అలా 2014లో హైడ్రోటెక్‌ సొల్యూషన్స్‌ సంస్థను ఏర్పాటు చేసింది. ఏడాదిపాటు శ్రమించి ఐఓటీ టెక్నాలజీతో వాటర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌ను రూపొందించారు. దాన్ని కొన్ని స్కూళ్లు, కళాశాలల్లో ఏర్పాటు చేశారు. కానీ ఎంతోమంది ప్రజలు ఇదే సమస్యను ఎదుర్కోవడం గమనించి 2016లో ఉద్యోగానికి స్వస్తి పలికింది. ప్రయాణాల్లోనూ ఇదే ఇబ్బంది ఎదురవడాన్ని గమనించింది. దీన్ని అధిగమించడానికి బృందంతో కలిసి వాటర్‌ ఏటీఎంలను రూపొందించింది. వీటికి ‘ఎరోసియా వాటర్‌ ఏటీఎం’ అని పేరు పెట్టారు. లీటర్‌ నీటిని రూ.1కి అందించడం మొదలుపెట్టారు. విద్యుత్‌ సదుపాయం లేనివాటికి సోలార్‌ను అనుసంధానించారు. ప్రభుత్వ సాయంతో ఉత్తరాఖండ్‌, కోల్‌కతా, అగర్తలల్లో 250కిపైగా ఆసుపత్రులు, పబ్లిక్‌ ప్రదేశాల్లో వీటిని ఉంచారు. కోల్‌ ఇండియా, ఆర్మీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలూ ఈ స్టార్టప్‌ సేవలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వమూ ఇతర రాష్ట్రాల్లో వీటిని ఉంచేలా ఒప్పందమూ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రితూ బెస్ట్‌ స్టార్టప్‌ ఫౌండర్‌ సహా పలు అవార్డులనూ అందుకుంది. విదేశీ వేదికలపైనా వాటర్‌ ఏటీఎం ఆలోచనతో అవార్డులనూ గెలుచుకుంది.


క్యాన్సర్‌ బాధితులకు ఆసరా : డాక్టర్‌ నుస్రత్‌ సంఘమిత్ర

మెది ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా సోరోలోని కజి మొహల్లా. ఆర్థిక స్థోమత లేక వైద్యవిద్య చదవలేక పోయింది. దీంతో కెమిస్ట్రీలో పీజీ, ఐఐఎస్‌సీ నుంచి పీహెచ్‌డీ చేసి డాక్టర్‌ పట్టా పొందింది. నెదర్లాండ్స్‌, జపాన్‌ విశ్వవిద్యాలయాల నుంచి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌లనూ అందుకుంది. క్యాన్సర్‌ బాధితులకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఇండో-ఐరిష్‌ బయోటెక్‌ సైజెనికాను పుణెలో ప్రారంభించింది. నుస్రత్‌ చదువుకుంటున్న సమయంలోనే ఆమె నాన్న క్యాన్సర్‌తో చనిపోయారు. చికిత్స సమయంలో ఆయన పడ్డ ఇబ్బందుల్ని కళ్లారా చూసింది. అందుకే ‘తక్కువ దుష్పరిణామాలతో క్యాన్సర్‌కు వ్యతిరేకం’గా పనిచేసే మందులపై దృష్టిపెట్టింది. చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గించాలని సాంకేతికతపై దృష్టి సారించింది. బయోఫంక్షనల్‌ కెమిస్ట్రీలో సుదీర్ఘ కాలం అధ్యయనం చేసింది. సైప్లాటిన్‌, సైజియో పేరిట బయోమాలిక్యులర్‌ నానోయంత్రాలను రూపొందించింది. ఇవి క్యాన్సర్‌ ఔషధాలను ప్రభావిత కణాలకు అత్యంత కచ్చితత్వంతో చేరవేస్తాయి. ఇందుకుగానూ 2018లో మాలిక్యులర్‌ మెషిన్స్‌లో ఫోర్‌సైట్‌ ఫెలోషిప్‌నూ, టెక్నాలజీ స్టార్టప్‌ విభాగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జాతీయ అవార్డునూ అందుకుంది. ప్రస్తుతం సైజెనికా భారత్‌లో, ఐర్లాండ్‌లో పరిశోధనలు కొనసాగిస్తోంది. ఎస్‌వోస్‌ వెంటర్స్‌ అనే అంతర్జాతీయ సంస్థ దీనిలో పెట్టుబడి పెట్టింది. యూకేకు చెందిన ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌, యూఎస్‌కు చెందిన వయోజెస్‌ సంస్థలూ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ ఏడాదిలో ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేస్తారట. ఇది విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల క్యాన్సర్‌ బాధితుల జీవిత కాలాన్ని పెంచొచ్చని చెబుతోంది.


Advertisement

మరిన్ని