ఆమె ఆలోచన... వేల మందికి ఉపాధి

బడికెళ్లే కూతురి కోసం బూట్లు కొనే పరిస్థితి లేక తనే  స్వయంగా అల్లింది. ఆ సృజనాత్మకతే ఆమెను వాణిజ్య రంగంలో ఇప్పుడు విజయాలు సాధించేలా చేస్తోంది. ఈమె ఉత్పత్తులకు ప్రపంచమార్కెట్‌లో గిరాకీ ఉంది. ప్రముఖ ట్రేడ్‌ ఫెయిర్స్‌లోనూ ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్న 61 ఏళ్ల ముక్తామణి దేవి వేల మందికి శిక్షణ కూడా ఇస్తోంది.

Published : 04 Jan 2022 20:59 IST

బడికెళ్లే కూతురి కోసం బూట్లు కొనే పరిస్థితి లేక తనే  స్వయంగా అల్లింది. ఆ సృజనాత్మకతే ఆమెను వాణిజ్య రంగంలో ఇప్పుడు విజయాలు సాధించేలా చేస్తోంది. ఈమె ఉత్పత్తులకు ప్రపంచమార్కెట్‌లో గిరాకీ ఉంది. ప్రముఖ ట్రేడ్‌ ఫెయిర్స్‌లోనూ ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్న 61 ఏళ్ల ముక్తామణి దేవి వేల మందికి శిక్షణ కూడా ఇస్తోంది.

ఊలుతో రకరకాల బొమ్మలు, స్వెటర్లు అల్లడం ముక్తామణికి తెలుసు. మణిపుర్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టిందీమె. చదివించే స్తోమతలేక 16వ ఏటనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కుటుంబాన్ని పోషించాల్సిన భర్త జులాయిగా తిరుగుతుంటే తనే చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకునేది. తన మూడేళ్ల కూతురు అషిమాదేవికి తన స్వెటర్‌నే మార్చి బూట్లుగా అల్లి బడికి పంపించింది. టీచర్‌కు అషిమా బూట్లు చాలా నచ్చాయి. అటువంటివే తన పాపకూ చేసిమ్మని  ముక్తామణిని కోరింది. టీచర్‌ అడిగినట్లుగా మరో జత బూట్లు అల్లి అందించింది తను. అలా పాఠశాలలో తెలిసిన వారందరూ ముక్తామణితో ఆ తరహా బూట్లను అల్లించుకునే వారు.

గుర్తింపు...
క్రమంగా ముక్తామణి సృజనాత్మకత నలుగురికీ తెలిసింది. ఊర్లో వారంతా తమ పిల్లలకూ కావాలనే వారు. అలా వచ్చిన సొమ్మును పెట్టుబడిగా పెట్టి మరిన్ని బూట్లు అల్లి దుకాణాలకు ఇవ్వడం ప్రారంభించింది. ఏడాదికే తన బూట్లకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రకరకాల డిజైన్లలోనూ చెప్పుల తయారీ మొదలు పెట్టిందీమె. అలా ఆర్డర్లు పెరగడంతో 1991లో ‘ముక్తా షూస్‌ ఇండస్ట్రీ’ను స్థాపించింది. కుటుంబ ఆర్థికపరిస్థితి మెరుగుపడటంతోపాటు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ట్రేడ్‌ ఫెయిర్స్‌, ప్రదర్శనలలో ఈ ఉత్పత్తులను ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలనూ అందుకునేది. గృహిణిలకు వీటిలో శిక్షణనందించి స్వయం ఉపాధి కల్పించడం మొదలు పెట్టింది. క్రమేపీ దేశవ్యాప్తంగా ఆర్డర్లు మొదలయ్యాయి. ఈ పదేళ్లలో వ్యాపారం దినదినాభివృద్ధి చెందడమే కాదు... ఆస్ట్రేలియా, జపాన్‌, మెక్సికో వంటి పలు దేశాలకూ ఈ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

తేలికగా...

తాను తయారుచేసే ఊలు బూట్లు పాదాలకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తాయి అంటుంది ముక్తామణి. ‘వాతావరణంలో వేడికి ముందుగా ప్రభావితమయ్యే పాదాలను మా సంస్థ బూట్లు సంరక్షిస్తాయి. తేలికగా ఉండి, సునాయసంగా శుభ్రం చేసుకోవచ్చు. పేదరికం నుంచి బయటపడ్డాననే ఆనందం కన్నా, నాలోని సృజనాత్మకత వెలుగులోకి వచ్చిందని సంతోషపడుతుంటా. జత షూ తయారీకి కనీసం మూడు రోజులు పడుతుంది. ప్రస్తుతం మా ఫ్యాక్టరీలో 25మంది పనిచేస్తున్నారు. డిజైన్‌ నేనే చేస్తా. బూట్ల పైభాగాన్ని అల్లేందుకు రోజుకి ఒక్కో మహిళకు రూ.500 ఇస్తాం. ఈ వ్యాపారంలో మా అమ్మాయి అషిమా, అబ్బాయి క్షేత్రిమయం నాకు చేయూతగా ఉన్నారు. మావద్ద 20రకాల ఉత్పత్తులున్నాయి. ఆర్మీ క్యాంటిన్లు, పలు వర్క్‌షాపులకూ మా ఉత్పత్తులు వెళతాయి. నెలకు మాకు 400-500 ఆర్డర్లు వస్తున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా నుంచి వెయ్యి జతలకు ఆర్డరు వచ్చింది. కొత్తలో ఆర్డర్లు చేతిలో ఉండేవి. పెట్టుబడి దొరికేది కాదు. రుణాలు తీసుకునే దాన్ని. వాటిని సమయంలోపు చెల్లించకపోతే వడ్డీలు పెరిగేవి. ఇటువంటి సమస్యలన్నీ దాటుకుంటూ ఈ స్థాయికి చేరి, నాలాంటి మహిళలకు ఉపాధిని అందించగలుగుతున్నా. ప్రభుత్వపరమైన ప్రాజెక్టుల తరఫున శిక్షణనిస్తున్నా. ఇప్పటి దాకా రెండువేలమందికి పైగా మహిళలకు ఉచితంగా శిక్షణనందించా’ అని చెబుతున్న ముక్తామణి కృషి, సృజనాత్మకతకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతోపాటు పలు పురస్కారాలనూ దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని