చీకట్లో... సితార!

బ్రెయిన్‌ఫీవర్‌ ఆమె జీవితంలో చీకట్లని నింపాలని చూస్తే... ఆ కష్టాన్ని.. సంగీతంతో జయించి మనసులో వెలుగులు నింపుకొందామె! అంధత్వం తనని వెనక్కి లాగాలని ప్రయత్నించినప్పుడు... ఉద్యోగంలో ఎన్నో మెట్లు ఎక్కి ముందుకే వెళ్లింది! ఓవైపు సితార్‌ విద్వాంసురాలిగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగినిగా జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ

Published : 14 Apr 2022 06:38 IST

బ్రెయిన్‌ఫీవర్‌ ఆమె జీవితంలో చీకట్లని నింపాలని చూస్తే... ఆ కష్టాన్ని.. సంగీతంతో జయించి మనసులో వెలుగులు నింపుకొందామె! అంధత్వం తనని వెనక్కి లాగాలని ప్రయత్నించినప్పుడు... ఉద్యోగంలో ఎన్నో మెట్లు ఎక్కి ముందుకే వెళ్లింది! ఓవైపు సితార్‌ విద్వాంసురాలిగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగినిగా జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ నిరాశ నిండిన జీవితాల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది నిజామాబాద్‌కి చెందిన కీర్తిరాణి..

అందరి పిల్లల్లానే కీర్తి బాల్యం కూడా హాయిగానే సాగేది. కానీ ఆ సంతోషమంతా ఆరేళ్ల వరకే! ఆ తర్వాత వచ్చిన బ్రెయిన్‌ ఫీవర్‌ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ జ్వరం వల్ల కోమాలోకి వెళ్లిందామె. మూడునెలల తర్వాత కోలుకున్నా... మునుపటి చూపు, జ్ఞాపకాలు తిరిగి రాలేదు. ఓ బొమ్మలా నిస్తేజంగా ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండేది. కీర్తిని అలా చూడలేకపోయారు ఆమె తల్లి సావిత్రి. తన కూతురు పేరుకు తగ్గట్టుగా ఎదగాలని ఆశించారామె. రాళ్లనైనా కరిగించే సంగీతం ఆ అమ్మాయి జీవితాన్ని మారుస్తుందని నమ్మారు సావిత్రి. సితార్‌ వాద్యంలో ఓనమాలు నేర్పించారు. అనుకున్నట్టుగానే కీర్తిలో మార్పు కనిపించింది. సితార్‌ ఆమె జీవితంలో భాగమయ్యింది. దాంతో ఆమె వెంటే ఉండి హైదరాబాద్‌లోని సంగీత పాఠశాలలో చేర్పించి నాలుగేళ్ల సర్టిఫికెట్‌ కోర్సుతో పాటు, రెండేళ్ల డిప్లొమానీ పూర్తి చేయించారు.  

సితార్‌ దిద్దిన జీవితం...
చీకటి నిండిన కీర్తి జీవితంలో సంగీతం కొత్త వెలుగులు పూయించింది. ఆ ఉత్సాహానికి తల్లి అందించిన ప్రోత్సాహం కూడా తోడై కీర్తి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, త్యాగరాజ గానసభల్లో ప్రదర్శనలిచ్చింది. ఆ తర్వాత జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా తిరువనంతపురం వెళ్లింది. పండిట్‌ రవిశంకర్‌ ‘బ్రహ్మనాద్‌’ పేరిట నోయిడాలో నిర్వహించిన గిన్నిస్‌ బుక్‌ రికార్డు వాద్య ప్రదర్శనల్లోనూ పాల్గొంది. తి.తి.దే మారిషస్‌లో నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొని అందరి ప్రశంసలూ అందుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా పురస్కారంతో సత్కరించింది.

18 ఏళ్ల వయసులో...
సంగీతంలో ఎంత రాణిస్తున్నా తన కూతురు చదువుకు దూరమయ్యిందన్న బాధ సావిత్రిని ఆలోచింపచేసింది. బంధువుల, చుట్టుపక్కల పిల్లలు.. పుస్తకాల గురించి, చదువు గురించి మాట్లాడుతున్నప్పుడు కీర్తి మౌనంగా ఉండేది. అవును మరి... అంతవరకూ తనకి అక్షరాలే తెలియవు. దాంతో తన కూతురికి దగ్గరుండి ఏ సమయంలో అయినా నేర్పించడం కోసం ముందుగా తాను బ్రెయిలీ నేర్చుకుందా తల్లి. తర్వాతే కీర్తికి నేర్పించారామె. చదువూ త్వరగానే ఒంటపట్టిందామెకి. 18 ఏళ్ల వయసులో దూరవిద్యలో పదోతరగతి రాసి పాసై, అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. డిగ్రీ రెండో సంవత్సరంలోనే గ్రూప్‌-4 ఉద్యోగానికి ఎంపికై సహకారశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరింది. దాంతోనే సరిపెట్టుకోకుండా శాఖా పరీక్షలు రాస్తూ ప్రమోషన్లూ సాధించి, ప్రస్తుతం జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ హోదాలో ఉంది. గెజిటెడ్‌ హోదా కోసం టీఎస్‌పీఎస్‌సీ రెండేళ్ల కిందట నిర్వహించిన పరీక్షలు రాసి అందులోనూ ఉత్తీర్ణత సాధించింది. స్క్రీన్‌ రీడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ల్యాప్‌ట్యాపు, సెల్‌ఫోన్‌ని వాడుతుంది. మరోపక్క ఆన్‌లైన్‌ కోర్సులో చేరి సితార్‌లో మరిన్ని  నైపుణ్యాలు సాధించేందుకు కృషిచేస్తోంది.

అమ్మే లేకపోతే...
‘ఉద్యోగం చేసుకుంటూ... సంగీత సాధన చేస్తూ... తీరిక సమయంలో ఇంటి పనుల్లో సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది మా కీర్తి. నా కల నిజమైంది’ అని తల్లి సావిత్రి అంటే ‘అమ్మ లేకపోతే నేను లేను. తన వయసుని లెక్కచేయకుండా ఇప్పటికీ నేను ఎక్కడకు వెళ్తే అక్కడకు తోడుగా వస్తుంది. ఇలా పిల్లలను ప్రోత్సహించే తల్లి ఉంటే.. వైకల్యం ఏ బిడ్డకూ శాపం కాదు. మనలోని లోపాలు గుర్తు చేసుకొంటూ బాధపడేకంటే.. ప్రయత్నిస్తే అందరిలాగే గుర్తింపు తెచ్చుకోగలం’ అంటోంది కీర్తి.  

- రేవళ్ల వెంకటేశ్వర్లు, కత్తి గంగాధర్‌, నిజామాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్