Published : 24/12/2021 00:57 IST

20వేలమందిని ఉపాధి బాట పట్టించింది!

ఆవిడో సాధారణ గృహిణి. పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తీసుకుంది. కొద్ది పెట్టుబడితో లక్షల ఆదాయాన్ని పొందుతోంది. తన వ్యాపారాన్ని పెంచుకోవడం కన్నా... ఆ విద్యను పది మందికీ పంచితే వారూ ఆర్థిక స్వావలంబన సాధిస్తారు కదా అనుకుంది. అలా ఇప్పటి వరకు 20 వేల మంది మహిళలకు సాధికారత నందించిన 43 ఏళ్ల పుష్పా జా స్ఫూర్తి గాథ ఇదీ...

బిహార్‌, దర్భంగ పట్టణంలో పదేళ్ల క్రితం వరకు పుట్ట గొడుగుల పెంపకమంటే ఎవరికీ తెలీదు. 2010లో ప్రభుత్వ వ్యవసాయ విభాగం సమస్తిపుర్‌లో ప్రత్యేక ప్రాజెక్టుగా పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణాతరగతులను నిర్వహించింది. పుష్ప ఈ శిక్షణకు హాజరైంది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.500తో ఇంట్లోనే పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. పుష్ప భర్త రమేష్‌ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు.

గోధుమ పొట్టు, కుళ్లిన గడ్డి ఉండలతో పెంచిన పుట్టగొడుగులు చాలా రుచిగా ఉండటంతో వీటిని విక్రయించాలనిపించింది. ‘బలభద్రపుర్‌లో వెదురుతో చిన్న గదిని నిర్మించి, అందులో తేమ వాతావరణాన్ని కల్పించా. మొదట వెయ్యి బ్యాగుల్లో బటన్‌ మష్రూమ్స్‌ను పెంచి, వాటిని మార్కెట్‌లో విక్రయించడానికి తీసుకెళ్లా. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. దీంతో పెట్టుబడి, కష్టం వృథా అయ్యాయి. పుట్టగొడుగులతో ప్రయోజనాలు, వాటిని ఎలా వండాలో వంటివాటిపై అందరికీ అవగాహన కలిగిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. రెండోసారి వెయ్యి బ్యాగుల్లో పుట్ట గొడుగులను పెంచి, వాటిని 200 గ్రాముల చొప్పున ప్యాక్‌ చేసి మా వూరి వాళ్లకు, మార్కెట్‌లో ఉచితంగా పంచిపెట్టి, వాటిని ఎన్ని రకాలుగా వండొచ్చో చెప్పా. అలా అందరికీ వీటి రుచి తెలిసింది. దాంతో రోజుకి రూ.500 విలువ చేసే ఆర్డర్లు రావడం మొదలైంది. బటన్‌ రకంతోపాటు ఆయిస్టర్‌, మిల్కీ మష్రూమ్స్‌ పెంపకాన్ని ప్రారంభించా. సేంద్రియ ఎరువు, పుట్ట గొడుగులకు బెడ్స్‌ తయారీ వంటివన్నీ ఎప్పటికప్పుడు సొంత ఆలోచనలతో చేసుకుంటూ వచ్చా. ముందు కొంత నష్టపోయినా వెనుకడుగు వేయకుండా నేను చేసిన కృషి ఫలించింది. ఇప్పుడు ఏటా పెట్టుబడి పోను.. రూ.2 లక్షలు లాభం వస్తోంది. దీంతో చుట్టుపక్కల మహిళలందరూ  నేర్పమని అడిగేవారు. వారికి శిక్షణిచ్చి, సొంతంగా పెంపకంలో అడుగుపెట్టేలా చేశా. అలా 2015 నుంచి ఇప్పటివరకు 20 వేలమంది నేర్చుకుని లాభాలు పొందుతున్నారు. నావద్ద శిక్షణ పొందిన వారిని మరికొందరికి నేర్పమని ప్రోత్సహిస్తుంటా. ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలామంది మహిళలు నావద్దకు శిక్షణకు వస్తున్నారు. ఇప్పుడు 10 రోజుల కోర్సుగా నేర్పిస్తున్నా. చాలాచోట్ల వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. చాలా పాఠశాలలు, కళాశాలల వారూ విద్యార్థులకూ శిక్షణనివ్వాలని కోరుతున్నారు. కేంద్ర కారాగారంలోని ఖైదీలకు కూడా నేర్పిస్తున్నా. శిక్ష ముగిసి సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు వారి స్వయం ఉపాధికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇది నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. నన్ను చూసి మా అబ్బాయికీ ఆసక్తి కలిగి, హార్టీకల్చర్‌ కోర్సు చేస్తున్నాడు’ అని చెబుతోన్న పుష్ప పుట్ట గొడుగులతో పచ్చళ్లు, పౌడర్లు, బిస్కెట్లు, సమోసాలు వంటి స్నాక్స్‌ కూడా చేసి విక్రయిస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని