సేద్యంలో.. శభాష్‌ అనిపిస్తున్నారు

ఆసక్తిని జోడించారు.. చెమట చిందించారు... టెక్నాలజీని అందిపుచ్చుకొన్నారు.. వ్యవసాయ శాస్త్రవేత్తలు అబ్బురపడేలా... మార్కెటింగ్‌ నిపుణులు ముక్కున వేలేసుకునేలా... రాళ్ల భూమిలో రతనాలు పండిస్తున్నారీ మహిళా రైతులు...

Updated : 13 May 2022 15:49 IST

నేడు జాతీయ రైతు దినోత్సవం

ఆసక్తిని జోడించారు.. చెమట చిందించారు... టెక్నాలజీని అందిపుచ్చుకొన్నారు.. వ్యవసాయ శాస్త్రవేత్తలు అబ్బురపడేలా... మార్కెటింగ్‌ నిపుణులు ముక్కున వేలేసుకునేలా... రాళ్ల భూమిలో రతనాలు పండిస్తున్నారీ మహిళా రైతులు... ఇప్పుడు వాళ్ల క్షేత్రాలు వ్యవసాయ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు సందర్శన స్థలాలుగా మారిపోయాయి!

దానిమ్మసాగుతో అద్భుతాలు...

ఉన్నత చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సాధించారు. అయినా నేలమ్మకు దూరం అయ్యామని అసంతృప్తి. ఉద్యోగాలు వదిలేసి దానిమ్మ సాగు మొదలు పెట్టారు. నాలుగేళ్లలోనే రూ.కోట్ల సంపదని సృష్టించారు. వారే ప్రకాశం జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు రామరాజు లక్ష్మీసుజాత, బద్దులూరి విజయలక్ష్మి. వ్యవసాయం పట్ల వాళ్ల నాన్నకు ఉన్న మక్కువే వీరికీ అబ్బింది. పెద్దమ్మాయి లక్ష్మీ సుజాత ఐదేళ్లక్రితం తాళ్లూరు మండలంలో 25 ఎకరాలు కొన్నారు. మహారాష్ట్ర నుంచి భగవాన్‌ రకం దానిమ్మ మొక్కలు తెచ్చి నాటారు. చెల్లెలు విజయలక్ష్మినీ భాగస్వామురాలిని చేశారు. ఇద్దరూ రేయింబవళ్లూ శ్రమపడ్డారు. ఆ కష్టం ఫలించి తొలుత 20 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 120 నుంచి 150 టన్నుల వరకు దిగుబడి వస్తుందట. వీటితో కోటిన్నర వరకూ వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. చెన్నై, హైదరాబాదులకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. 30మంది మహిళలకు ఉపాధీ కల్పిస్తున్నారు. ‘‘ప్యాసెంట్‌ ఆగ్రో’ సంస్థను ప్రారంభించి ఇతర రైతులకు దానిమ్మ సాగులో మెలకువలు అందిస్తున్నాం. త్వరలో కావ్య ఆగ్రో పేరుతో దానిమ్మ స్నాక్‌ప్యాక్‌, జ్యూస్‌, జామ్‌ లాంటి ఉత్పత్తులను తీసుకురానున్నాం’ అంటున్నారీ సోదరీమణులు.


500 ఎకరాల్లో సాగు...

చిన్నప్పుడు నాన్నతో పాటు పొలానికి వెళ్లిన అనుభవం ఆమెను పెద్దయ్యాక సాగు వైపు మళ్లేలా చేసింది. వరంగల్‌ జిల్లాకు చెందిన సీతామహాలక్ష్మి వర్థన్నపేట మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. భర్త సత్యనారాయణ పోలీస్‌ శాఖలో చేసేవారు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. భర్త ఉన్నప్పుడు ఆయన ప్రోత్సాహంతో సొంత భూమితో పాటు కొంత కౌలు తీసుకుని మొత్తం 500 ఎకరాల్లో సాగు చేసి 2000 మందికి ఉపాధి కల్పించారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డునూ అందుకున్నారు. ప్రస్తుతం 60 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ సుమారు 150 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరి, పత్తి, వేరుసెనగ, కూరగాయలు, మునగ, మామిడి తోటలు లాంటివి పండిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో అనాథలు, శరణార్థులకు అన్నదానం చేసేవారు. స్థానికంగా ఉచిత వైద్య సేవలూ అందిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహా మరెన్నో సంస్థల నుంచి పురస్కారాలనీ అందుకున్నారు. సీతమహాలక్ష్మి ఇద్దరు కుమారులూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘అమ్మా నాన్న’ సేవా సొసైటీ ప్రారంభించి వృద్ధులు, అనాథల కోసం సేవా కార్యక్రమాలూ చేపడుతున్నారు.


