విద్యుత్‌ మహిళ మహువా ఆచార్య...

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగితే భూతాపంవల్ల సముద్రమట్టం పెరగడం, అకాల వర్షాలూ, కార్చిచ్చుల్లాంటి విపత్తులెన్నో వాటిల్లుతాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నాయి.

Published : 07 Apr 2022 01:08 IST

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగితే భూతాపంవల్ల సముద్రమట్టం పెరగడం, అకాల వర్షాలూ, కార్చిచ్చుల్లాంటి విపత్తులెన్నో వాటిల్లుతాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నాయి. మన దేశంలో ఈ బాధ్యతని ప్రధానంగా ఓ మహిళ తీసుకున్నారు. ఆమే... మహువా ఆచార్య.  

ప్రపంచంలోనే అత్యధికంగా ఒకేసారి 5580 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని కొనే ప్రయత్నం మనదేశంలో ప్రస్తుతం నడుస్తోంది. ‘గ్రాండ్‌ ఛాలెంజ్‌’ పేరుతో హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ సూరత్‌, కోల్‌కతా నగరాల్లో ప్రజా రవాణాకు వీటిని తెచ్చే ప్రయత్నం ఇది. దీన్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలూ, వాహన తయారీదారులూ, రుణ సంస్థలూ, నీతీ ఆయోగ్‌ భాగమవుతున్నాయి. దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) ఎండీ, సీఈఓ మహువా ఆచార్య. ఇదే కాదు, ఎల్‌ఈడీ బల్బుల వినియోగం పెంచడానికి ‘గ్రామ్‌ ఉజాలా’ పేరుతో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లలో బల్బు రూ.10 చొప్పున పేదలకు 60 లక్షల బల్బుల్ని అందించారు. దీనిద్వారా విద్యుచ్ఛక్తి ఆదా, కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి. దేశంలో విద్యుత్‌ వినియోగానికి ఇలాంటి అనేక కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు మహువా.

పర్యావరణహిత ఇంధన వినియోగం దిశగా వేగం పెంచాలని ‘సీఈఎస్‌ఎల్‌’ని 2020లో ప్రారంభించింది భారత్‌. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. ప్రారంభం నుంచీ ఈ సంస్థకు ఎండీ, సీఈఓ మహువానే. ‘ప్రకృతికి చాలా దగ్గరగా పెరిగాను. వాతావరణాన్ని రక్షించడానికి మావాళ్లు చాలా చేస్తుండేవారు. ఆ విధంగా చిన్నపుడే నా మనసులో దీనికి చోటు దక్కింది. ఆ ఆసక్తితో యేల్‌ యూనివర్సిటీ నుంచి ‘ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌, మేనేజ్‌మెంట్‌’ విభాగంలో మాస్టర్స్‌ చేశా. ఆపైన వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డవలప్‌మెంట్‌ (జెనీవా), వరల్డ్‌ బ్యాంక్‌ (వాషింగ్టన్‌), మిత్తల్‌ స్టీల్‌ (లండన్‌)లలో కార్బన్‌ ఫైనాన్స్‌ స్పెషలిస్ట్‌గా పనిచేస్తూ పర్యావరణ హిత ప్రాజెక్టులకు రూపకల్పన చేశా. 2015లో గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సియోల్‌)లో అసిస్టెంట్‌ డైరక్టర్‌ జనరల్‌గా చేరా. 31 దేశాల ప్రభుత్వాలు దీన్లో భాగం. ఈ దేశాల్లో పర్యావరణ హిత ప్రాజెక్టుల రూపకల్పన, నిధులు సమీకరణ చేసేవాళ్లం’ అనే మహువా.. తల్లి అయ్యాక స్వదేశంలో ఈ సమస్యల్ని పరిష్కరించే అవకాశం కోసం ఎదురు చూశానంటారు. ‘కాలుష్యం తగ్గకపోతే మా పిల్లలు, అలాంటి లక్షల మంది పిల్లలు దిల్లీ గాలిని పీలుస్తూ పెరగాలి. ఆ ఆలోచన నిరంతరం ఆందోళన కలిగించేది’ అంటారు మహువా.

రాయితీల ప్రోత్సాహం...

దేశంలో విద్యుత్‌ వాహనాల వాడకాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాల్ని అందుబాటులోకి తేవడంపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు మహువా. ‘మైఈవీ’ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌, కేరళ, గోవా రాష్ట్రాలతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలిస్తూ సుమారు 40 వేల ఈ-బైక్‌లు కొనుగోలు చేయించారు. ‘ఈ విభాగంలో ఏం చేసినా పెద్ద ఎత్తున చేయాలి. లేకపోతే ప్రభావం ఉండదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలూ, కార్లూ, బస్సులూ అన్నింటా ఈ-వాహనాలు ఉండాలి. వాటికి ఛార్జింగ్‌, పార్కింగ్‌ సదుపాయాల్నీ తేనున్నాం’ అని చెప్పే మహువా ఎలక్ట్రిక్‌ కార్లను ప్రభుత్వ కార్యాలయాలకు లీజుకు ఇచ్చే ఏర్పాటునీ చేస్తున్నారు. పుణెలో చెత్త తరలించడానికి ఈ-ఆటోల్ని వాడేలా మార్పు తెచ్చారు. ఈ-కామర్స్‌ సంస్థలూ సరుకుల పంపిణీ కోసం ఇటువైపు మళ్లేలా చేస్తున్నారు. వ్యవసాయంలో సౌర విద్యుత్‌ని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

‘దేశ అవసరాల్లో 74 శాతం శిలాజ ఇంధనాలే తీరుస్తున్నాయి. 2070 నాటికి కర్బన ఉద్గారాల్ని నెట్‌జీరో చేయాలన్నది లక్ష్యం. అందుకు వ్యవస్థని నిర్మిస్తున్నాం. మరో 25-30 ఏళ్లకు చాలా మార్పు వస్తుంది. ముందే, త్వరగా మార్పు తేవాలన్నది మా ప్రయత్నం’ అంటారు మహువా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్