ఇంకాస్త ఎక్కువ శ్రమించాల్సిందే!

అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి 8)సందర్భంగా ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అంశంపైన ‘ఈనాడు-వసుంధర’ ఆదివారం ప్రత్యేక వెబినార్‌ నిర్వహించింది. దీన్లో ప్రముఖుల విలువైన సూచనలూ, సలహాలు ఇవి..

Updated : 07 Mar 2022 08:17 IST

అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి 8)సందర్భంగా ‘లింగవివక్షనుఅధిగమిద్దాం’ అంశంపైన ‘ఈనాడు-వసుంధర’ ఆదివారం ప్రత్యేక వెబినార్‌ నిర్వహించింది. దీన్లో ప్రముఖుల విలువైన సూచనలూ, సలహాలు ఇవి..

ఆలోచన ఉంటే చాలు..!

వ్యాపారంలో అడుగుపెట్టాలంటే... ఏదైనా సమస్యకు మీదైన పరిష్కారం చూపే సామర్థ్యం ఉండాలి. మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే, టెక్‌ నైపుణ్యాలూ, ఇంగ్లిష్‌ మాట్లాడే సామర్థ్యం లేకపోయినా ఫర్వాలేదు. వి-హబ్‌ లాంటి చోట్ల మీకు మెంటార్స్‌ ఉంటారు. మీ ఆలోచన వాస్తవరూపం దాల్చడానికి అన్ని విధాలా సాయపడతారు. ఆలోచన ఉంది కానీ, కుటుంబం మద్దతు లేదనో, ఇంకేదో అడ్డంకి ఉందనో పదే పదే అనుకోవడంవల్ల లాభం లేదు. ఎవరితో మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందో వాళ్లతో మాట్లాడటానికి వెనకాడొద్దు. ఎవరినైనా చూసి ‘మేమైతే అంతకన్నా బాగా చేసేవాళ్లం’ అంటారు కొందరు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు అసలు ఆ పనే మొదలుపెట్టలేదు. కాబట్టి అలా అనడంలో అర్థం లేదు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోండి. ఆర్థిక విషయాల్ని మగవాళ్లకి అప్పగిస్తామంటారు కొందరు. కానీ వ్యాపారంలో అదే కీలకం. కాబట్టి అది మీ చేతుల్లోనే ఉండాలి.

- దీప్తి రావుల, సీఈఓ, వి-హబ్‌

మీరుంటే... అన్నీ ఉన్నట్టే!

మనల్ని మనం తెలుసుకోవాలంటే... జీవితానికి అర్థం తెలుసుకుని, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్యం, సంకల్పం ఉంటే ఆ ప్రయాణమే భిన్నంగా ఉంటుంది. ఆ దారిలో అడ్డంకులూ వస్తాయి. మహిళలకైతే ఇంకా ఎక్కువ. అయినా మడమ తిప్పకుండా, విశ్రమించకుండా ముందుకు వెళ్లాలి. అందుకోసం శారీరక, మానసిక ఆరోగ్యంపైన దృష్టి పెట్టండి. ఏం చేయాలన్నా అది లేదు, ఇది లేదని వాయిదా వేస్తారు కొందరు. మీరున్నారుగా.. ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. ప్రతి విషయాన్నీ అంతరాత్మతో చర్చించుకోండి. నిర్ణయం సబబే అనిపిస్తే ముందుకు వెళ్లండి. మీవల్ల కుటుంబానికీ, సమాజానికీ, దేశానికీ, ప్రపంచానికి ఏంటి ఉపయోగమో ఆలోచించండి. ఏం చేసినా ఎరుకతో చేయాలి. మనసు, మాట, చేత... వీటి మధ్య ఎలాంటి తేడా ఉండకూడదు. పనిలో దైవత్వాన్ని చూడాలి.

- డా. మధురిమా రెడ్డి, సీఈఓ లా విన్‌స్పైర్‌

ప్రతి మహిళ... సరస్వతి, లక్ష్మి, పార్వతి!

పని ప్రదేశంలో మహిళలకు అనేక రకాల సవాళ్లు ఎదురవుతాయి. మన దగ్గర లింగ సమానత్వం లేకపోవడమే దీనికి కారణం. మహిళలంటే కొన్ని పనులే చేస్తారనే మూస ధోరణిలో ఉండిపోయాం. అబ్బాయిలు నెమ్మదిగా ఉన్నా, అమ్మాయిలు కరుగ్గా ఉన్నా కూడా సమాజం భిన్నంగా చూస్తుంది. ఒక టీమ్‌ ఏదైనా టాస్క్‌ని విజయవంతంగా పూర్తిచేస్తే, అందులో మగవాళ్లకీ, మహిళలకీ సమాన పాత్ర ఉన్నప్పటికీ మగవాళ్లకే గుర్తింపు దక్కుతుంది. మహిళకు గుర్తింపు రావాలంటే మగవాళ్లకంటే ఎక్కువ కష్టపడాలి. ప్రతి స్త్రీలో ఓ సరస్వతి, ఓ లక్ష్మి, ఓ పార్వతి ఉంటేనే ఇది సాధ్యం. సరస్వతి అంటే విద్య, విజ్ఞానం. లక్ష్మి.. ఆర్థిక స్వతంత్రత. పార్వతి.. శక్తికి ప్రతీక, ఇది నాయకత్వ లక్షణం. ఈ మూడు కోణాలూ ఉంటే విజయం వరిస్తుంది. లైంగిక వేధింపుల్ని అధిగమించడం మనకున్న మరో సవాలు. ప్రతి సంస్థలో లైంగిక వేధింపులు నిరోధించడానికి ఓ కమిటీ ఉంటుంది. అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. పోలీసుల్నీ సంప్రదించవచ్చు.

- కె.శిల్పవల్లి, డీసీపీ, మాదాపూర్‌

నిర్ణయాలు మీరే తీసుకోండి..

కలల్ని సాకారం చేసుకోవాలంటే... సానుకూల దృక్పథం, నిరంతర శ్రమతోపాటు మార్పుని అంగీకరించే స్వభావం ఉండాలి. మహిళలు ఉన్నచోటనుంచి మార్చగానే ఆందోళనకు గురవుతారు. ఎదుగుదల కావాలంటే ప్రయాణంలో ఎత్తుపల్లాలూ ఉంటాయి. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసేరోజుల్లో కొత్తదనం కోసం యోగా నేర్చుకున్నా. యోగా శిక్షకురాలిగా మారా. ఇది నా ఆలోచనా పరిధిని పెంచింది. అలాగే ఏదైనా నిర్ణయం కోసం అందరి అభిప్రాయాల్నీ సేకరించకుండా మనమే తీసుకోవాలి. ఇండియాలో మంచి అవకాశం వచ్చినపుడు వచ్చేస్తున్నానని ఇంట్లో చెప్పానంతే. అది మంచిదా, కాదా అని అభిప్రాయాలు అడుగుతూ పోతే ఎప్పటికీ ఒక నిర్ణయానికి రాలేం. మహిళని చెప్పి ప్రత్యేక అనుమతులు అడగొద్దు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. నక్షత్రాలని అందుకోవాలనుకోండి. ఆకాశాన్నైనా చేరుకుంటారు.

- డా. శాంతా తౌటం, తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌

వెబినార్‌ వీడియోని ఈనాడు.నెట్‌లో చూడొచ్చు.

లింక్‌: https://www.eenadu.net/telugu-news/women/general/6204/122042894


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్