సొంతగా నేర్చుకుని..

సుజాత భర్త కోటేశ్వరరావు మెరైన్‌ ఇంజనీర్‌గా తమిళనాడులో పనిచేయడంతో ఆమె కుటుంబంతో చెన్నైలో నివాసముండేవారు. అక్కడ అన్నీబాగున్నా భోజనం బాగుండేది కాదు. పంటలోనే ఏదో తేడా ఉందనిపించింది. చివరికి ఓ రోజు తానే సొంతంగా ఆహారం పండించాలని ఆలోచన చేశారు. సొంతూరు ఒంగోలుకు మకాం మార్చి.. పాలేకర్‌ విధానాలను అధ్యయనం చేశారు. బి.ఎ. చదివిన ఆమె పుస్తకాలు, యూట్యూబ్‌ వీడియోలతో సాగు గురించి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కొనకొనమెట్ల మండలం పెదఆరకట్ల సమీపంలో 35 ఎకరాలు కొని, 15 ఎకరాలు కౌలు తీసుకొని మొత్తం 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. మునగ, సీతాఫలం, బొప్పాయి, ఉసిరి, దానిమ్మ, జామ, నేరేడు వేసి అంతరపంటలుగా నువ్వులు, బొబ్బర్లు, మినుము, పెసర సాగు చేశారు. అరికలు, సామలు, జొన్నలు, రాగులు వంటి 15 రకాల పంటలతో నిత్యం ఆదాయం ఉండేలా జాగ్రత్త పడ్డారు. మినీ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని.. రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా మొక్క, మట్టి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నారు. ‘విశ్వమాత ఫామ్స్‌’ పేరుతో వెబ్‌సైట్‌నూ వాట్సప్‌ గ్రూప్‌నీ ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా నాణ్యమైన పసుపు, కారం, పప్పులు, చిరుధాన్యాలు, నూనెలు, పచ్చళ్లు వంటివి విక్రయిస్తున్నారు సుజాత. గత ఏడాది కేవలం చిరుధాన్యాలు, అంతరపంటల ద్వారా ఆమెకు వచ్చిన ఆదాయమే రూ.23 లక్షలు!  


పురుగుమందులేని పంటతో...

హైమావతి భర్త బోసుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో మొదట్లో రసాయన ఎరువులతోనే పంటలు పండించేవారు. వయసు కారణంగా వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్న తరుణంలో.. పూర్వీకుల మాదిరిగా రసాయనాలు వాడకుండా, సహజ పద్ధతుల్లో నూనెగింజలు, పప్పు ధాన్యాలు, వరి పండించాలనే ఆలోచన చేశారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కిలారు రాజశేఖర్‌ కూడా ప్రోత్సహించడంతో మంగళగూడెంలో 50 ఎకరాలు కొనుగోలు చేశారు. పినపాక నుంచి ఖమ్మం వచ్చి రాళ్లూరప్పలు, పెద్దపెద్ద చెట్లతో ఉన్న భూమిని సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. అందులో పెసర, మినుములు, కందులు, వేరుసెనగ, వరి వేశారు. పురుగు మందు లేకుండా జామ, ఆపిల్‌బేర్‌ పండ్లు సాగుచేశారు. ఆధునిక పద్ధతుల గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్‌ని చక్కగా వినియోగించుకున్నారు హైమ. మెదక్‌, గుంటూరు, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలూ పాటించారు. మహారాష్ట్ర నుంచి సూపర్‌గోల్డ్‌ సీతాఫలం, బంగ్లాదేశ్‌ నుంచి కశ్మీర్‌ రెడ్‌యాపిల్‌ బేర్‌, గుంటూరు పెద్దలంక నుంచి అలహాబాద్‌ సఫేదా, తైవాన్‌ జామ(పింక్‌) పండ్ల మొక్కలు, ఆరు రకాల్లో మామిడి మొక్కలు తెచ్చి సాగు చేస్తున్నారు. 300 మేకలు, గొర్రెలను, ఆవులను పోషిస్తున్నారు. 

- టి.ప్రభాకర్‌, ఈనాడు, ఒంగోలు, బి.రవికృష్ణ ప్రసాద్‌, ఈటీవి ఒంగోలు,

ఇమ్మడి ప్రసాద్‌, హనుమకొండ, సూర్యకుమారి, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్