బోధనంటే ప్రాణం... అందుకే పురస్కారం

గణితం, ఫిజిక్స్‌.. ఈ రెండు పేర్లూ వినగానే వణికే పిల్లలెందరో! ఆ భయాన్ని పోగొట్టి సరదాగా నేర్చుకునేలా చేస్తున్నారీ టీచరమ్మలు. ప్రకృతి, కళలు, ప్రయోగాలను జోడిస్తూ వాటిని పిల్లలకు చేరువ చేశారు. అంతేనా.. వివిధ పోటీల్లో రాణించేలానూ చూస్తున్నారు సునీతారావు, రావి అరుణ. ఆ శ్రమే వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని సాధించిపెట్టింది. ఈ సందర్భంగా వారి విశేషాలను వసుంధరతో పంచుకున్నారు...

Published : 27 Aug 2022 00:25 IST

గణితం, ఫిజిక్స్‌.. ఈ రెండు పేర్లూ వినగానే వణికే పిల్లలెందరో! ఆ భయాన్ని పోగొట్టి సరదాగా నేర్చుకునేలా చేస్తున్నారీ టీచరమ్మలు. ప్రకృతి, కళలు, ప్రయోగాలను జోడిస్తూ వాటిని పిల్లలకు చేరువ చేశారు. అంతేనా.. వివిధ పోటీల్లో రాణించేలానూ చూస్తున్నారు సునీతారావు, రావి అరుణ. ఆ శ్రమే వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని సాధించిపెట్టింది. ఈ సందర్భంగా వారి విశేషాలను వసుంధరతో పంచుకున్నారు...


ప్రయోగాలతో పాఠాలు..
రావి అరుణ

బోధనలో 26 ఏళ్ల అనుభవం నాది. కృష్ణా జిల్లా కానూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నా. పుట్టింది మచిలీపట్నం. చిన్నప్పటి నుంచీ పరిశోధనలంటే ఇష్టం. అందుకే సైన్స్‌పై మక్కువ పెంచుకున్నా. ఎంఎస్సీ, ఎంఈడీ, పీహెచ్‌డీ చేశా. 1996లో డీఎస్సీ చేసి ఉపాధ్యాయవృత్తిలోకి వచ్చా. విజయవాడ రూరల్‌లోని ఎనికెపాడు, రామవరప్పాడు, నిడమనూరు, ఉంగుటూరు గ్రామాల్లో చేసి, గత అయిదేళ్లుగా కానూరులో చేస్తున్నా. భౌతికశాస్త్రం అంటేనే విద్యార్థుల్లో భయం. సరైన రీతిలో బోధించాలేగానీ.. దీన్ని వాళ్లకు తేలిగ్గా, ఇష్టపడేలా నేర్పించొచ్చు. అందుకే పరిసరాలు, చుట్టూ ఉన్న పరిస్థితులను అనుసంధానిస్తూ బోధిస్తుంటా. చెప్పడం కంటే చేయడం ద్వారా వాళ్ల మెదళ్లలోకి సులువుగా వెళ్లేలా చేయొచ్చు. అందుకే ప్రయోగాల ద్వారా వివరిస్తా, ప్రాజెక్టులు చేయిస్తా. దీంతో పిల్లలూ ఆసక్తి కనబరుస్తారు.

మొదట్లో సైన్స్‌ఫెయిర్‌లో పోటీలకు విద్యార్థులకు శిక్షణిచ్చేదాన్ని. జిల్లా స్థాయులో నాలుగు సార్లు ప్రథమ బహుమతి సాధించారు. రాష్ట్ర, జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లోనూ సత్తాచాటారు. స్టేట్‌ సైన్సు కాంగ్రెస్‌లో ప్రథమ బహుమతి సాధించారు. నా శిక్షణలో బహుమతి తప్పక రావాల్సిందే అన్న ఆత్మవిశ్వాసంతో ఉంటారు పిల్లలు. అందుకు ఆనందంగా ఉంటుంది. ఇన్నేళ్లలో ప్రభుత్వం ఇచ్చినవి మినహా ఒక్క సెలవూ ఎక్కువ వాడలేదు. పిల్లలకు అవసరం అనిపిస్తే ఆదివారాలూ ప్రత్యేక తరగతులు చెబుతా. అందరూ ఒకే తీరులో అర్థం చేసుకోలేరు కదా! అలాంటి విద్యార్థులను ఎంపిక చేసి, వాళ్లకి అర్థమయ్యేంత వరకూ మళ్లీ మళ్లీ చెబుతుంటా. 2018లో కృష్ణా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, సైన్స్‌ఫెయిర్లలోనూ పలు పురస్కారాలు అందుకున్నా. 2020లో కుప్పం అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులకు విజ్ఞానశాస్త్ర పోటీ నిర్వహించింది. దీనిలో అయస్కాంత, విద్యుత్‌ క్షేత్రాలు ఉపయోగించి వ్యవసాయంలో అధిక దిగుబడులు ఎలా సాధించొచ్చో చూపించి ప్రథమ బహుమతి పొందా. కరోనా సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలైన విద్యావారధి, ఆన్‌లైన్‌ తరగతులకు లైవ్‌ ప్రెజంటర్‌గా, రాష్ట్రస్థాయి రిసోర్సు పర్సన్‌గా వ్యవహరించా. సైన్స్‌ సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి సాయపడాలని నమ్ముతా. నా విద్యార్థులు ఒక్కరైనా దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదిగితే చూడాలన్నది నా కల.

