Published : 05/01/2022 01:56 IST

దక్షిణ ధృవాన్ని గెలిచింది

బ్రిటన్‌ సైన్యంలో ఉద్యోగం ఆమె కల. దాన్ని సాకారం చేసుకుంది. ఇంకా ఏదైనా సాధించాలనుకుంది. అత్యంత ప్రమాదకరమైన దక్షిణ ధృవానికి యాత్ర చేపట్టింది 32 ఏళ్ల ప్రీత్‌ చాందీ. 40 రోజుల్లో 700 మైళ్ల దూరం ప్రయాణించి ఒంటరిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళగా చరిత్రలోకెక్కింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యం చేయచ్చు అని చాటింది.

అంటార్కిటికాలోని దక్షిణధృవప్రాంతానికి ఒంటరిగా వెళ్లాలనే ఆలోచనే చాలామందికి రాదు. ఆసక్తి ఉన్నా ఆ సాహసానికి పూనుకునే ధైర్యం ఉండదు. అందుకే ఇన్నాళ్లూ ఒంటరిగా ఎవరూ అక్కడికి చేరుకోలేకపోయారు. అడుగడుగునా సవాళ్లు విసిరే ఆ మార్గాన్ని ఎంచుకుంది ప్రీత్‌. సైనిక అధికారిగా తీసుకున్న శిక్షణ, శారీరక సామర్థ్యం ఈ సాహసయాత్రకు కొంతవరకే ఉపయోగ పడుతుంది. ధృవప్రాంతం అంటేనే మూడేళ్లక్రితం వరకు ఏమాత్రం అవగాహన లేని ప్రీత్‌ ఇప్పుడీ సాహసాన్ని చేయగలిగిందంటే అందుకు ఆమె కృషికి అసామాన్యమైన పట్టుదల తోడైంది. 2007లో బ్రిటిష్‌ సైన్యంలో ప్రీత్‌ క్లినికల్‌ ట్రైనింగ్‌ అధికారిగా చేరింది. మన దేశానికి చెందిన సిక్కు కుటుంబం ప్రీత్‌ వాళ్లది. తనకు చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టం. గతంలో ఎన్నో సాహస యాత్రల్లో పాల్గొంది. దక్షిణ ధృవానికి చేరుకోవాలనే లక్ష్యంతో గత నవంబరు 24న యాత్రను ప్రారంభించింది. అతి ఎత్తైన, చల్లని ప్రాంతంలో ప్రతి అడుగూ సాహసమైందే. చలిగాలులను ఎదుర్కొంటూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఆహారం, నిత్యావసరాలున్న 90 కేజీల బరువున్న సంచుల్ని మోస్తూ ప్రయాణించింది. ఈ యాత్ర చేయడానికి తనను తాను సిద్ధం చేసుకోవడానికి, అక్కడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి గ్రీన్‌ల్యాండ్‌ మంచులో 27 రోజులు అత్యంత కఠిన శిక్షణ తీసుకుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందడుగు వేస్తూ 700 మైళ్లను 40 రోజుల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించింది. మైనస్‌ 50 డిగ్రీల వాతావరణం, అతి చల్లని ఈదురు గాలుల మధ్య ఒంటరిగా అడుగులేస్తూ... ఆ అనుభవాలను తన బ్లాగు, ఇన్‌స్టాగ్రాంల్లో పొందుపరిచింది ప్రీత్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని