చేపల మార్కెట్లో కూలీ... కూతుర్ని డాక్టర్‌ చేసింది!

ఏ ఆదివారం పూటో చేపల మార్కెట్‌కి వెళ్తే... కాసేపు అక్కడ నిలబడ్డానికే ఇబ్బంది పడి ముక్కు మూసుకుంటాం. కానీ పాతికేళ్లుగా రమణమ్మకి ఆ మార్కెట్టే దేవాలయం. చేపల్ని శుభ్రం చేసినందుకు ఇచ్చే అయిదూ, పదే దైవంతో సమానం. ఎందుకంటే ఆ డబ్బుతోనే కూతుర్ని మెడిసిన్‌ చదివించింది. కొడుకుని క్యాన్సర్‌ నుంచి కాపాడుకుంటోంది... కూతురి కలను నెరవేర్చడం కోసం ఓ అమ్మ చేస్తున్న జీవన పోరాటం ఇది...

Updated : 01 Jun 2022 07:23 IST

ఏ ఆదివారం పూటో చేపల మార్కెట్‌కి వెళ్తే... కాసేపు అక్కడ నిలబడ్డానికే ఇబ్బంది పడి ముక్కు మూసుకుంటాం. కానీ పాతికేళ్లుగా రమణమ్మకి ఆ మార్కెట్టే దేవాలయం. చేపల్ని శుభ్రం చేసినందుకు ఇచ్చే అయిదూ, పదే దైవంతో సమానం. ఎందుకంటే ఆ డబ్బుతోనే కూతుర్ని మెడిసిన్‌ చదివించింది. కొడుకుని క్యాన్సర్‌ నుంచి కాపాడుకుంటోంది... కూతురి కలను నెరవేర్చడం కోసం ఓ అమ్మ చేస్తున్న జీవన పోరాటం ఇది...

నలో చాలామంది చిన్న కష్టాలకే బేలగా మారిపోతాం. ‘నాకే ఎందుకొచ్చిందని’ భగవంతుణ్ని నిందిస్తాం. సాయం కోసం ఎదురుచూస్తాం. రమణి 24 ఏళ్లుగా ఆ కష్టాల మధ్యే ఉన్నా ఎవరినీ నిందించలేదు. ఎవరో వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దుతారని అనుకోలేదు. రెక్కల కష్టంతోనే కాలానికీ, కష్టానికీ ఎదురీదుతోంది. మనలాంటి ఎంతోమందిలో స్ఫూర్తిని రగిలిస్తోంది. తమిళనాడులోని మైలాడుదురై ఆమె స్వస్థలం. కొడుకు రవిచంద్రన్‌. కూతురు విజయలక్ష్మి. 24 ఏళ్ల క్రితం.... అప్పుడు విజయలక్ష్మి పదకొండు నెలల పాప. రమణి భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ కుటుంబ భారం తమ మీద పడుతుందని అనుకున్నారేమో బంధువులు ఆమెని దూరం పెట్టారు. చిన్న ఇల్లు తప్ప మరో ఆధారం లేదు. తనకు చదువూ లేదు. ఇక చేసేది లేక దగ్గర్లోని మార్కెట్లో చేపల్ని శుభ్రం చేసే పనికి కుదురుకుంది రమణి. రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయంతోనే పిల్లల కడుపు నింపేది. ఉన్న  కష్టాలు చాలవన్నట్లు  కొడుకు అనారోగ్యం...  ఆ అబ్బాయికి రక్తనాళాలకు సంబంధించిన క్యాన్సర్‌ ఉందనీ, మందులతోనే అతని ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు చెప్పాక... ఆమెకి తను చేస్తున్న పని ఎంత ముఖ్యమైందో తెలిసింది. అతి కష్టమ్మీద రవిచంద్రన్‌ ఆయుష్షుని పెంచుతూనే, పదో తరగతికి వరకూ చదివించింది. ఆ తర్వాత అతని ఆరోగ్యం సహకరించకపోవడంతో చదువు ఆగిపోయింది. జీవితాంతం మందులు వాడాల్సిన అన్న పరిస్థితి చెల్లెలు విజయలక్ష్మిని ఆలోచింప చేసింది. ఇలాంటి వారికి తాను అండగా నిలవాలనుకుందా అమ్మాయి. తన ఆశయాన్ని చెప్పి డాక్టర్‌ అవ్వాలనుందని తల్లిని అడిగింది. మరొకరయితే... ఎలా స్పందించి ఉండేవారో... కానీ రమణి మాత్రం కూతురి కలని నెరవేర్చాలనుకుంది. ఆ రోజు నుంచీ రెట్టింపు పనిచేయడం మొదలుపెట్టింది. 

ఇల్లు, నగలు అమ్మేసి...
కూతురి ఆశయం కోసం సొంతింటినీ, ఉన్న కొద్దిపాటి నగల్నీ అమ్మేసింది. వచ్చిన రూ.7 లక్షలతో విజయని వైద్యవిద్య కోసం రష్యాకు పంపింది. అక్కడ ఏటా రూ.5 లక్షలు కట్టాల్సి వచ్చేది. దాంతో చేస్తున్న పనితోపాటు, దొరికిన ఇతర పనులూ చేసింది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినా ఎంత సంపాదించగలదు? అయినా తను వెనుకాడలేదు. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ కూతుర్ని ఎంబీబీయెస్‌ చదివించింది. రష్యాలో చదువు ముగించుకొని ఈ మధ్యే విజయ సొంతూరికి వచ్చింది. ‘మా అమ్మ నా చదువు కోసం, మా అన్నయ్యకి మందులు కొనడం కోసం పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇకపై ఆమెను కష్టపడకుండా చూసుకుంటాను. ప్రస్తుతం భారతీయ వైద్య మండలిలో డాక్టర్‌గా నమోదు చేసుకునేందుకు నిర్వహించే ఎగ్జిట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నా’ అంటోంది విజయ.

అవంటే ప్రాణం...
కూతురు డాక్టర్‌ చదివినా రమణి దినచర్యలో ఏమార్పూ లేదు. చేపల మార్కెట్‌లో అదే పనిని అంతే ఇష్టంగా చేస్తోంది. మనుషులకన్నా జంతువులని ఎక్కువగా నమ్ముతానంటుంది తను. వీధి కుక్కలని ఎంతో ఇష్టంగా పెంచుతుంది. తనకున్నంతలో వాటికీ పెడుతుంది. ‘ఒంటరిగా ఇద్దరు పిల్లల్ని పెంచుకొచ్చానంటే.. ఎన్నో ఏళ్లుగా అవి మాకు రక్షణగా ఉండబట్టే. అందుకని అవే నాకు దేవుళ్లు’ అంటారామె వాటిని ప్రేమగా చూస్తూ.... ‘ఆస్తులు పోయినా నాకే బాధా లేదు. పదిమందికీ సేవ చేయాలన్న నా కూతురి కలను నెరవేర్చానన్న తృప్తి చాలు’. అని చెప్పుకొచ్చింది రమణి. ఆమె కృషి గుర్తించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రత్యేకంగా పిలిపించి ప్రశంసించారు

- బలభద్ర కీర్తి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్