- మురాల అనిల్‌ కుమార్‌, కానూరు


గణితానికి కళల్ని జోడిస్తూ..
సునీతారావు

మాది మైసూర్‌ అయినా ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. తర్వాత చెన్నైలో చదువుకున్నా. బ్యాంకు ఆఫీసర్‌ అవ్వడం నా కల. అనుకోకుండా 1990లో ఉపాధ్యాయురాలినయ్యా. చెన్నైలో పలు విద్యా సంస్థల్లో పనిచేశా. 2005లో హైదరాబాద్‌కు వచ్చి దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చేరా. వివిధ పదవులలో పనిచేసి ప్రిన్సిపల్‌ స్థాయికి ఎదిగా. మావారు శంకరరావు ఇంజినీర్‌. మాకు ఇద్దరబ్బాయిలు. విషయాన్ని బోధించుకుంటూ వెళ్లడం కాకుండా పిల్లలకు దానిపై ఆసక్తి కలిగేలా చూడాలనుకుంటా. అందుకే పిల్లలు కష్టంగా భావించే గణితానికి మ్యూజిక్‌, డ్యాన్స్‌, చిత్రలేఖనం వంటి కళలను అనుసంధానిస్తా. దీంతో ఉత్సాహంగా నేర్చుకుంటారు. చెన్నెలో పని చేస్తున్నపుడు పదేళ్లు ‘జాయ్‌ఫుల్‌ టీచింగ్‌ ఆఫ్‌ మ్యాథ్స్‌’లో శిక్షణ తీసుకున్నా. దాన్నిలా ఉపయోగిస్తున్నా. 1997లో చైన్నెలో సీబీఎస్‌ఈ తరఫున తొలి మ్యాథ్స్‌ ల్యాబ్‌ ప్రారంభించిన ఉపాధ్యాయురాలిని నేనే.

గణితంతోపాటు సోషల్‌సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌నీ బోధిస్తా. సబ్జెక్టు ఏదైనా ఉల్లాసంగా నేర్చుకునేలా చూస్తా. చదువొక్కటే కాదు వ్యక్తిత్వం, నైతిక విలువలనూ నేర్పిస్తా. అయిదేళ్లుగా సీబీఎస్‌ఈకి రిసోర్స్‌ పర్సన్‌గా పాఠ్యాంశాల తయారీ, అభివృద్ధిలో పాల్గొంటున్నా. జాతీయ విద్యా విధానం వచ్చాక పాఠ్యాంశాల పునర్నిర్మాణం, జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌, ఆర్ట్‌ ఇంటిగ్రేషన్‌, 360 డిగ్రీ రిపోర్టు కార్డు, వనరుల సద్వినియోగం, వర్క్‌షీట్‌ బుక్‌లెట్లు తయారీపై దృష్టి పెట్టా. సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ నిపుణులతో కలిసి పుస్తకాలు, మాడ్యుల్స్‌ రూపొందిస్తున్నా. ‘దీక్ష’ ప్లాట్‌ఫాంకి ఆన్‌లైన్‌ సమాచారం తయారు చేసిస్తున్నా. అలా వేలమంది ప్రిన్సిపల్స్‌, ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలు అందించే క్రతువులో భాగస్వామినయ్యా. 2017-19 వరుసగా మూడేళ్లు అంతర్జాతీయ సైన్స్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌ తరఫున ఉత్తమ ప్రిన్సిపల్‌గా అవార్డు అందుకున్నా. పదేళ్లుగా బ్రిటిష్‌ కౌన్సిల్‌ తరఫున పాఠ్యాంశాల రూపకల్పనలో భాగస్వామినయ్యా. లాక్‌డౌన్‌లోనూ కేంద్ర విద్యాశాఖ తరఫున వెబినార్‌, మనోదర్పణ్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా. అన్ని పాఠశాలల్నీ.. ఒకే స్థాయికి తీసుకెళ్లి విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కేలా చూడాలన్నదే నా అభిమతం.

-యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్