Published : 18/02/2022 01:35 IST

ఆమె ఆలోచన అదిరింది!

కరోనా విస్తరించిన సమయంలో ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే ఆ మహమ్మారి వల్ల జరిగిన నష్టాన్ని తట్టుకుంటూ సరికొత్త వ్యాపార సూత్రాలతో ముందుడుగు వేస్తోంది దిల్లీకి చెందిన రియా ఖత్తర్‌. ఉన్న దుస్తులనే రకరకాలుగా మార్చుకునే కొత్తరకం డిటాచబుల్‌ స్లీవ్స్‌ను రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటోంది ఈ మానసిక శాస్త్ర విద్యార్థిని.

రోనా సమయంలో ప్రజలు దుస్తులపై ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకుండా,. ఉన్నవాటితోనే సర్దుకుపోతున్నారని తెలుసుకుంది రియా. అప్పుడే ఆమెకో ఆలోచన వచ్చింది. ఉన్న దుస్తులకే జత చేసి, ఆ తర్వాత తీసిపెట్టుకునే భుజాల తొడుగులు (స్లీవ్స్‌)ను రూపొందిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. వీటి వల్ల దుస్తులకు సరికొత్త లుక్‌, స్టైల్‌ అందించొచ్చని అనుకుంది. అలా ఆమె ఆలోచన ‘హార్ట్‌ అప్‌ మై స్లీవ్స్‌’ అనే బ్రాండ్‌ను ప్రారంభించడానికి దారి తీసింది. ఇప్పుడది బహుళ ప్రజాదరణ పొందింది. అయితే అంతకు ముందు ఆమె ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ అనే కార్యక్రమంలో తన ఆలోచనను పంచుకుంది. దాంతో ఆమె ఐడియా నచ్చి వినీతా సింగ్‌, అనుపమ్‌ మిత్తల్‌లు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.

మరింత అందంగా...

‘కొవిడ్‌ టైమ్‌లో ఊపిరి పోసుకున్న ‘హార్ట్‌ అప్‌ మై స్లీవ్స్‌’ చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపింది. ‘బోలెడు దుస్తులు ఉన్నప్పటికీ అవన్నీ అంతకుముందే వేసుకోవడంతో  ప్రస్తుతానికి కొత్తవేం లేవని చాలామంది అమ్మాయిల ఫిర్యాదు. దాన్ని నేను మార్చాలనుకున్నా. అందుకోసం ప్రతి డ్రెస్‌ను చాలా అందంగా చేయాలని నిర్ణయించుకున్నా’ అని చెబుతోంది రియా.  ఆమె కుటుంబం అప్పటికే దుస్తుల వ్యాపారంలో ఉండటంతో సహజసిద్ధంగానే తనకూ ఫ్యాషన్‌ రంగంలో వ్యాపారవేత్తగా మారాలనే కోరిక కలిగింది. అమ్మాయిల వార్డ్‌ రోబ్‌లోని దుస్తులన్నింటినీ తీసిపెట్టుకునే భుజాల తొడుగుల (డిటాచబుల్‌ స్లీవ్స్‌)తో నింపడం, దాంతోపాటు వాటికి ఆకర్షణను జతచేయడమే హార్ట్‌ అప్‌ మై స్లీవ్స్‌ వెనుక ఉద్దేశం. ఈ స్లీవ్స్‌తోపాటు బ్రోచెస్‌, కేప్‌లను అందించాలనుకుంటోంది.

‘మహిళలు ఎప్పటికప్పుడు కొత్త, వైవిధ్య భరితమైన దుస్తులు ఇష్టపడుతుంటారు. ‘హార్ట్‌ అప్‌ మై స్లీవ్స్‌’ ద్వారా అవుట్‌ఫిట్స్‌ను చాలాసార్లు వేసుకుంటున్నామనే భావన కలగకుండా రకరకాలుగా బోలెడుసార్లు వేసుకోవచ్చు.’ అని అంటోందామె. దిల్లీలోని తన తండ్రి పరిశ్రమలోనే స్లీవ్స్‌, కేప్స్‌, బ్రోచెస్‌... ఇవన్నీ తయారవుతాయి. రియా చేస్తోన్న ఈ వ్యాపారంలో ఆమె అక్క చందన్‌ సహ వ్యవస్థాపకురాలు. తనూ ఫ్యాషన్‌ రంగంలో నిపుణురాలే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని