వీరి బాట వారెవ్వా!

సామాన్యుల్ని అసామాన్యులను చేసేది ఆసక్తి, పట్టుదల మాత్రమే! వైకల్యం, వెనకబాటు, వైవాహిక జీవితం వంటి కారణాలతో వెనక్కి తగ్గాలనుకోలేదు. నిండైన గుండెధైర్యంతో అద్భుత విజయాలను సాధిస్తూ మహిళాశక్తిని నిరూపిస్తున్న వీళ్ల స్ఫూర్తిగాథలు చూడండి...

Updated : 03 Jun 2022 07:10 IST

సామాన్యుల్ని అసామాన్యులను చేసేది ఆసక్తి, పట్టుదల మాత్రమే! వైకల్యం, వెనకబాటు, వైవాహిక జీవితం వంటి కారణాలతో వెనక్కి తగ్గాలనుకోలేదు. నిండైన గుండెధైర్యంతో అద్భుత విజయాలను సాధిస్తూ మహిళాశక్తిని నిరూపిస్తున్న వీళ్ల స్ఫూర్తిగాథలు చూడండి...


ఆమె పరుగుకి తిరుగులేదు...

రెండు నిమిషాలు పరిగెట్టాలంటే మనలో చాలా మందికి ప్రాణసంకటమే! కానీ మల్లం రమ... 26 నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు పరిగెట్ట్టింది. అదీ చెప్పుల్లేకుండా. అలా ఆ పోటీలో లక్ష రూపాయలు గెల్చుకున్న రమ సాధారణ మహిళా రైతు కావడం విశేషం... తనెప్పుడూ ఏ పోటీలకూ వెళ్లకపోవడం మరింత విశేషం.

హిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు హుస్నాబాద్‌ పోలీసుశాఖ రెండేళ్లుగా ఈ పోటీలు పెడుతోంది. ఈసారి తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 30 ఏళ్లు పైబడిన మహిళలకోసం 5కే రన్‌ పోటీ పెట్టి విస్తృత ప్రచారం చేసింది. సిద్దిపేట జిల్లా మల్లంపల్లికి చెందిన మల్లం రమకు ఇవేమీ తెలియదు. ఆమెకు తెలిసిందల్లా పొలం పనులు మాత్రమే. ఉన్న రెండు ఎకరాల్లో పత్తి, మొక్క జొన్న సాగు చేస్తోంది. పొలంలో పని లేకుంటే కూలికి వెళుతుంది. భర్త సంపత్‌ కరీంనగర్‌లో కాంక్రీట్‌ మిల్లర్‌ పనికి వెళ్తాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు.. చరణ్‌, వరుణ్‌. పరుగు పోటీ గురించి ఒక్కరోజు ముందు తెలిసింది రమకు. చుట్టుపక్కల మండలాల నుంచి 500 మందికిపైగా మహిళలు ఎంతో సాధన చేసి పోటీకి వచ్చారు. పొలం పనులకు వేసుకునే ఓ పాత చొక్క వేసుకుని చెప్పుల్లేకుండా పరిగెట్టి పోటీలో వాళ్లందరినీ వెనక్కినెట్టేసింది రమ. ‘నాకీ పోటీల గురించి ఏమీ తెల్వదు. ఎవరో చెబితే వచ్చా. మా ఇంటి నుంచి పొలానికి 3కి.మీ ఉంటుంది. చెప్పులు లేకుండా పొలం కాడికి పోయి రావడం అలవాటే. సరే నేనూ పోటీపడి చూద్దాం అనుకున్నా. పరుగు మొదలెట్టాక గెలవాలన్న పట్టుదల వచ్చింది. నాకెటూ చదువు లేదు. గెలిస్తే వచ్చే లక్ష రూపాయలతో కనీసం నా పిల్లల్ని మంచిగా చదివించవచ్చు అనుకున్నా. గెలవడం ఇంత మంచిగా ఉంటుందని తెలీదు. చానా సంతోషంగా ఉంది. ఇకనుంచి ఆడవాళ్ల పరుగు పోటీలకు వెళ్తా’ అంటున్న రమ 26.24 నిమిషాల్లో 5కి.మీ గమ్యాన్ని చేరుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.


ఉపగ్రహాల తయారీలో ముందంజ...  

విశ్వరహస్యాలని ఛేదించాలనే ఆసక్తి ఆమెను సాంకేతిక విద్య వైపు నడిపించింది. రోదసీ ప్రయోగాల్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో పరిశోధనలు మొదలుపెట్టిన కూరపాటి సాయిదివ్య సొంతగా చిన్న ఉపగ్రహాన్ని రూపొందించి వినువీధుల్లోకి పంపించింది...

