ఇంగ్లిష్‌ టీచర్లు.. యూట్యూబ్‌ స్టార్లు!

ఇంటర్మీడియెట్‌లోనే పెళ్లి. ఆపైన పిల్లలూ, కుటుంబ బాధ్యతలూ! అక్కడితో ఆగిపోయిన వాళ్లెందరో. కానీ సుజాత, గౌతమి వాళ్లకు భిన్నం. కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటూనే చదువు కొనసాగించారు. ఇంగ్లిష్‌ టీచర్లు అయ్యారు.

Published : 05 Apr 2022 01:36 IST

ఇంటర్మీడియెట్‌లోనే పెళ్లి. ఆపైన పిల్లలూ, కుటుంబ బాధ్యతలూ! అక్కడితో ఆగిపోయిన వాళ్లెందరో. కానీ సుజాత, గౌతమి వాళ్లకు భిన్నం. కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటూనే చదువు కొనసాగించారు. ఇంగ్లిష్‌ టీచర్లు అయ్యారు. లాక్‌డౌన్‌ వేళ యూట్యూబ్‌ ఛానెళ్లనీ ప్రారంభించి క్లిష్టమైన ఆంగ్ల భాషని సులభ పద్ధతుల్లో చెప్పేస్తున్నారు. లక్షల మంది వీటిని వీక్షిస్తున్నారు!


నా కథే చెబుతా...

లెక్చరర్‌గా పాఠాలూ, పరీక్షలతో ఏడాదంతా బిజీగా ఉండేదాన్ని. 2020లో మొదటి లాక్‌డౌన్‌ పెట్టినపుడు ఎటూ వెళ్లలేని పరిస్థితి. నాలుగు గోడల మధ్య రోజంతా ఖాళీగా ఉండ బుద్ధి కాలేదు. విద్యార్థులు ఫోన్‌చేసి సందేహాలు అడుగుతుండేవారు. అలా చాలామందికి సందేహాలున్నాయని అర్థమైంది. ఎప్పట్నుంచో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పమనేవారు స్నేహితులు. ఇదే మంచి తరుణం అనుకుని ప్రారంభించా. మొదట్లో ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల కోసం వీడియోలు చేసేదాన్ని. వాటిని చూసినవాళ్లు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, పోటీ పరీక్షలకు గ్రామర్‌ చెప్పమని అడగడంతో వాటినీ మొదలుపెట్టా. మాది తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం. గ్రామీణ నేపథ్యం అని మొదట్లో సంశయించాను. కానీ నా శైలిలో నేను చెబుతానని.. సమాధాన పరుచుకుని మొదలుపెట్టా. క్లాస్‌రూమ్‌ అనుభవం వేరు. ఇక్కడ మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉన్నారనుకుని వారి సందేహాల్ని ఊహించి పాఠాలు చెప్పాలి. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా, దీన్నో అవకాశంగా భావించి కొనసాగిస్తూ వచ్చా. వారంలో 2-3 వీడియోలు పెట్టేదాన్ని. మొదట్లో పెద్దగా ఎవరూ చూడలేదు. కానీ వీడియోలు చేస్తూనే వచ్చా. 8-12 నెలల మధ్య వీక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఏడాదికల్లా లక్ష సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే వీడియోలూ కొనసాగిస్తున్నా. ఆదివారాలు, సెలవు రోజుల్లో  వీడియోలు షూట్‌చేస్తుంటా. ఎంత చదివినా ఇంగ్లిష్‌ రావట్లేదని చాలామంది చెబుతుంటారు. వాళ్లకి నా కథే చెబుతా. తెలుగు మీడియంలో చదివా. ఇంటర్మీడియెట్‌లోనే పెళ్లి.. తర్వాత పిల్లలు. ఇంతేనా జీవితం అనిపించింది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చదవడం ప్రారంభించి డిగ్రీ పూర్తిచేశా. ఆపైన ఎంబీఏ, ఎంఏ బీఎడ్‌ చేశా. ఆరోజు చదువు కొనసాగించకుంటే, నేనక్కడే ఉండిపోయేదాన్ని. ఈరోజు ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లంతా మీ పాఠాలు మాకెంతో ఉపయోగపడుతున్నాయని చెబుతుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ మధ్య యాప్‌ కూడా తీసుకొచ్చా.

ఛానెల్‌ : ఈజీ ఇంగ్లిష్‌ బై సుజాత
ప్రారంభం: జూలై, 2020
సబ్‌స్క్రైబర్లు: 1.97 లక్షలు
వీక్షణలు: 87 లక్షలు


పాఠాలు.. స్ఫూర్తి పాఠాలు!

డాక్టర్‌ కావాలనేది నా లక్ష్యం. మెడిసిన్‌లో సీటు కూడా వచ్చింది. కానీ ఇంటర్మీడియెట్‌లో ఉండగానే పెళ్లయింది. దాంతో అటువైపు వెళ్లలేకపోయా. సైన్స్‌తోపాటు ఇంగ్లిష్‌పైనా మొదట్నుంచీ ఆసక్తి. మావారు టీచర్‌. చదువుతానంటే ప్రోత్సహించారు. దూరవిద్యలో డిగ్రీ, పీజీ చేశాను. బీఎడ్‌ చేశాను. 2013లో స్కూల్‌ అసిస్టెంట్‌(ఇంగ్లిష్‌)గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఖమ్మంలో పనిచేస్తున్నా. మొదటి లాక్‌డౌన్‌ సమయంలో గిరిజన ప్రాంతంలో పనిచేసేదాన్ని. వాళ్లకి జూమ్‌ క్లాసులు చెప్పేదాన్ని. కానీ నెట్‌ సరిగ్గా అందక ఎక్కువ మంది వినలేకపోయేవారు. అదే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అందరికీ ఎదురవుతుందని గ్రహించా. ఆ సమయంలోనే యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభిస్తే వాళ్లకి వీలున్నప్పుడు చూస్తారనిపించింది. 2020 జూన్‌లో ఛానెల్‌ ప్రారంభించా. ఏడాదికే రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. విద్యార్థులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లూ చూస్తున్నారు. ఇంగ్లిష్‌ నేర్చుకునేవాళ్లకి పాఠాలతోపాటు వాళ్లకు ఆ భాషపైన ఉన్న భయాన్నీ పోగొట్టడానికి స్ఫూర్తినిచ్చే, ప్రేరణ కలిగించే మాటల్నీ చెబుతుంటా. ప్రాథమిక దశనుంచీ నేర్చుకునే వాళ్లకి ‘జీరో టు హీరో’ పేరుతో 11 వీడియోల సిరీస్‌. అన్ని వర్గాలవారికీ ఉపయోగపడేలా 45 భాగాల ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ వీడియోల్నీ చేశా. రోజువారీ ఇంగ్లిష్‌లో వాడే వాక్యాలతో ‘యూట్యూబ్‌ షార్ట్స్‌’ చేస్తుంటా. యాప్‌ కూడా తెచ్చా. ఇంగ్లిష్‌ నేర్చుకోవాలంటే భయం వేస్తుందని చెబుతుంటారు. అలాంటివారు కనీసం 21 కథలు ఇంగ్లిష్‌లో నేర్చుకోవాలని చెబుతా. దానివల్ల పదాలూ, గ్రామర్‌ అన్నీ లోతుగా అర్థమవుతాయి.

ఛానెల్‌: ట్యూబ్‌ ఇంగ్లిష్‌
ప్రారంభం: జూన్‌, 2020
సబ్‌స్క్రైబర్లు: 3.6 లక్షలు
వీక్షణలు: 2.11కోట్లు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్