ప్రపంచాన్ని చదువు నాన్నా!

లాక్‌డౌన్‌లో పిల్లల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టడానికి ఎంత కష్టపడ్డాం? వాళ్లూ స్నేహితులతో ఆటపాటలు లేక విసుగు చెందారు. అనీఖ కొడుకు ప్రాన్ష్‌దీ ఇదే పరిస్థితి. అయితే తను అందరిలా ఏమీ చేయలేం కదా అని సరిపెట్టుకోలేదు

Updated : 02 Aug 2022 08:38 IST

లాక్‌డౌన్‌లో పిల్లల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టడానికి ఎంత కష్టపడ్డాం? వాళ్లూ స్నేహితులతో ఆటపాటలు లేక విసుగు చెందారు. అనీఖ కొడుకు ప్రాన్ష్‌దీ ఇదే పరిస్థితి. అయితే తను అందరిలా ఏమీ చేయలేం కదా అని సరిపెట్టుకోలేదు. ప్రకృతి ఒడిలో పాఠాలు మొదలుపెట్టింది. వాళ్ల కథేంటో చదివేయండి.

2020.. లాక్‌డౌన్‌. ఇంటి నుంచి అడుగు బయట పెట్టే వీల్లేకపోవడం, ఆన్‌లైన్‌ తరగతులతో నాలుగేళ్ల ప్రాన్ష్‌ విసిగిపోయాడు. దాన్ని గమనించిన వాళ్లమ్మ అనీఖ.. నేర్పించే పద్ధతిని మార్చాలనుకుంది. వీళ్లది పుణె. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. కొడుకుతో ప్రయాణాలు మొదలుపెట్టింది. దాచిన మొత్తాన్ని తీసి ఎక్కడెక్కడికి వెళ్లాలన్నది ప్లాన్‌ చేసేది. భర్త పనిలో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్లడం ఈ విషయంలో సాయపడిందంటుందీమె. ‘వెళ్లే ప్రాంతం మాత్రమే ఎంచుకునేదాన్ని ఏమేం చూడాలి, ఎన్నిరోజుల్లో ముగించాలన్నది నిర్ణయించేదాన్ని కాదు. హోటళ్లలో కాక ఎవరింటికైనా అతిథిగా వెళ్లేవాళ్లం. దీంతో అక్కడి సంస్కృతి, స్థానిక వంటలు తెలిసేవి. పుస్తకాల్లో పర్యావరణహిత ఇళ్లు అని చూపించగలం. ప్రాన్ష్‌ వాటిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. సరస్సులు, లద్దాఖ్‌లోని పర్వతాలు, నదులు, గుహలు.. జాగ్రఫీ పుస్తకాల్లో చదువుకొనే విషయాలెన్నో నేరుగా చూసి తెలుసుకున్నాడు’ అని చెబుతోంది అనీఖ.

జీవిత పాఠాలూ..

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హరియాణా.. ఇలా దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పర్యటించింది వీళ్ల కుటుంబం. ప్రాంతాలు, సంస్కృతిని తెలుసుకోవడమే కాదు. రాయడమూ రావాలన్నది అనీఖకు తెలుసు. అందుకే రోజూ కొంత సమయం దీనికీ కేటాయిస్తుంది. అప్పటివరకూ తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల గురించి రోజూ ప్రాన్ష్‌ని డైరీలో రాయమనడం, ఖర్చు లెక్క చేయడం చేపిస్తుంది. ‘ఓసారి హిమాచల్‌ ప్రదేశ్‌ సొరంగం గుండా ప్రయాణిస్తున్నాం. స్కూటర్‌ లైట్‌ వెలగడం లేదు. గట్టిగా పట్టుకొని ఉంచాలి. నేనేమో బండి నడుపుతున్నా. దీంతో ప్రాన్ష్‌ సాయం చేస్తానని దారంతా పట్టుకొనే ఉన్నాడు. తను ఇంటికి చేరాలంటే ఆ లైట్‌ ఎంత అవసరమో వాడికి తెలిసిందనేగా! ఇదే కాదు.. ఇంట్లో ఆహారం విలువైంది, వృథా చేయకూడదు, ఏదీ తినను అనకూడదు అని చెప్పినా వినేవాడు కాదు. ఇప్పుడు అనుభవంలో తెలుసుకున్నాడు. ఓసారి పర్వత ప్రాంతంలో నాకు సుస్తీ చేసింది. నాకెలా ఉందో కనుక్కోవడం, దగ్గరి హోటల్‌ నుంచి వేడినీళ్లు తెచ్చివ్వడం వంటివి చేశాడు. అప్పటికి వాడికి అయిదేళ్లే. ఇవన్నీ జీవిత పాఠాలే’ అంటుంది అనీఖ.

సవాళ్లున్నాయ్‌..

ఎంత నేర్చుకునే వీలున్నా.. తోటి పిల్లలతో కలిసి చదువుకోలేకపోవడం, మాట్లాడలేకపోవడం లోటేనన్న విషయాన్ని అనీఖ గ్రహించింది. అందుకే వెళ్లిన ప్రాంతాల్లోని ఎన్‌జీఓలకు వెళ్లి వలంటీర్‌గా సేవలందించేది. దీంతో ప్రాన్ష్‌కీ పిల్లలతో కలిసి ఆడుకునే వీలుండేది. కొన్నిసార్లు సొంత వాహనంలో వెళ్లడానికి వీలయ్యేది కాదు. అప్పుడు స్థానిక రవాణానే మార్గం. అది కొంత ఇబ్బందయ్యేది. ‘ఎత్తైన ప్రదేశాలకు చిన్నపిల్లలతో వెళ్లడం ఇబ్బందే. సమయం మన చేతిలో ఉండదు. వాళ్ల అవసరాలు తీర్చడమూ కష్టమే. దీనికితోడు వాళ్లు సర్దుకుపోలేకపోవచ్చు. అయితే చాలాసార్లు పరిస్థితికి తగ్గట్టుగా వాడూ సర్దుకుపోయేవాడు’ అని చెప్పే అనీఖ.. గ్రేడ్‌లంటూ పరిగెడతాం కానీ.. ప్రపంచాన్ని చదవడం నేర్పిస్తే బోలెడు పాఠాలు నేర్పించిన వాళ్లమవుతామంటోంది. పిల్లల్ని ర్యాంకుల రేసుల్లోకి నెట్టొద్దని హితవు చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్