దివ్య చిన్నప్పట్నుంచీ చదువులో ముందుండేది. బాపట్ల ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో బీటెక్‌ చేసింది. తర్వాత కేఎల్‌ యూనివర్సిటీలో కమ్యూనికేషన్‌ అండ్‌ రాడార్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ చదివింది. ప్రస్తుతం శాటిలైట్‌ కమ్యూనికేషన్‌పై పీహెచ్‌డీ చేస్తోంది. ఈ క్రమంలో తన పరిశోధనలకు కావాల్సిన సమాచారం కోసం... 400 గ్రాముల బరువుండే ‘లక్ష్యశాట్‌’ ఉపగ్రహాన్ని ఎనిమిది నెలలు కష్టపడి తయారు చేసింది. యూకేకు చెందిన బీ2 స్పేస్‌ కంపెనీ సహకారంతో దీన్ని ఇటీవల స్ట్రాటో ఆవణంలోకి పంపి.. అది అందించిన డేటాని కూడా తీసుకుంది. ‘తక్కువ ఖర్చుతో సూక్ష ఉపగ్రహాల తయారు చేయటమే నా లక్ష్యం. దీని కోసం మావారితో కలిసి ‘ఎన్త్‌ స్పేస్‌టెక్‌’ ను ప్రారంభించా. లక్ష్యశాట్‌ తయారీకి రూ.2లక్షలు మాత్రమే అయ్యింది. ప్రస్తుతం చిన్న ఉపగ్రహాల తయారీ, ప్రయోగాల్లో పరిశోధకులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తక్కువ ఖర్చుతో చేయటం ద్వారా యువశాస్త్రవేత్తల్ని ప్రోత్సహించాలన్నది నా లక్ష్యం’ అనే దివ్య గర్భిణిగా ఉండగా లక్ష్యశాట్‌ని పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం మరో ఉపగ్రహాన్ని భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి పంపేందుకు సిద్ధం అవుతోంది. పెళ్లైనంత మాత్రాన మన కలల్ని, లక్ష్యాన్ని వదులుకోనవసరం లేదు, మన పట్టుదల చూస్తే ఇంట్లో వాళ్లూ మద్దతిస్తారంటోందీ యువ తేజం.


చక్రాల కుర్చీలో.. 59 దేశాలు చుట్టింది!

అన్నీ బాగున్నవాళ్లకే ఒంటరి ప్రయాణాలు.. అదీ కొత్త ప్రదేశాలంటే భయపడతారు. అలాంటిది చక్రాల కుర్చీలో ప్రపంచాన్ని చుట్టేస్తోంది పర్వీందర్‌. అంతేనా సాహస క్రీడలనూ ప్రయత్నిస్తోందీ ధీశాలి.

పర్వీందర్‌ చావ్లా బాల్యం ఆటపాటలతోనే సాగింది. వాళ్లది పంజాబ్‌. ముంబయిలో స్థిరపడ్డారు. పదో తరగతిలో దవడ కదలిక ఇబ్బందైంది, ఒళ్లంతా నొప్పులు. మందులతో తగ్గింది. కాలేజీ చదువు పూర్తవగానే సమస్య తిరగబెట్టింది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అన్నారు వైద్యులు. అప్పుడామెకు 22 ఏళ్లే. రోగనిరోధకత ఆరోగ్య కణాలపై దాడిచేయడం కారణంగా కీళ్లు వాచి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. చివరికి మంచానికే పరిమితమైంది. చికిత్స తర్వాత 38 ఏళ్లప్పుడు నడక సాధ్యమైంది. అదీ కొద్దిసేపే. ఈ క్రమంలో ఎన్నో జాలి చూపులు, నిరాశాపూరిత మాటలు. వాటి నుంచి బయటపడటానికి ఉద్యోగంలో చేరింది. అది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నటి భూమిక తనకు బంధువు. తను ఆటోమేటిక్‌ వీల్‌ చెయిర్‌ని బహూకరించింది. దుబాయ్‌ వెళ్లినపుడు చక్రాల కుర్చీ వారికి అన్ని సదుపాయాలూ ఉండటం గమనించి నగరాన్ని ఒంటరిగా చుట్టేసింది పర్వీందర్‌. అప్పట్నుంచి ఇలాంటి సదుపాయాలున్న ప్రాంతాలకు వెళ్లి రావడం ప్రారంభించింది. ‘కాళ్లు పూర్తిగా కదల్లేని పరిస్థితి కాదు. దీంతో ఈత, కయాకింగ్‌, పారాసెయిలింగ్‌, పారాగ్లైడింగ్‌ వంటివెన్నో చేశా. మొదట్లో జాలి పడ్డవారే ఇప్పుడు నీ ధైర్యానికి సలాం అంటున్నారు’ అని వివరిస్తోంది 52 ఏళ్ల పర్వీందర్‌. ఇప్పటి వరకూ 59 దేశాలు పర్యటించింది. ఆ వీడియోలను ఇన్‌స్టాలో ఉంచుతుంది. ‘నిన్ను నువ్వు నమ్మినంత కాలం.. ఏదీ నిన్ను ఆపలేదు’ అని సలహానీ ఇస్తోంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్