ఆ పిల్లల కోసమే వార్‌రూమ్‌!

టీచర్‌గా పాఠాలు బోధించడంతోనే తృప్తి చెందలేదామె.. వాళ్లు జీవితంలో ఎదిగేందుకూ సాయపడుతున్నారు. పిల్లల్లో లెక్కలపై ఉన్న భయం పోగొడుతున్నారు. అమ్మాయిలు బడికి దూరమవడానికి కారణాల్ని అన్వేషించి..పరిష్కారాలనూ చూపిస్తున్నారు. వీటికోసం వినూత్న మార్గాల్లో వెళ్తోన్న తౌటం నిహారిక.. తన ప్రయాణం గురించి వసుంధరతో పంచుకున్నారిలా...

Updated : 25 Aug 2022 08:02 IST

టీచర్‌గా పాఠాలు బోధించడంతోనే తృప్తి చెందలేదామె.. వాళ్లు జీవితంలో ఎదిగేందుకూ సాయపడుతున్నారు. పిల్లల్లో లెక్కలపై ఉన్న భయం పోగొడుతున్నారు. అమ్మాయిలు బడికి దూరమవడానికి కారణాల్ని అన్వేషించి..
పరిష్కారాలనూ చూపిస్తున్నారు. వీటికోసం వినూత్న మార్గాల్లో వెళ్తోన్న
తౌటం నిహారిక.. తన ప్రయాణం గురించి వసుంధరతో పంచుకున్నారిలా...

మాది హనుమకొండ జిల్లా వడ్డేపల్లి. నాన్న సైనిక ఉద్యోగి. దాంతో దిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాల్లో చదువుకున్నా. నాన్న కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నా. 1998లో ఎస్జీటీగా ఎంపికయ్యా. ఏ రంగంలో ఉన్నా విభిన్నంగా పని చేయాలన్నది నా తపన. ప్రస్తుతం జనగామ జిల్లా, కామారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో గణితం బోధిస్తున్నా. వరంగల్‌ జిల్లా గొర్రెకుంటలోనూ పనిచేశా. అక్కడ బాలికల హాజరు 30-40 శాతమే ఉండేది. కారణాలు అన్వేషిస్తే పలు విషయాలు తెలిశాయి. అందులో పీరియడ్స్‌ ఒకటి. అంతకు ముందు డిప్యుటేషన్‌ మీద జిల్లా బాలికల అభివృద్ధి అధికారిగానూ పనిచేసి ఉన్నా. అందువల్ల ఇక్కడి సామాజిక పరిస్థితులపైనా అవగాహన ఉంది. అసలు పీరియడ్స్‌ అని చెప్పుకోవడానికే సంశయిస్తారు పిల్లలు. ఆ సమయంలో సమస్యల్ని ఎవరికీ చెప్పుకోలేరు. చాలామంది తల్లిదండ్రులూ నిరక్షరాస్యులే. వారికీ అవగాహన లేకపోవడంవల్ల బడి మాన్పించేసేవారు. రుతుక్రమం సమయంలో శుభ్రత, ధరించాల్సిన దుస్తులు తదితర అంశాలపై బాలికలకు, వారి తల్లులకు అవగాహన కల్పించా. పాత వస్త్రాలు వాడటంవల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చేవి. అందుకే విద్యార్థినులకు ఉచితంగా ప్యాడ్లు పంచి, వాటిని వాడిస్తే ఫలితం ఉంటుందని భావించా. స్కూల్‌ టాయిలెట్లలో నీరు ఉండేలా చేశా. ఇందుకోసం రూ.8లక్షలు ఖర్చయింది. మా స్నేహితులూ ఆర్థిక సాయం చేశారు. ఓ ఏడాదంతా ప్రయత్నిస్తే పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. హాజరు శాతం 100కు పెరిగింది. చదువుల్లోనూ మెరుగయ్యారు. ఇప్పటికీ వీళ్లకి ప్యాడ్లు అందిస్తున్నాం. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 11 పాఠశాలల్లో ప్యాడ్లు అందిస్తున్నాం. ఇప్పటి దాకా రూ.4 లక్షలపైచిలుకే ఖర్చయింది. కామారెడ్డి గూడెం వచ్చాక మా స్కూల్‌తోపాటు మరో స్కూల్లోనూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టా. మరిన్ని చోట్లకు విస్తరిస్తా. ఈ దిశగా  కొన్ని స్వచ్ఛంద సంస్థలకూ సహకారాన్ని అందిస్తున్నాం.


టీనేజ్‌లో వచ్చే హర్మోన్ల మార్పులు, ఆకర్షణలు.. తదితర వాటివల్ల అమ్మాయిలు ఒత్తిడికి గురవుతున్నారు. వీటిని చర్చించేందుకు బాలికలకు ‘కలాం వార్‌రూమ్‌’ ఏర్పాటు చేశా. పదిహేను రోజులకోసారి సమావేశం ఏర్పాటుచేసి కౌమార దశలో మార్పుల గురించి అవగాహన కలిగిస్తాం. అందుకు అవసరమైన పుస్తకాల్నీ అందిస్తాం. బాలికల విషయంలో కొందరి అసహజ ప్రవర్తన, లైంగిక వేధింపులు ఉంటున్నాయి. అలాంటప్పుడు ఎలా స్పందించాలో చెబుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అమ్మాయిలు పదో తరగతితో ఆపేస్తున్నారు. కనీసం డిగ్రీ వరకైనా చదివేలా పాఠశాల దశలోనే వారికి బయట ప్రపంచాన్ని చూపుతాం, సమాజంలో జరుగుతున్న మార్పులు గురించి చెబుతుంటా. లక్ష్యాల్ని నిర్దేశించుకుని.. నెరవేర్చుకునేందుకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నాం. ఆ ప్రభావంతో చాలామంది సాధారణ డిగ్రీతోపాటు, ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు కూడా.


టీచర్‌గానూ పురస్కారాలు..

పిల్లల్లో లెక్కలంటే భయం పోగొట్టడానికి మొదటి నుంచి సులభ పద్ధతుల్లో బోధించడానికి ప్రయత్నించే దాన్ని. ఆ క్రమంలోనే ‘యూఎస్‌ఏ- ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌’ నుంచి ప్రతిష్ఠాత్మక ‘ఫుల్‌బ్రైట్‌ ఫెలోషిప్‌’ (2018) అందుకున్నా. ఆర్నెల్లు అమెరికాలో ఉండి 20 దేశాల ప్రతినిధులతో కలిసి ఇంగ్లిష్‌, గణితం సబ్జెకుల్ని వినూత్నంగా బోధించడంలో శిక్షణ తీసుకున్నా. అమ్మాయిలకు కుట్లు, అల్లికల్లాంటి సంప్రదాయ వృత్తులు కాకుండా సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ వంటి కోర్సులు తేవాలని ప్రాజెక్టు మాడ్యూల్‌ తయారుచేశా. గణితం అంటే భయం పోగొట్టేందుకు  నోమోగ్రామ్‌, డెస్మాస్‌, జియోజీబ్రా, ఫొటోమ్యాట్‌.. వంటి డిజిటల్‌ వేదికల్ని వారికి పరిచయం చేశా. స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మీదా ప్రత్యేక తరగతులు తీసుకుంటా. ఉపాధ్యాయురాలంటే నిత్య విద్యార్థి కూడా. అందుకే గణితంతోపాటు ఇంగ్లిష్‌, సైకాలజీల్లోనూ పీజీలు చేశా. మావారు వేముల రాజ్‌కుమార్‌ ఎల్‌ఐసీ ఉద్యోగి. అబ్బాయి రితిక్‌ అమెరికాలో ఎం.ఎస్‌. చేస్తుండగా, అమ్మాయి రీతిక ఆర్కిటెక్చర్‌ చదువుతోంది. మహిళల సాధికారత కోసమూ పని చేయాలనుకుంటున్నా.  దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా.

- మురళీకృష్ణ మునగ, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్